Read it there అక్కడే చదివించాలి
ABN , Publish Date - Feb 17 , 2026 | 11:35 PM
Read it there ఒక పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్- ఆర్‌జీయూకేటీ)కి సహజంగా ఇద్దరో.. ముగ్గురో.. నలుగురో ఎంపికవుతుంటారు. అంతకు మించితే అరుదుగా చెప్పుకుంటారు. కానీ కొత్తవలస జ్యోతిబా బీసీ గురుకులం నుంచి గత ఏడాది ఏకంగా 13 మంది విద్యార్థినులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు.
అక్కడే చదివించాలి
ఐదులో ప్రవేశానికి అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు
ఇప్పటికే 40 సీట్లకు 123 రాక.. మార్చి 4 వరకు గడువు
కొత్తవలస జ్యోతిబా గురుకులానికి డిమాండ్
గత ఏడాది ఏకంగా 13 మంది ట్రిపుల్ ఐటీ(ఆర్‌జీయూకేటీ)కి ఎంపిక
అన్ని అంశాల్లో ఉన్నతంగా రాణిస్తున్న విద్యార్థినులు
రాష్ట్ర స్థాయిలో ఈ విద్యాలయానికి ప్రత్యేక గుర్తింపు
గత ఏడాది ప్రపంచ పుట్‌బాల్ ప్లేయిర్ రాక
ఒక పాఠశాల నుంచి ట్రిపుల్ ఐటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్- ఆర్‌జీయూకేటీ)కి సహజంగా ఇద్దరో.. ముగ్గురో.. నలుగురో ఎంపికవుతుంటారు. అంతకు మించితే అరుదుగా చెప్పుకుంటారు. కానీ కొత్తవలస జ్యోతిబా బీసీ గురుకులం నుంచి గత ఏడాది ఏకంగా 13 మంది విద్యార్థినులు ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. దీంతో ఆ విద్యాలయం పేరు రాష్ట్రస్థాయిలో మారుమోగింది. అక్కడి బోధన పద్ధతులు, క్రమశిక్షణ, ఉపాధ్యాయుల ప్రోత్సాహం తదితర అంశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ ప్రభావం ఈ ఏడాది ప్రవేశాలపై పడింది. చాలా మంది తల్లిదండ్రులు తమ కుమార్తెను చదివిస్తే అక్కడే చదివించాలని కంకణం కట్టుకున్నారు. ఇంకా 15 రోజులు గడువు ఉండగా ఇప్పటికే అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి.
శృంగవరపుకోట/లక్కవరపుకోట, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి):
మహత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి ప్రవేశానికి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామ సమీపంలో ఉన్న కొత్తవలస జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో చదవుకొనేందుకు 40 సీట్లకు గాను ఇప్పటికే 123 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. మార్చి 4వరకు గడువు ఉండడంతో ఇంతకు నాలుగు రెట్ల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని పాఠశాల టీచర్లు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది ఒక్కో సీటుకు ఇరవై మంది వరకు పోటీ పడ్డారు. 2024- 2025లో 13 మంది బాలికలు రాష్ట్రంలోని వివిధ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశం పొందారు. దీంతో అత్యధిక శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ పాఠశాలలో చదివించేందుకు అసక్తి చూపుతున్నారు. మెరుగైన ఫలితాలు కనిపిస్తుండడంతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌వోమ్ గత ఏడాది నవంబర్‌లో సందర్శించడంతో ఈ పాఠశాల పేరు మరింతగా వార్తల్లోకి ఎక్కింది.
గత ఏడాది సత్తా చాటిన బాలికలు
జామి మండలం అలమండ గ్రామానికి చెందిన గేదల పూజిత(600/588), కె.చరితశ్రీ (600/687), పి.సృజన (600/585) కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామానికి చెందిన పి.లీలాచైతన్య (600/586), గొల్లలపాలెంనకు చెందిన పి.భార్గవి (600/585), సాంబయ్యపాలెం గ్రామానికి చెందిన ఎన్.గిరిజ (600/583), కొత్తవలస గ్రామానికి చెందిన ఎస్.లిఖిత (600/570), ఎస్.కోట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన ఓ.కావ్య (600/585), జామి మండలం అన్నమరాజుపేట గ్రామానికి చెందిన కె.వేణు (600/582),లక్కవరపుకోట మండలం చందులూరు గ్రామానికి చెందిన జి. బాలచంద్రిక (600/580), జామి మండలం కలగాడ గ్రామానికి చెందిన ఆర్.జాహ్నవి(600/570) లక్కవరపుకోట మండలం రేల్లి గైవరమ్మపేట గ్రామానికి చెందిన పి.జాహ్నవి (600/569) ఖాసాపేట గ్రామానికి చెందిన కె.గాయత్రి (600/569) ఉన్నతమైన మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీలకు ఎంపికయ్యారు. ఆరుగురు నూజివీడు ఐఐఐటీ, నలుగురు శ్రీకాకుళం ఐఐఐటీ, ఇద్దరు ఒంగోలు ఐఐఐటీ, ఒకరు ఆర్.కె వాలీ ఐఐఐటీల్లో ప్రవేశాలు పొందారు.
