Radio brought everyone together. రేడియో అందరినీ కలిపేది
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:25 AM
Radio brought everyone together. రోజంతా కాయకష్టం చేసుకుని ఇంటికి చేరే పల్లె ప్రజలు సాయంత్రం వేళ నాయుడు గారికి ఇంటికి చేరేవారు. భార్య వంటపనిలో నిమగ్నం కాగా భర్త పిల్లలను వెంటబెట్టుకుని సర్పంచ్ ఇంటిబాట పట్టేవారు. లేదంటే రచ్చబండ వద్ద నిరీక్షించేవారు. అయ్యా... వార్తలు పెట్టండయ్యా అని అడిగేవారు. ఆయన కసురుకుంటూనే రేడియో ఆన్ చేసేవాడు.
రేడియో అందరినీ కలిపేది
గ్రామ పెద్దలు, రచ్చబండలే వేదికలు
వార్తలు వినాలని ఆరాటం
సాయంత్రం వేళ సందడే సందడి
కొత్త సాధనాలు ఎన్నొచ్చినా వాటికి సరితూగవు
నేడు జాతీయ ప్రసార దినోత్సవం
విజయనగరం కంటోన్మెంట్/బొబ్బిలి, జూలై 22(ఆంధ్రజ్యోతి):
రోజంతా కాయకష్టం చేసుకుని ఇంటికి చేరే పల్లె ప్రజలు సాయంత్రం వేళ నాయుడు గారికి ఇంటికి చేరేవారు. భార్య వంటపనిలో నిమగ్నం కాగా భర్త పిల్లలను వెంటబెట్టుకుని సర్పంచ్ ఇంటిబాట పట్టేవారు. లేదంటే రచ్చబండ వద్ద నిరీక్షించేవారు. అయ్యా... వార్తలు పెట్టండయ్యా అని అడిగేవారు. ఆయన కసురుకుంటూనే రేడియో ఆన్ చేసేవాడు. వార్తా విశేషాలైనా, మధురమైన గీతాలైనా శ్రద్ధంగా వినేవారు. సాంకేతికత అందుబాటులో లేని ఆ రోజుల్లో బాహ్య ప్రపంచంలో జరిగే ప్రతీ వర్తమానం పల్లె ప్రజలకు చేరవేసే ఏకైక సాధనం రేడియో. సంఘటనలన్నీ వార్తల రూపంలో వినిపించేవి. అంతేకాకుండా కార్మికులకు, కర్షకులకు, వివిధ సంఘాల ప్రతినిధులకు సమగ్ర సమాచారాన్ని వినిపించేవి. పలు సాంస్కృతిక, కళా, సంగీత, సాహిత్య కథానికలు, కదంబ కార్యక్రమాలు కూడా ప్రసారమయ్యేవి. పల్లె సీమలు, ప్రాంతీయ వార్తలు, కార్మిక వార్తా విశేషాలు, సినీ చిత్రగీతాలు, మార్కెట్ ధరలు, పాడి పంటల సాగు, పండిన పంటల వినియోగంపై సమగ్ర సమాచారం అందజేసేందుకు రేడియో ఎంతో ఉపయోగపడేది. ఉదయం, రాత్రి వేళల్లో పల్లె ప్రజలంతా ఒకచోట చేరేవారని సీనియర్ సిటిజన్లు చెబుతున్నారు.
రేడియో పట్టుకుని రచ్చబండకు వెళ్లేవారు
నాన్నగారు వెంకట నారాయణ ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. దీంతో గ్రామస్థులు సాయంత్రం వేళ నాన్నగారి దగ్గరకు వచ్చి అన్ని విషయాలు మాట్లాడేవారు. రేడియో వినడానికి చాలా ఆసక్తి చూపేవారు. సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్యలో స్థానిక మాండలికాలలో జాతీయ, ప్రాంతీయ వార్తల బులెటన్ వచ్చేది. దగ్గర్లో ఉన్న రచ్చ బండ దగ్గరకు రేడియోతో సహా వెళ్తే ఆయన వెనుకే గ్రామ ప్రజలు అనుసరించడం నాకు బాగా గుర్తు. 69 ఏళ్లు వచ్చినా ఆ విషయాన్ని మరువలేదు.
- పక్కి గోపీనాథ్‌పట్నాయక్, వంగర గ్రామం, దత్తి రాజేరు మండలం
రేడియోతోనే ఉండేవారు
నా భర్త కృష్ణమూర్తినాయుడు అప్పట్లో బొబ్బిలి సమితి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. రేడియోలో ఉదయం 6:45కు, మధ్యాహ్నం 1:20కు, సాయంత్రం 6:30కు వచ్చే ప్రాంతీయ వార్తలను విధిగా వినేవారు. ఎక్కడ ఉన్నా ఆ సమయానికి ఇంటికి చేరుకొనేవారు. రేడియో ఉంటే చాలు మేము అవసరం లేదని అనేదాన్ని. నేడు ఆయన మా మధ్యలేకున్నా ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం.
- అల్లాడ చిననారాయణమ్మ, పారాది, బొబ్బిలి గ్రామం
ఒకరిద్దరి ఇళ్లలోనే రేడియో
ఆరోజుల్లో ఊర్లో ఒకరిద్దరి ఇళ్లల్లో మాత్రమే రేడియో ఉండేది. గ్రామస్థులంతా సాయంత్రం వేళ ఆ ఇంటివద్దకు చేరి ఆసక్తిగా వినేవారు. వార్తలు, పాటలు, నాటికలు, భక్తిగీతాలు, జానపద గీతాలను ఆస్వాదించేవారు. అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల సమయంలో రాష్ట్రం, దేశంలో ఏం జరుగుతుందోనని ప్రజలు ఎంతో శ్రద్ధగా వినేవారు.
- రెడ్డి సీతంనాయుడు, బొబ్బిలి
శక్తివంతమైన మాధ్యమం
తరతరాలుగా సమాచారం, విద్య, వినోదాన్ని అందించే శక్తివంతమైన మాధ్యమంగా రేడియో ఉండేది. గ్రామీణ ప్రాంతాలు, చిన్నచిన్న పట్టణాలలో నేటికీ రేడియోకు ఆదరణ తగ్గలేదు. ప్రధానమంత్రి మోదీ నిర్వహిస్తున్న మన్‌కీబాత్ కార్యక్రమం ద్వారా రేడియోకు మళ్లీ విస్తృత ప్రాచుర్యం లభిస్తోంది.
- సబ్బాన కృష్ణమూర్తి, గొల్లపల్లి, బొబ్బిలి
---------------