Share News

Ratha Yatra begins today నేటి నుంచి రథయాత్ర

ABN , Publish Date - Jul 16 , 2026 | 12:18 AM

Ratha Yatra begins today జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించేందుకు దేవదాయశాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Ratha Yatra begins today నేటి నుంచి రథయాత్ర
దాసన్నపేటలోని జగన్నాధ స్వామి రథం

నేటి నుంచి రథయాత్ర

నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాగనున్న జగన్నాథ స్వామి ఉత్సవాలు

24న మారు రథయాత్ర

విజయనగరం కల్చరల్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి):

జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు తొమ్మిది రోజుల పాటు నిర్వహించేందుకు దేవదాయశాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం తొలి రథయాత్ర కాగా, 24న మారు రథయాత్రను నిర్వహించనున్నారు. నగరంలోని దాసన్నపేట, సంతపేట, మన్నార్‌ రాజగోపాలస్వామి ఆలయం, కాళ్లనాయుడు మందిరం, చిక్కాల వీధి తదితర ప్రాంతాల్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయాల్లో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో జగన్నాథుని రథాలను సిద్ధం చేశారు. తొలి రథయాత్ర సందర్భంగా ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, విశేష అర్చనలు, నైవేద్యం, నీరాజనం, మంగళశాసనం, స్వామి వారి దర్శనాలు ఉంటాయి. ఉదయం 9.30 గంటలకు స్వామి వారికి రథోరోహణ నిర్వహించనున్నారు. అనంతరం తొలి రథయాత్ర ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు. దాసన్నపేట జగన్నాథ స్వామి ఆలయం నుంచి స్వామిని నవాబుపేట కూడలి వరకూ తీసుకువెళ్తూ రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు జగన్నాథ స్వామి భక్తులకు అక్కడే దర్శనం ఇవ్వనున్నారు. ఈనెల 20న శీలవిరుపు (లక్ష్మీదేవికి)లో భాగంగా విశేష కుంకుమార్చనలు నిర్వహిస్తారు. 24న మారు రథయాత్ర జరగనుంది. సంతపేట జగన్నాథస్వామి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజల అనంతరం స్వామిని రథంలో ప్రతిష్టించి రథాన్ని కన్యకాపరమేశ్వరీ ఆలయం కూడలిలో వుంచుతారు. అక్కడ భక్తులకు దర్శనాల అనంతరం రాత్రికి తోమాల మందిరానికి రథం చేరుకుంటుంది. అక్కడ తొమ్మిది రోజుల పాటు ఈనెల 17 నుంచి 23 వరకూ భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు. 20న సాయంత్రం మహాలక్ష్మీ అమ్మవారిని తోమాల మందిరానికి తోడ్కొని వెళ్లి లక్ష్మీనారాయణ సంవాదం, శీలవిరుపు ఉత్సవం నిర్వహించనున్నారు. 24న ఉదయం 10 గంటలకు స్వామిని కన్యకాపరమేశ్వరీ దేవాలయానికి తీసుకువస్తారు. మారు రథయాత్రలో భాగంగా రాత్రి 10 గంటల వరకూ భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. అనంతరం రథం దేవాలయానికి చేరుకుంటుంది. అదే విధంగా మన్నార్‌ రాజగోపాల స్వామి ఆలయం, కాళ్లనాయుడు మందిరం, చిక్కాల వీధి తదితర ఆలయాల్లో కూడా ఈ రథోత్సవం కనుల పండువగా నిర్వహించనున్నారు. తొలి, మారు రథయాత్ర సందర్భంగా భక్తులు రద్దీ దృష్ట్యా దేవదాయశాఖాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసు బందోబస్తు కూడా ఉంటుంది.

Updated Date - Jul 16 , 2026 | 12:18 AM