ఫ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నడుస్తున్న మిగిలిన ఆరు జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల నుంచి ఒకట్రెండు ట్రిపుల్ ఐటీ(ఆర్‌జీయూకేటీ) సీట్లు వస్తే కొత్తవలస గురుకులం నుంచి ఏకంగా 13 మంది ఎంపికయ్యారు.
గత టీడీపీ హయాంలోనే గురుకులాలకు నాంది
రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలను నియోజకవర్గంనకు ఒక్కటి చొప్పున ఏర్పాటు చేసింది. ఇవన్నీ 2019-2020 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయి. మొదట ఐదో తరగతి నుంచి 8వ తరగతి వరకు బీసీ పేద విద్యార్థులకు లాటరీ పద్ధతిలో ప్రవేశాలు కల్పించారు. ఈ విధంగా కొత్తవలస మండలం బాలికల కోసం ఈ పాఠశాలను మంజూరు చేశారు. అయితే ఈ మండల పరిధిలో భవనాలు అందుబాటులో లేకపోవడంతో అప్పటి, ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామ సమీపంలో అద్దెభవనాలను సమకూర్చారు. దీంతో అప్పటి నుంచి ఈ పాఠశాల ఇక్కడే నడుస్తోంది.
ఆది నుంచీ ఉత్తమ ఫలితాలు
2021-2022 విద్యాసంవత్సరంలో మొదటి టెన్త్ బ్యాచ్‌కు చెందిన 28 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 27మంది ఉత్తీర్ణత పొందారు. ఆరుగురికి 500 పైబడి మార్కులు వచ్చాయి. 2022-2023 విద్యాసంవత్సరంలో 37 మందికి గాను 36 మంది ఉత్తీర్ణులయ్యారు. 10 మంది బాలికల వరకు 500 మార్కులు తెచ్చుకున్నారు. 2023-2024 విద్యాసంవత్సరంలో 35కు 35 మంది ఉత్తీర్ణత సాధించారు. 500కు పైబడిన మార్కులను 22మంది దక్కించుకున్నారు. 2024-2025 విద్యాసంవత్సరంలో 70 మంది పదోతరగతి పరీక్షలు రాశారు. అందరూ ఉత్తీర్ణత పొందడంతో పాటు 52 మందికి 500కు పైగా మార్కులు వచ్చాయి. ఈ బ్యాచ్‌లో 13 మందికి రాష్ట్రంలో వున్న అన్ని త్రీపుల్ ఐటీల్లోను సీట్లు దక్కాయి. దీంతో పాఠశాల పేరు అంతటా మారుమోగింది.
- పదో తరగతిలో మెరుగైన ఫలితాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన విద్యార్థుల్లో ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు.
గత ఏడాది నవంబర్‌లో డేవిడ్ బెక్‌వోమ్ రాక
గత ఏడాది నవంబర్ 26న ప్రపంచ పుట్‌బాల్ ప్లేయిర్ డేవిడ్ బెక్‌వోమ్ ఈ పాఠశాలను సందర్శించారు. కొంత సమయం విద్యార్థులతో మమేకమయ్యారు. అక్కడి విధానాలు, పరిసరాలను మెచ్చుకున్నారు.
ప్రత్యేకతలివీ..
ప్రతి తరగతిలోనూ విద్యార్థులను ఐదు బృందాలుగా విభజిస్తున్నారు. ఒక్కో బృందానికి ఒకరిద్దరు ఉపాధ్యాయులను బాధ్యునిగా నియమిస్తున్నారు. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. భోజనంలో మెనూను పక్కాగా అమలు చేస్తున్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి అందుకు అనుగుణంగా వారిని వివిధ రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఆహ్లాద పరిసరాలు మరో ప్రత్యేకత.
ఉత్తమ బోధనే మా లక్ష్యం
అత్యుత్తమ శిక్షణతో పాటు విలువలు, ప్రమాణాలతో ఇక్కడ విద్యాబోధన ఉంటుంది. ప్రాజెక్టు బేష్డ్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఇతర పాఠశాలలన్నింటికంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు సహకరిస్తున్న బీసీ సంక్షేమ శాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, గురుకుల విద్యాలయ సెక్రటరీ పి.మాధవిలతకు కృతజ్ఞతలు.
- యు.విజయకుమార్ పాత్రో, ప్రిన్సిపాల్, కొత్తవలస బీసీ గురుకులం, జమ్మాదేవిపేట గ్రామం, లక్కవరపుకోట మండలం