Share News

Queues Outside Banks బంకుల ఎదుట బారులు

ABN , Publish Date - Apr 27 , 2026 | 11:39 PM

Queues Outside Banks జిల్లాలో డీజిల్‌ కొరత తీవ్రంగా ఉంది. ఏ బంక్‌ వద్ద చూసినా డీజిల్‌ కోసం వాహనాలు బారులుదీరడం కనిపిస్తోంది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Queues Outside Banks బంకుల ఎదుట బారులు
పాలకొండలోని ఓ పెట్రోల్‌ బంకు వద్ద బారులుదీరిన వాహనదారులు

  • పెట్రోల్‌ బంకుల వద్ద క్యూ కడుతున్న వాహనదారులు

  • పెట్రోల్‌ కోసం తప్పని నిరీక్షణ

  • జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి..

  • కొరత లేదంటున్న అధికారులు

పాలకొండ, ఏప్రిల్‌27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో డీజిల్‌ కొరత తీవ్రంగా ఉంది. ఏ బంక్‌ వద్ద చూసినా డీజిల్‌ కోసం వాహనాలు బారులుదీరడం కనిపిస్తోంది. కొన్ని బంకుల వద్ద నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనా పశ్చిమాసియా దేశాల్లో చెలరేగిన యుద్ధం సెగ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే జిల్లా వాసులు గ్యాస్‌ కష్టాలతో అల్లాడిపోతుంటే.. తాజాగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. మొత్తంగా ఆయిల్‌ కంపెనీల నుంచి సకాలంలో బంకులకు డీజిల్‌ సరఫరా కాకపోవడంతో అన్ని వర్గాల వారు ఇక్కట్లపాలవుతున్నారు. పాలకొండ పట్టణంలోని పలు బంకుల్లో రెండు రోజులుగా డీజిల్‌ నిల్వలు లేవు. సోమవారం మధ్యాహ్నం వరకు సబ్‌ కలెక్టరేట్‌ పక్కన ఉన్న పెట్రోల్‌ బంకులో మాత్రమే డీజిట్‌ అందుబాటులో ఉండడంతో వాహన దారులు అక్కడ క్యూ కట్టారు. దీంతో సాయంత్రానికి ఆ బంకులో కూడా డీజిల్‌ లేకుండాపోతుంది. పట్టణం పరిధిలోని శ్రీకాకుళం రోడ్డులో రెండు, సీతంపేట రోడ్డులో రెండు, రాజాంలో రోడ్డులో రెండు, పార్వతీపురం రోడ్డులో ఉన్న మరో పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ అందుబాటులో లేదు. జిల్లాలోని చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనడంతో వాహనచోదకులు నానా అవస్థలు పడు తున్నారు. ఎక్కడ డీజిల్‌ అందుబాటులో ఉందోనని వాకబు చేసి పరుగులు తీస్తున్నారు. కొన్ని పెట్రోల్‌ బంకులకు ఈ రాత్రికి డీజిల్‌ వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. కాగా మరికొన్ని బంకులకు మరో రెండు రోజుల వరకు వచ్చే పరిస్థితి లేదని చెబుతుండంతో వాహనచోదకులు ఆందోళనకు గురవుతున్నారు.

- గత రెండురోజులుగా డీజిల్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోగా .. పెట్రోల్‌ సరఫరాలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న భయంతోపాటు సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తల కారణంగా వాహనచోదకులు బంకుల ఎదుట బారులుదీరుతున్నారు. జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరతలేదని జిల్లా యంత్రాంగం ప్రకటించినా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంక్‌ల వద్ద వాహనదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కొన్ని బంకుల్లో అరకొరగానే పెట్రోల్‌ పోస్తుండడంతో వాహనచోదకులు ఈసురోమంటున్నారు.

- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 158 బంకులు ఉన్నాయి. ప్రస్తుతానికి పెట్రోల్‌కు పెద్దగా ఇబ్బంది లేదు. కానీ డీజిల్‌ దొరకడం లేదు. రోజుకు సగటున 4.50 లక్షల నుంచి 5 లక్షల లీటర్ల వరకూ డీజిల్‌ విక్రయిస్తుంటారు. కానీ ఇప్పుడు రోజుకు 2 లక్షల నుంచి 2.50 లక్షల లీటర్ల వరకూ మాత్రమే చమురు కంపెనీలు డీజిల్‌ సరఫరా చేస్తున్నాయి. కానీ ఇది ఏ మూలకు చాలడం లేదు. పెట్రోల్‌ అందుబాటులో ఉన్నా.. డీజిల్‌ నిల్వలు తగ్గుముఖం పట్టి.. ఎక్కడికక్కడే నోస్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రోజుకు ఒక్కో బంకులో 15 వేల నుంచి 20 వేల లీటర్ల డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. కనీసం ఒక్కో బంకులో 12 వేల లీటర్ల డీజిల్‌ అందుబాటులో ఉంచాలి. కేవలం 5 వేల లీటర్ల వరకూ మాత్రమే సప్లయ్‌ జరుగుతోంది. దీంతో రోజురోజుకూ డీజిల్‌ కొరత మరింత జటిలమవుతోంది.

- సాలూరు: పట్టణంలో వాహనదారులు పెట్రోల్‌, డీజిల్‌ కోసం నానాపాట్లు పడుతున్నారు. పెట్రోల్‌ బంకుల వద్ద సోమవారం పెద్ద ఎత్తున వాహనదారులు పడిగాపులు కాశారు. ఈ నేపథ్యంలో సీఎస్‌డీటీ కిరీటి పట్టణంలో మూడు పెట్రోల్‌ బంకులను తనిఖీ చేశారు. వాహన దారులకు పెట్రోల్‌, డీజిల్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు కేన్లు పట్టుకొని వస్తే 10 నుంచి 15 లీటర్ల వరకు డీజిల్‌ ఇవ్వాలన్నారు.

- వీరఘట్టం: వీరఘట్టం, నడుకూరు గ్రామాల్లో మూడు పెట్రోల్‌ బంకుల్లో డీజిల్‌ పూర్తిగా అయిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.

కొరత లేదు: ఎస్పీ

బెలగాం, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. అన్ని బంకుల్లో నిల్వలు సమృద్ధిగా ఉన్నాయన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. పెట్రోల్‌, డీజిల్‌పై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలను నమ్మొద్దన్నారు. దీనిపై జిల్లావాసులు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా అసత్య ప్రచారాలు చేస్తే డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Updated Date - Apr 27 , 2026 | 11:39 PM