Heart Stopped! రైల్వే గేటు పడింది.. గుండె ఆగింది!
ABN , Publish Date - Mar 11 , 2026 | 12:13 AM
Railway Gate Closed… Heart Stopped! పార్వతీపురం-కూనేరు అంతర్రాష్ట్ర రహదారిలో నాలుగు కిలోమీటర్ల దూరంలో మూడు రైల్వేగేట్లు ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక గేటు తప్పించుకుని వెళ్లేలోపు మరో గేటు పడడంతో గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. రోగుల పరిస్థితి అయితే సరేసరి. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
108 వాహనంలోనే మృతి చెందిన వ్యక్తి
కొమరాడ, మార్చి10(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం-కూనేరు అంతర్రాష్ట్ర రహదారిలో నాలుగు కిలోమీటర్ల దూరంలో మూడు రైల్వేగేట్లు ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక గేటు తప్పించుకుని వెళ్లేలోపు మరో గేటు పడడంతో గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదు. దీంతో సకాలంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. రోగుల పరిస్థితి అయితే సరేసరి. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కొమరాడ మండలంలో రైల్వే గేటువద్ద 108 వాహనం చిక్కుకుపోవడంతో అందులో ఉన్న వ్యక్తి మరణించాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరువుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
తెర్లాం మండలం కుమ్మరిపేట గ్రామానికి చెందిన ఎం.రామచంద్రరావు (55) కొమరాడ మండలం కోటిపాం పవర్‌ప్లాంట్‌లో నాలుగేళ్లుగా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొమరాడలోని ఓ రూమ్‌లో తోటి ఉద్యోగులతో కలిసి ఉంటున్నాడు. కాగా మంగళవారం గుండె నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో తోటి ఉద్యోగులు ఆయన్ని కొమరాడ పీహెచ్‌సీకి తరలిం చారు. పరిస్థితి మెరుగవకపోవడంతో 108వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి బయల్దేరారు. అయితే కోటిపాం, ఆర్తాం వద్ద రెండు రైల్వేగేట్లు పడ్డాయి. దీంతో 108 వాహనం కదలలేని పరిస్థితి. అత్యధిక సమయం అక్కడే నిలిచిపోవడంతో ఆర్తాం వద్ద రామచంద్రరావు మృతి చెందాడు. కాగా ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు భోరున విలపించారు. రైల్వే గేట్లు పడడంతో సకాలంలో వైద్య సేవలు అందక రామచంద్రరావు మృతి చెందినట్లు 108 వాహన సిబ్బంది తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైల్వేగేట్ల వద్ద వంతెనలు నిర్మించాలని ప్రజలు, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.