దత్తత పిల్లలను కన్నబిడ్డల్లా సాకండి: కలెక్టర్
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:00 AM
దత్తత తీసుకున్న పిల్లలను కన్నబిడ్డల్లా ప్రేమతో పెంచి ఉజ్వల భవిష్యత్‌ను అందించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తల్లిదడ్రులను కోరారు.
పార్వతీపురం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): దత్తత తీసుకున్న పిల్లలను కన్నబిడ్డల్లా ప్రేమతో పెంచి ఉజ్వల భవిష్యత్‌ను అందించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తల్లిదడ్రులను కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా ప్రత్యేక దత్తత విభాగం ఆధ్వర్యంలో ఒక చిన్నారి దత్తత ప్రక్రియను ఆయన పూర్తి చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన జిల్లాలో శిశుగృహ స్థాపించిన తర్వాత చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం ఇదే తొలిసారి అన్నారు. జిల్లా శిశు గృహంలో ఆశ్ర యం పొందుతున్న ఆరు నెలల పాప అవంతిక ను కలెక్టర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం హన్ముకొండ జిల్లాకు చెందిన నాగేంద్రప్రసాద్, శైలజ దంపతులకు అప్పగించారు. ఈ దంపతులు 2022లో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ పోర్టల్‌లో నమోదు చేసుకోగా నిబంధనల ప్రకారం 2026 మార్చిలో వారికి ఈ అవకాశం దక్కిందన్నారు. పిల్లలు లేనివారు ఎవరైనా సీఏఆర్‌ఏ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవా లన్నారు. కార్యక్రమం లో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి డాక్టర్ టి.కనకదుర్గ, జిల్లా బాలల సంరక్షణాధికారి సత్యనారాయణ, శిశు గృహ సిబ్బంది, డీసీపీయూ బృందం పాల్గొన్నారు.