Doli ఆసుపత్రికి చేరాలంటే.. డోలీయే దిక్కు!
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:18 AM
Reaching the Hospital… A Doli Is the Only Hope! గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కొమరాడ మండలం నయా పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామం వాటకకోసుకు సరైన రహదారి సౌక్యం లేదు. దీంతో ఏ చిన్న కష్టం వచ్చినా ఆసుపత్రికి చేరాలంటే గ్రామస్థులకు డోలీయే దిక్కవుతుంది.
కొమరాడ, జనవరి27(ఆంధ్రజ్యోతి): గిరిశిఖర గ్రామస్థులకు డోలీ మోతలు తప్పడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కొమరాడ మండలం నయా పంచాయతీ పరిధి గిరిశిఖర గ్రామం వాటకకోసుకు సరైన రహదారి సౌక్యం లేదు. దీంతో ఏ చిన్న కష్టం వచ్చినా ఆసుపత్రికి చేరాలంటే గ్రామస్థులకు డోలీయే దిక్కవుతుంది. ఆ గ్రామానికి చెందిన వాటక నిమ్మలమ్మ (16) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. కాలువాపులతో నడవలేని స్థితిలో ఉంది. మంగళవారం ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవడంతో బాలికను డోలీ సాయంతో తండ్రి వాటక నరసయ్య, బంధువులు మైదాన ప్రాంతానికి తీసుకొచ్చారు. వాటకకోసు నుంచి వానకాబడి మీదుగా సుమారు ఏడు కిలోమీటర్లు నడుచుకుని.. రాళ్లు రప్పలుదాటుకుని.. కొండ దిగువన ఉన్న బట్టిమూగవలసకు వారు చేరుకున్నారు. అక్కడి నుంచి అంబులెన్స్ సాయంతో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని బంధువులు తెలిపారు. కాగా బట్టిమూగవలస నుంచి నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులు సగంలో ఆగిపోవడంతో తమకీ కష్టాలు తప్పడం లేదని ఆ గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో ఎవరికి అనారోగ్య సమస్యలైనా డోలీ మోతలు తప్పడం లేదన్నారు. తక్షణమే తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని వారు కోరుతున్నారు. దీనిపై కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని సర్పంచ్ ఊయక పార్వతి తెలిపారు.