Rain రోజంతా వాన
ABN , Publish Date - Oct 27 , 2026 | 11:41 PM
Rain All Day ర్నబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో మంగళవారం రోజంతా వర్షం కురిసింది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వేకువజాము నుంచే ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో జిల్లావాసులు బయటకు రాలేకపోయారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది.
లోతట్టు ప్రాంతాలు జలమయం
ఈదురుగాలులు లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న రైతులు
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
పార్వతీపురం/సీతంపేట, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో మంగళవారం రోజంతా వర్షం కురిసింది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీలో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వేకువజాము నుంచే ఎడతెరిపిలేకుండా వాన కురవడంతో జిల్లావాసులు బయటకు రాలేకపోయారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ అధికారులు తుఫాన్‌పై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.పూరిగుడిసెలు, మట్టి ఇళ్లలో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యు, పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో పెద్దగా ఈదురుగాలులు లేవు. దీంతో పంటలకు కాస్త అనుకూలంగా ఉంది. ముందస్తుగా విద్యాలయాలకు సెలవు ప్రకటించడం వల్ల విద్యార్థులంతా ఇంటికే పరిమితమయ్యారు. మండల కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మొత్తంగా జిల్లాలో 56 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం ఏర్పడినా లేదా మరే సమస్య ఎదురైనా వెంటనే 1912 నెంబర్‌ను సంప్రదించాలని ఆ శాఖ ప్రకటించింది. ఇక జిల్లా మీదుగా ఒడిశా రాష్ట్రం కోరాపుట్ వైపు వెళ్లే పలు రైళ్లను ఆ శాఖ రద్దు చేసింది. దీంతో చాలామంది ప్రయాణికులు బస్సులను ఆశ్రయించారు.
రైతుల గుండెల్లో గుబులు
పార్వతీపురం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తుఫాన్ హెచ్చరికలతో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వరి, ఇతరత్రా పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం ఓ మోస్తరుగా వర్షం కురుస్తుండడంతో పంటలకు ఎటువంటి నష్టం లేదు. అయితే రానున్న రెండు రోజుల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో పంటలు దెబ్బతినే అవకాశం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. ‘ తుఫాన్ ప్రభావంతో జిల్లాలో మంగళవారం రోజంతా వర్షం పడినా.. ప్రస్తుతానికి పంటలకు ఎటువంటి నష్టం లేదు. ఈదరుగాలులకు తోడు భారీ వర్షాలు కురిస్తే పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. ’ అని డీఏవో భవానీ శంకర్ తెలిపారు.
- భామిని: ఈ వర్షంతో పేలిన పత్తి కొంతమేర నష్టం వాటిల్లుతుందని, వరికి అనుకూలంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. అయితే బుధవారం తుఫాన్ ప్రభావం ఎలా ఉంటుందో నని మొక్కజొన్న, పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు
పార్వతీపురం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ‘ఆర్నబ్’ తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి కె.అచ్చెన్నాయుడు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ వైశాలి, ఇతర శాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్‌లు, పునరావాస కేంద్రాలు ఏర్పాటుపై ఆరా తీశారు. బుధవారం గంటకు 115 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, పంటలకు నష్టం వాటిల్లకుండా చూడాలని సూచించారు.
ఐదు రోజుల పాటు ఈదురుగాలులు: కలెక్టర్
పార్వతీపురం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ‘ఆర్నబ్’ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలోని మరో ఐదు రోజుల పాటు ఈదురుగాలులతో వానలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంగళవారం సంబంధిత అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సాలూరులో గంటకు 64.22 కిలోమీటర్లు, గుమ్మలక్ష్మీపురంలో 63.6, కొమరాడలో 62.6, పాచిపెంటలో 60.31 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మరోవైపు జిల్లాలోని 15 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గర్భిణులు, బాలింతలు, వృద్ధులను సమీప ఆసుపత్రులు లేదా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు. తుపాను విధులకు ఆటంకం కలగకుండా అధికారుల సెలవులను రద్దు చేసినట్టు వివరించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యుత్, తాగునీరు వైద్యసేవలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. అన్నిశాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ ఆర్.వైశాలి, సబ్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
నదీ పరివాహక ప్రాంతాల్లో సబ్‌కలెక్టర్ పర్యటన
పాలకొండ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): నాగావళి నదీ పరివాహక ప్రాంతాలైన గోపాలపురం, మంగళాపురం, అన్నవరంలో మంగళవారం సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పర్యటించారు. నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నదీ సమీప ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. పరిస్థితిని బట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ అ సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
తోటపల్లి నుంచి 20 వేల క్యూసెక్కుల విడుదల
గరుగుబిల్లి: ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు స్పిల్‌వే గేట్లు నుంచి 20 వేల క్యూసెక్కులను దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. వర్షాల కారణంగా నదిలోకి భారీ వరద చేరే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రాజెక్టు ఈఈ హెచ్.మన్మఽథరావు, ఏఈలు శ్రీనివాసరావు, కిషోర్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో చేపల వేటకు నిషేధించామని, ఈ విషయాన్ని గిరిజన మత్స్యకారులకు తెలియజేశామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో 105 మీటర్లకు గాను 103.61 మీటర్ల మేర నీటి నిల్వలు ఉన్నాయి. పైప్రాంతాల నుంచి 2,500 క్యూసెక్కులు చేరుతుంది. కుడి ప్రధాన కాలువ నుంచి సాగునీటిని నిలుపుదల చేశారు. పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ, కుడి ఉప కాలువల నుంచి 180 క్యూసెక్కుల మేర సాగునీటిని సరఫరా చేస్తున్నారు.
వర్షంతో ప్రచారానికి బ్రేక్
పాలకొండ: భారీ వర్షాల కారణంగా పురపోరులో నిలిచిన అభ్యర్థుల ప్రచారానికి బ్రేక్ పడింది. వచ్చేనెల 1న పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలతోపాటు పాలకొండ నగర పంచాయతీలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో చైర్పర్సన్, కౌన్సిలర్ల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయాల్సి ఉంది. అయితే ఈ తరుణంలో ఆర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతుండడంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. వర్షం కారణంగా ఓటర్లను కలిసేందుకు వీలు పడడం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ప్రత్యామ్నాయ ప్రచారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఓటర్ల లిస్టుల వారీగా గ్రూప్‌లను క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారు.