Share News

Rains Bring Renewed Hope వర్షంతో చిగురిస్తున్న ఆశలు

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:27 AM

Rains Bring Renewed Hope జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్‌ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓ మోస్తరుగా వర్షం పడుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా మన్యంలో కురిసిన సరాసరి వర్షపాతం 8.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా గుమ్మలక్ష్మీపురంలో 23.4 ఎం.ఎం, అత్యల్పంగా పాచిపెంటలో 0.1 ఎం.ఎం చొప్పున వర్షం కురిసింది.

Rains Bring Renewed Hope  వర్షంతో చిగురిస్తున్న ఆశలు
భామిని: నీటమునిగిన పత్తిచేలు

  • జిల్లాలో 51 వేల హెక్టార్లలో ఉబాలు పూర్తి

  • మరో 15 వేల హెక్టార్లలో సాగు సందేహమే..

పార్వతీపురం, ఆగస్టు22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్‌ రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓ మోస్తరుగా వర్షం పడుతుండడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజులుగా మన్యంలో కురిసిన సరాసరి వర్షపాతం 8.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా గుమ్మలక్ష్మీపురంలో 23.4 ఎం.ఎం, అత్యల్పంగా పాచిపెంటలో 0.1 ఎం.ఎం చొప్పున వర్షం కురిసింది. అయితే ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లోని గెడ్డలు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు, చెరువుల్లోనూ కాస్త వరద చేరింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న పొలాల్లోకి నీరు చేరింది. కొన్నిచోట్ల వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో ఉడుపులు చేసేందుకు రైతులు సన్నద్ధమవు తున్నారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులను ఎదుర్కో వల్సి ఉంటుందని తెలిసినా.. జలాశయాలు, చెరువులు ఉన్నచోట్ల చాలామంది రైతులు తప్పని సరి పరిస్థితుల్లో ఖరీఫ్‌ వరి సాగు చేపట్టారు. సాగునీరు లేక సీజన్‌ ఆరంభం నుంచే ఇబ్బం దులు పడ్డారు. ఎండ తీవ్రతకు చాలాచోట్ల వరినారు ఎండిపోయింది. కాగా తాజా వర్షాలతో రైతన్నలు కాస్త ఊరట చెందుతున్నారు. అయితే వాతావరణ మార్పులతో ఈ ఖరీఫ్‌ గట్టెక్కు తామా లేదా అన్న సందేహం మాత్రం వారిని వెంటాడుతోంది. మరోవైపు గ్రామాల్లో చెరువులకు నీరు చేరడంతో పలుచోట్ల రైతులు వరి నాట్లుకు సిద్ధమవుతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో 72 వేల హెక్టార్లలో ఖరీఫ్‌ వరి సాగు జరుగుతుందని వ్యవసాయాధికారులు అంచనాలు వేశారు. కానీ ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరకు 51 వేల హెక్టార్లలో వరిసాగుకు సంబంధించి ఉబాలు పూర్తయ్యాయి. మరో 15 వేల హెక్టార్లలో వరిసాగు ప్రశ్నార్థకంగా మారింది. కాగా జిల్లాలో సుమారు 17 వేల హెక్టార్లలో ఎద పద్ధతిలో సాగవుతున్న వరికి తాజా వర్షంతో ఊపిరి వచ్చినట్లయింది. ‘ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షం ఖరీఫ్‌ పంటలకు ఎంతో అనుకూలం. ఈ సమయంలో వ్యవసాయ శాఖాధికారుల సలహాలు, సూచనలను రైతులు పాటించడం ఉత్తమం. ’ అని డీఏవో భవానీ శంకర్‌ తెలిపారు.

నిలకడగా నాగావళి

గరుగుబిల్లి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): నాగావళి నదిలో నీటి ప్రవాహం నిలకడగా ఉంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పైప్రాంతం నుంచి నదిలోకి 2 వేల క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుతం తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు 2.534 టీఎంసీలకు గాను 1.900 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయి. సాగునీటి అవసరాలకు ప్రధాన కాలువల నుంచి 1,320 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. స్పిల్‌వే గేట్లు గుండా నదిలోకి వెయ్యి క్యూసెక్కులను విడుదల చేశారు. పైప్రాంతంలో వర్షాలు అధికంగా కురిస్తే వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు ఏఈలు కిషోర్‌కుమార్‌, శ్రీనివాసరావు శనివారం తెలిపారు. ప్రాజెక్టులో కొంతమేర నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:27 AM