Share News

చినుకు చింత

ABN , Publish Date - Jul 12 , 2026 | 11:43 PM

ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే జిల్లా రైతాంగానికి సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. గత 45 రోజులుగా వర్షాల జాడలేకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురవక నారు, వరి ఎదలు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల చిరుజల్లులు కురవడంతో పూర్తిస్థాయిలో విత్తనాలు మొలకెత్తలేదు.

చినుకు చింత
పాలకొండ మండలం బుక్కూరులో స్ర్పేయర్‌ సహాయంతో నారు మడిని తడుపుతున్న రైతు

  • ఎండిపోతున్న వరి నారు, ఎదలు

  • కాపాడుకునేందుకు రైతుల పాట్లు

  • ఖరీఫ్‌ ఆరంభంలోనే అవస్థలు

పాలకొండ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలోనే జిల్లా రైతాంగానికి సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. గత 45 రోజులుగా వర్షాల జాడలేకపోవడంతో సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురవక నారు, వరి ఎదలు ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల చిరుజల్లులు కురవడంతో పూర్తిస్థాయిలో విత్తనాలు మొలకెత్తలేదు. నారు, వరి ఎదలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 75 వేల హెక్టార్లలో ఈ ఏడాది ఖరీఫ్‌ కింద వరిని సాగు చేసేందుకు రైతాంగం సన్నద్ధమైంది. ఇప్పటికే కొందరు రైతులు నారు పోయగా, మరికొందరు ఎదలు వేసుకున్నారు. అయితే, అనుకున్న స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నా ఇప్పటివరకు వాటిద్వారా నీరు అందడం లేదు. తోటపల్లి, వెంగలరాయసాగర్‌, ఒట్టిగెడ్డ, జంఝావతి తదితర ప్రాజెక్టుల ద్వారా ఇప్పటి వరకు సాగునీరు విడుదల కాలేదు. తోటపల్లితో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి కేవలం ముహూర్తం కోసం సాగునీరు విడుదల చేసి ఆపేశారు. ఒడిశాలోని క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షాలు కురవకపోవడంతో నాగావళి, వంశధార, చంపావతి, జంఝావతి నదీతీర గ్రామాల్లోని కాలువలకు కూడా సాగునీరు అందడం లేదు. దీంతో చేసేది లేక రైతులు సమీప చెరువులకు నీటి ఇంజన్లు పెట్టి నారు మడులు, ఎదలను తడుపుతున్నారు. ఇంకొందరు కావుళ్లతో నీటిని తరలించి స్ప్రేయర్ల సహాయంతో నారుని తడిపి కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - Jul 13 , 2026 | 06:36 AM