విద్యా ప్రమాణాలను పెంచండి
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:33 AM
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులకు ఐటీడీఏ ఏపీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మురళీధర్ ఆదేశించారు.
సాలూరు, నవంబరు 27(ఆంధ్ర జ్యోతి): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని ప్రధానోపాధ్యాయులకు ఐటీడీఏ ఏపీవో, గిరిజన సంక్షేమ శాఖ డీడీ మురళీధర్ ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలన్నారు. శుక్రవారం ఆయన కురుకుట్టి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల, తోణాం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాల లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలు, తరగతి గదులు, వంట గదులు, స్నానపు గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రత్యేక బోధన చేపట్టాలన్నారు.. నిర్ణీత విద్యా ప్రణాళిక ప్రకారం సకాలంలో పాఠ్యాంశాలను పూర్తిచేయాలని ఆయన సూచించారు.