Share News

Rabi Paddy రబీ ధాన్యం కొనుగోలు చేయట్లే!

ABN , Publish Date - May 25 , 2026 | 11:56 PM

Rabi Paddy Procurement Yet to Begin! జిల్లాలో రబీ సీజన్‌లో సాగు చేసిన వరి పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధానంగా తేలిక రకాలైన 1010, తరంగిణి ధాన్యం కొనుగోలు జరగడం లేదు. నూక శాతం ఎక్కువ వస్తుందనే కారణంతో ఈ రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఇష్టపడడం లేదు.

Rabi Paddy  రబీ ధాన్యం కొనుగోలు చేయట్లే!
పచ్చి ధాన్యం ఆరబెడుతున్న రైతులు

  • దళారులను ఆశ్రయిస్తున్న రైతులు

  • 85 కేజీల బస్తాకు రూ.1400 చెల్లిస్తున్న వైనం

  • తీవ్రంగా నష్టపోతున్న రైతులు

పాలకొండ, మే 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రబీ సీజన్‌లో సాగు చేసిన వరి పంటను అమ్ముకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రధానంగా తేలిక రకాలైన 1010, తరంగిణి ధాన్యం కొనుగోలు జరగడం లేదు. నూక శాతం ఎక్కువ వస్తుందనే కారణంతో ఈ రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఇష్టపడడం లేదు. దీంతో చేసేది లేక రైతులు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని బోయల్డ్‌ రైస్‌ మిల్లులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా దళారులు రంగ ప్రవేశం చేసి తక్కువ ధరకు అడుగుతున్నారు. 80 కేజీల బస్తాకు ఐదు కేజీలు అదనంగా తీసుకొని రూ.1400 చెల్లిస్తున్నారు. చేసేది లేక వారు అడిగిన ధరకే ధాన్యం విక్రయిస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలోని జియ్యమ్మవలస, గరుగుబిల్లి, వీరఘట్టం, పార్వతీపురం, కురుపాం, సాలూరు, వీరఘట్టం, పాలకొండ, భామిని, సీతానగరం తదితర మండలాల్లో ఈ ఏడాది రబీలో 20 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఎక్కువమంది 1010, తరంగిణి తదితర రకాలు వేశారు. ఖరీఫ్‌తో పోల్చుకుంటే రబీలో ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడి వచ్చింది. అయితే దిగుబడి బాగున్నా గిట్టుబాటు ధర మాత్రం దక్కడం లేదు. ఖరీఫ్‌లో ప్రభుత్వం 80 కేజీల సాధారణ రకాన్ని రూ.1895కు కొనుగోలు చేసింది. రబీకి సంబంధించి అధికారికంగా కొనుగోలు చేయకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు 80 కేజీల బస్తాను రూ.1400కే కొనుగోలు చేస్తున్నారు. పైగా బస్తాపై ఐదు కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. మిషన్‌తో కోత చేసి తక్షణమే అమ్మకాలు చేసేవి (పచ్చి ధాన్యం) 85 కేజీలకు కేవలం రూ.1150 నుంచి రూ.1200 మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ ధరతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

కొనుగోలు చేయని మిల్లర్లు

జిల్లాలో సాగు చేసిన 1010, తరంగిణి వంటి తేలికపాటి రకాల ధాన్యంను స్థానిక మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు. ఆ ధాన్యం మరపడితే నూక శాతం అధికంగా వస్తుందనే ఆలోచనతో కొనుగోలు చేసేందుకు విముఖత కనబరుస్తున్నారు. వాస్తవానికి రైస్‌మిల్లర్లు బియ్యాన్ని సీఎంఆర్‌ కింద ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. అందుకోసం నాణ్యమైన ధాన్యం కోసం వేచిచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తేలికపాటి రకాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడడం లేదు. కొంతమంది మిల్లర్లు ఒడిశాలో ధాన్యం కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. మరోపక్క జిల్లాలో బోయల్డ్‌ రైస్‌ మిల్లులు అందుబాటులో లేవు. నూక శాతం ఎక్కువ ఉన్నా 1010, తరంగిణి వంటి తేలికపాటి రకాలను ఈ మిల్లులు కొనుగోలు చేస్తుంటాయి. ఇలాంటి మిల్లులు కేవలం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. రైతులు చేసేది లేక దళారులను ఆశ్రయిస్తున్నారు. వీరు రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి బోయల్డ్‌ రైస్‌ మిల్లర్లకు అధిక ధరకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ఎండ పెట్టిన ధాన్యంపై బస్తాకు రూ.500 వరకు, పచ్చి ధాన్యంపై బస్తాకు రూ.700 వరకు నష్టపోతున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఈ విషయమై సివిల్‌ సప్లైస్‌ జిల్లా మేనేజర్‌ను ఎ.శ్రీనివాసులు వివరణ కోరగా.. జిల్లాలో బోయల్డ్‌ రైస్‌మిల్లులు అందుబాటులో లేకపోవడంతో రబీలో సాగు చేసిన పంటలను అధికారికంగా కొనుగోలు చేయలేకపోతున్నామని తెలిపారు.

Updated Date - May 25 , 2026 | 11:57 PM