Share News

రాజాం మునిసిపాలిటీ జనసేనకే

ABN , Publish Date - Nov 16 , 2026 | 12:31 AM

రాజాం మునిసిపాలిటీని ఎవరికి కేటాయిస్తారనే విషయంపై కూటమి పార్టీల్లో గత కొద్దిరోజులుగా గందరగోళం ఉండేది. దీనికి ఎట్టకేలకు తెరపడింది.

రాజాం మునిసిపాలిటీ జనసేనకే
పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌తో చైర్‌పర్సన్‌ అభ్యర్థి సౌజన్యలత

- ప్రకటించిన పార్టీ అధిష్ఠానం

- చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా సౌజన్యలత పేరు ఖరారు

- నేడు నామినేషన్‌ దాఖలు

రాజాంరూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాజాం మునిసిపాలిటీని ఎవరికి కేటాయిస్తారనే విషయంపై కూటమి పార్టీల్లో గత కొద్దిరోజులుగా గందరగోళం ఉండేది. దీనికి ఎట్టకేలకు తెరపడింది. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ టికెట్‌ను జనసేనకు కేటాయించారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్ఠానం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా బేరు సౌజన్యలత పేరును ఖరారు చేసింది. సోమవారం ఆమె రాజాం మున్సిపల్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేయనున్నారు. సౌజన్యలతది దేవంగా సామాజిక వర్గం. ఈమె తాత దివంగత బనిశెట్టి పార్వతీశం చేనేత నాయకుడు కాగా, తండ్రి బనిశెట్టి వెంకటరావు కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళికి అనుచరుడిగా ఉన్నారు. ఈమె భర్త షణ్ముఖరావు జీఎంఆర్‌ గ్రూపులో పనిచేస్తున్నారు. ఈయన తండ్రి దివంగత బేరు సత్యం సైతం చేనేతనాయకుడిగా రాజాంలో గుర్తింపు పొందారు. వీటిని పరిగణనలోకి తీసుకుని చైర్‌పర్సన్‌ సీటును సౌజన్యకు కేటాయించారు.

నిరాశలో టీడీపీ శ్రేణులు..

రాజాం మునిసిపాలిటీని జనసేనకు కేటాయించడంతో టీడీపీ శ్రేణులు నిరాశకు గురయ్యాయి. రెండు దశాబ్దాల తరువాత రాజాం మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతుండడంతో టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా చైర్మన్‌ పీఠం దక్కించుకోవాలని తెలుగుతమ్ముళ్లు సర్వశక్తులూ ఒడ్డారు. అయితే ఎవరూ ఊహించనిరీతిలో జనసేనకు కేటాయించడం, కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్న సౌజన్యలతకు సీటును కేటాయించడంతో టీడీపీ నేతల గొంతుల్లో పచ్చివెళక్కాయ పడినట్లయింది. అయినాసరే మౌనం దాల్చడం వారి వంతయింది.

‘పొగిరి’కి మొండిచేయి..

జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పొగిరి సురేష్‌బాబుకు అధిష్ఠానం మొండిచేయి చూపింది. పార్టీ ఆవిర్భావం నుంచిసురేష్‌బాబు ఉన్నారు. 2024లో శాసనసభ ఎన్నికల్లో పార్టీ ప్రచారకమిటీ రాష్ట్ర కార్యదర్శిగా పిఠాపురం నియోజకవర్గంలో సురేష్‌బాబు ప్రచార బాధ్యతలు నిర్వహించారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన అధిష్ఠానం రాజాం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ పదవిని సురేష్‌బాబు భార్య కృష్ణవేణికి గతేడాది కేటాయించింది. అప్పట్లో టీడీపీ నేతలు రంగంలోకి దిగి ఆ పదవిని టీడీపీ నాయకుడు గురవాన నారాయణరావు భార్య పార్వతికి ఇచ్చేలా పావులు కదిపారు. అయినాసరే సురేష్‌బాబు మౌనం దాల్చారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ టికెట్‌ను కేటాయి స్తుందనే ఆశతో ఉన్నారు. అయితే ఆ టికెట్‌ను సౌజన్యలతకు కేటాయించడంతో రాజాం జనసేనలో అంసతృప్తి నెలకొంది. పార్టీ శ్రేణులు ఆదివారం నిరసన ప్రదర్శన నిర్వహించాయి.

Updated Date - Nov 16 , 2026 | 12:31 AM