రేషన్ బియ్యం.. మరింత నాణ్యం
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:28 PM
రేషన్ బియ్యం మరింత నాణ్యతగా ఉండనున్నాయి.
- 10 శాతం నూకలు తగ్గింపు
- జిల్లాలో ప్రారంభమైన పంపిణీ
- కార్డుదారులు, విద్యార్థులకు ఎంతో మేలు
రాజాం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): రేషన్ బియ్యం మరింత నాణ్యతగా ఉండనున్నాయి. ఇక నుంచి బియ్యంలో నూకలు ఉండవు. ఈ మేరకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇప్పటికే రేషన్‌లో సన్న బియ్యం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయినా సరే బియ్యంలో ఎక్కువగా నూకలు కలుస్తుండడంతో ఎక్కువ మంది వినియోగించడం లేదు. దీనిపై ఫిర్యాదులు రావడంతో బియ్యంలో నూకలు తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సాధారణ బియ్యం రకాలైతే 25 శాతం వరకూ నూకలు ఉంటాయి. ఈ క్రమంలో కొందరు మిల్లర్లు 30 నుంచి 40 శాతం వరకూ నూకలు కలిపేస్తున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఈ కల్తీకి బ్రేక్ పడనుంది. కాగా, జిల్లాలో ఆగస్టు నెలకు సంబంధించి ఈ బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 6.21 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 5.83 లక్షలల తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్‌లో భాగంగా ప్రతినెలా 9 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఏటా ఖరీఫ్, రబీలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఈ ధాన్యాన్ని మిల్లర్లకు మర ఆడించేందుకు ప్రభుత్వం ఇస్తుంది. ఇలా బియ్యంలో నూకలు ఎంత శాతం ఉండాలనే దానిపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశిస్తూ వస్తుంది. ఈ ఏడాది 4.16 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు. క్లస్టర్ మిల్లింగ్ కింద 2.63 లక్షల టన్నుల బియ్యాన్ని పౌరసరఫరాల శాఖకు అందించారు. వీటిలో 16 వేల టన్నుల నూకలు ఉన్నాయి. వీటిని బియ్యం బస్తాల్లో కలిపి అందిస్తారు. అయితే ఆ శాతాన్ని 15 నుంచి 10కు తగ్గించారు. దీంతో బియ్యంలో నూకలు తగ్గనున్నాయి.
విద్యార్థులకు మేలు..
ఈ నిర్ణయంతో వసతిగృహాల విద్యార్థులకు, మధ్యాహ్న భోజనం చేసే పిల్లలకు ఎంతో మేలు చేకూరనుంది. జిల్లాలో 1.03 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వసతిగృహాల్లో వసతి పొందుతున్న 60 వేల మంది విద్యార్థులకు ఇవే బియ్యంతో భోజనం పెడతారు. దీంతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది.