Share News

Rain... Flood వాన.. వరద

ABN , Publish Date - Sep 25 , 2026 | 12:21 AM

Rain... Floodవాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం జిల్లా చెంతనే ఉన్న శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే. వస్తూ వస్తూ ఈ తీవ్ర వాయుగుండం భారీ వర్షం రూపంలో జిల్లాపై విరుచుకుపడింది.

Rain... Flood వాన.. వరద
గజపతినగరం సమీపంలో చెరువును తలపిస్తున్న వరి పొలం

వాన.. వరద

వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు

పొంగి ప్రవహిస్తున్న నదులు, వాగులు, వంకలు

పల్లపు ప్రాంతాలు జలమయం

పెనుగాలులకు నేలవాలిన విద్యుత్‌ స్తంభాలు, పంటలు

బొబ్బిలి డివిజన్‌కు ముంపు ముప్పు

సహాయ చర్యల్లో యంత్రాంగం

విజయగనగరం, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

వాయుగుండం ప్రభావంతో జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం జిల్లా చెంతనే ఉన్న శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వద్ద తీరం దాటిన సంగతి తెలిసిందే. వస్తూ వస్తూ ఈ తీవ్ర వాయుగుండం భారీ వర్షం రూపంలో జిల్లాపై విరుచుకుపడింది. బుధవారం రోజంతా వర్షంపడగా.. గురువారం మరింత తీవ్ర రూపం దాల్చింది. రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. గెడ్డలు, నదులు, వాగులు, వంకలు ఏకమయ్యాయి. రికార్డు స్థాయిలో 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొత్తవలసలో 18.1 వర్షపాతం నమోదు కాగా మెంటాడలో అత్యల్పంగా 4.0 సెంటీమీటర్లు నమోదైంది. నగరాలు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా అన్నిచోట్లా భారీ వర్షం పడింది. తెర్లాంలో విద్యుత్‌ స్తంభం కూలి ఓ మహిళ మృతి చెందింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల ధాటికి జిల్లాలో 252 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. నాగావళి, చంపావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సుమారు 1700 ఎకరాల్లో వరిపంట తాత్కాలికంగా నీటమునిగింది. 120 ఎకరాల్లో పత్తి, 114 హెక్టార్లలో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 129 విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. 31 ట్రాన్స్‌ఫార్మర్లు ఫెయిల్‌ అయ్యాయి. మొత్తంగా జిల్లాలో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ఆయా శాఖల అధికారులు అంచనా వేస్తున్నారు. తోటపల్లి, మడ్డువలస, నారాయణపురం ఆయకట్టు పరిధిలోని వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయి. ఎల్‌.కోట మండలంలో తీవ్ర వర్షానికి ఒక ఇల్లు కూలిపోయింది. రంగారాయపురంలో పేద కుటుంబం వీధినపడింది. రాజాం మండంలోని సారధిగెడ్డ పొంగి ప్రవహిస్తోంది. రాజాం పట్టణం, సారధి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర, అనారోగ్య సమయాల్లో ఉన్న వారికి రోప్‌ సహాయంతో గెడ్డను దాటిస్తున్నారు. గజపతినగరం రైల్వేకాలేనీలో భారీగా వరద నీరు చేరింది. దీంతో రైల్వే కాలనీలో ఓ ఇల్లు కూలిపోయింది. బొబ్బిలి పట్టణానికి వరద నీరు ముంచెత్తింది. ఇందిరమ్మ కాలనీ, నాయుడుకాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. మండల కార్యాలయాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు, సిబ్బంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఎల్‌.కోట మండలం రేగ గ్రామంలో పదుల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. బొబ్బిలి మండలం పిరిడి, ముత్తవలస, కమ్మవలస, కలపరాయిలో వరిపంట, మొక్కజొన్న, జనుము పంటలు నేలకొరిగాయి. బొబ్బిలి మండలం పిరిడిలో తోటపల్లి కాలువకు గండిపడింది. పరిస్థితి చూస్తుంటే భారీ వర్షాలు, వరదలకు బొబ్బిలి డివిజన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. రేగిడి మండల కార్యాలయాలతో పాటు ప్రభుత్వ భవనాలకు వరద ముప్పు తప్పలేదు. మరోవైపు అధికార యంత్రాంగం సహాయచర్యలు చేపడుతోంది. శుక్రవారం సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జిల్లాలో మొదటి 15 స్థానాల్లో వర్షపాతం వివరాలు సెంటీమీటర్లలో...

1.కొత్తవలస 18.11 సె.మీ

2.ఎల్‌.కోట 13.68

3.ఎస్‌.కోట 11.43

4.మెరకముడిదాం 10.08

5.నెల్లిమర్ల 9.74

6.వేపాడ 9.32

7.జామి 8.86

8.రాజాం 8.48

9.బొండపల్లి 8.18

10.రేగిడి 8.14

11.తెర్లాం 8.06

12.చీపురుపల్లి 8.02

13.గరివిడి 8.00

14.గజపతినగరం 7.98

15.సంతకవిటి 7.66

పాడైన 129 విద్యుత్‌ స్తంభాలు, 31 ట్రాన్స్‌ఫార్మర్లు

విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుఫాన్‌ ప్రభావంతో వీచిన ఈదురుగాలులు, భారీ వర్షాలకు విద్యుత్‌ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ఏపీఈపీడీసీఎల్‌ సూపరెంటింగ్‌ ఇంజనీరు ఎం.లక్ష్మణరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు రూ.10.25 లక్షల మేర నష్టం వాటిల్లిందన్నారు. విజయనగరం, ఎస్‌.కోట, గంట్యాడ, జామి, గజపతినగరం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, గరివిడి, చీపురుపల్లి, మెరకముడిదాం, భోగాపురం, డెంకాడ, బొబ్బిలి, మెంటాడ తదితర మండలాల్లో ఈదురుగాలుల దాటి తమ చెట్లు, భారీ వృక్షాల కొమ్మలు విరిగి విద్యుత్‌ తీగలపై పడ్డాయన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 129 విద్యుత్‌ స్తంభాలు నేలవాలగా, 31 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయన్నారు. 56 ఫీడర్లలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందని, అధికారులు ఇప్పటికే 39 ఫీడర్లను పునరుద్ధరించారన్నారు. దెబ్బతిన్న 31 ట్రాన్స్‌ఫార్మర్లలో 14 ప్రాథమికంగా బాగు చేసి విద్యుత్‌ను పునరుద్ధరించామన్నారు. యధాస్థితికి తీసుకువచ్చేందుకు 863 మంది కాంట్రాక్టు సిబ్బంది, డిపార్టుమెంటు అధికారులు, ఉద్యోగులు, రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారన్నారు.

కంట్రోలు రూంల ఏర్పాటు

ఎక్కడైనా విద్యుత్‌ స్తంభాలు పడిపోయినా, తెగిపడినా, ప్రజలు ఎవరూ సమీపానికి వెళ్లవద్దని, టోల్‌ ఫ్రీ నెంబరు 1992, విజయనగరం సర్కిల్‌ పరిధిలో ఫోన్‌ నంబర్లు 94906 10102, 94906 10103, బొబ్బిలి డివిజన్‌ పరిధిలో ఫోన్‌ నంబర్‌ 94906 10123కు సమాచారం అందించాలన్నారు.

==========

రిజర్వాయర్‌ భద్రతకు ప్రాధాన్యం: కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

గంట్యాడ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): తాటిపూడి రిజర్వాయర్‌ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి సూచించారు. గురువారం రిజర్వాయర్‌ను పరిశీలించారు. నీటి నిల్వ ,ఇన్‌ఫ్లో, అవుట్‌ ఫ్లో గురించి తెలుసుకుని సూచనలు ఇచ్చారు. రిజర్వాయర్‌ పూర్తి నీటి సామర్థ్యం 3.32 టిఎంసిలు కాగా ప్రస్తుతం 1.49 టిఎంసిల నీరు నిల్వలు ఉన్నట్లు ఇరిగేషన్‌ అధికారులు , కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్‌లోకి వస్తున్న ఇన్‌ఫ్లో, నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ సూర్యకాంతం, ఇరిగేషన్‌ ఏఈలు శంకర్‌, హేమకుమార్‌ ఉన్నారు.

కంట్రోల్‌ రూమ్‌లో రాత్రంతా కలెక్టర్‌

విజయనగరం కలెక్టరేట్‌, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి రాతంత్రా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలోనే ఉన్నారు. తుఫాన్‌ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులతో మాట్లాడారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి గురువారం ఉదయం 5 గంటల వరకూ అక్కడే ఉండి ప్రతి గంటకూ జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. క్షేత్రస్థాయి అఽధికారులకు ఎప్పటికప్పుడు తగిన ఆదేశాలు జారీ చేస్తూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని జిల్లా పరిస్థితులను వివరించారు. డీఆర్‌వో చందక సత్తిబాబు, డిప్యూటీ కలెక్టర్‌ అంబరీష్‌, కలెక్టరేట్‌ ఏవో దేవీప్రసాద్‌ తదితర అధికారులు కూడా రాత్రంతా కలెక్టర్‌కు అందుబాటులో ఉన్నారు.

Updated Date - Sep 25 , 2026 | 12:21 AM