Share News

que for urination మూత్ర విసర్జనకూ క్యూ

ABN , Publish Date - Apr 07 , 2026 | 12:11 AM

que for urination విద్యాభ్యాసం అక్కడ సమస్య కాదు. సరిపడినంత మంది ఉపాధ్యాయులున్నారు. వసతికి కూడా కొరత లేదు. తరగతి గదులు పుష్కలంగానే ఉన్నాయి. మూత్ర విసర్జనే పెద్ద సమస్య. మూత్రానికి వెళ్లాల్సిన సమయంలో ఏం చేయాలో తెలియక, బయటికి చెప్పలేక విద్యార్థినీవిద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సిగ్గుతో కుమిలిపోతున్నారు. 7

que for urination మూత్ర విసర్జనకూ క్యూ
పిల్లర్ల దశలో నిలిచిపోయిన మరుగుదొడ్లు

మూత్ర విసర్జనకూ క్యూ

సిగ్గుతో కుమిలిపోతున్న విద్యార్థులు

830 మంది విద్యార్థులకు 8 మూత్రశాలలు

ఉపాధ్యాయులు, సిబ్బందికీ అవే దిక్కు

జడ్పీ హైస్కూల్‌లో పరిష్కారం కాని సమస్య

విద్యాభ్యాసం అక్కడ సమస్య కాదు. సరిపడినంత మంది ఉపాధ్యాయులున్నారు. వసతికి కూడా కొరత లేదు. తరగతి గదులు పుష్కలంగానే ఉన్నాయి. మూత్ర విసర్జనే పెద్ద సమస్య. మూత్రానికి వెళ్లాల్సిన సమయంలో ఏం చేయాలో తెలియక, బయటికి చెప్పలేక విద్యార్థినీవిద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు సిగ్గుతో కుమిలిపోతున్నారు. 75 ఏళ్ల చరిత్ర ఉన్న చీపురుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో సామూహికంగా అందరూ అనుభవిస్తున్న దుస్థితి ఇది. సంఖ్యకు తగ్గట్టు మూత్ర శాలలు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు.

చీపురుపల్లి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అతి పురాతన పాఠశాలల్లో చీపురుపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల ఒకటి. ఇక్కడ చదువుకున్న వారిలో చాలా మంది దేశ విదేశాల్లో గొప్పగొప్ప ఉద్యోగాలు సాధించారు. మరికొంత మంది రాజకీయంగా పదవులు పొంది చట్ట సభల్లో సైతం కొలువుదీరిన వారున్నారు. అయితే ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాల ఇప్పుడు ఎవరికీ పట్టకుండా పోయింది. సరిపడినంత మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఉన్నా, అవసరమైన మేరకు మూత్ర శాలలు లేక అల్లాడిపోతోంది. అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్టు నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో ఉన్నా, ఇక్కడ గెలిచిన వారు మంత్రులై, రాష్ట్రాన్ని పాలించినా పాఠశాలలో కీలక సమస్య పరిష్కారం కావడం లేదు.

830 మందికి 8 మూత్రశాలలే

ఈ పాఠశాలలో మొత్తం 830 మంది విద్యార్థులుండగా వారిలో 260 మంది బాలికలున్నారు. నిబంధనల ప్రకారం ఇక్కడి విద్యార్థుల సంఖ్యను బట్టి బాలికలకు నాలుగు బ్లాకులు, బాలురకు ఎనిమిది బ్లాకుల్లో మూత్రశాలలుండాలి. కానీ అందరికీ కలిపి కేవలం రెండు బ్లాకుల్లోనే మూత్ర శాలలున్నాయి. అవి కూడా బాగా పాతవి కావడంతో కారిపోతున్నాయి. పై బ్లాకులోని మూత్ర శాలల నుంచి కిందనున్న గదులకు వేస్ట్‌ వాటర్‌ కారుతోంది. అయినా విద్యార్ధులు, ఉపాధ్యాయులు వాటినే వినియోగించాల్సి వస్తోంది. మరోమార్గం లేక ముక్కు మూసుకొని వెళ్లినా ఏ అంటు వ్యాధులు సోకుతాయోనని ఆందోళన చెందుతున్నారు. విశ్రాంతి సమయంలో విద్యార్థులందరూ ఒకే సారి మూత్ర శాలలకు వెళ్తే అక్కడ పరిస్థితి దారుణంగా ఉంటోంది. క్యూ కట్టాల్సిందే.

మధ్యలో నిలిచిపోయిన కొత్త గదుల నిర్మాణం

పాఠశాలకి గతంలో మంజూరైన రెడీ మేడ్‌ టాయ్‌లెట్లు వృథాగా మారాయి. నిర్మాణ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అవి నిరుపయోగంగా ఉండిపోయాయి. దీంతోపాటు మూత్ర శాలలు, మరుగుదొడ్ల నిర్మాణం కోసం 2018లో నాబార్డు కింద రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. అప్పట్లో పనులు ప్రారంభించినప్పటకీ నత్తనడకన సాగడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయినట్టు తెలిసింది. అనంతరం ఆర్‌డబ్ల్యూఎస్‌ నిధులతో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించాలని భావించారు. కాలమ్స్‌ వేసిన కాంట్రాక్టర్‌ మధ్యలో వదిలి వెళ్లిపోవడంతో వాటి నిర్మాణం కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది. వెరసి చాలీచాలని మరుగుదొడ్లు, మూత్ర శాలలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు అనుభవిస్తున్నారు. వివిధ సందర్భాల్లో పాఠశాలలకు వచ్చిన ప్రజాప్రతినిధులకు ఈ సమస్యను ఎన్నిమార్లు చెబుతున్నా ఫలితం ఉండడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

ఎప్పటినుంచో సమస్య ఉంది

టాయ్‌లెట్ల సమస్య ఎప్పటి నుంచో ఉంది. పిల్లలు, ముఖ్యంగా బాలికలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడున్న పరిస్థితులు ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు చెబుతున్నాం. స్థానిక ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడున్న వాటికి మరమ్మతులు అవసరం. కొత్తవాటి నిర్మాణం పూర్తికావాలి. ఇంజనీరింగ్‌ అధికారులు పరిశీలించి వెళ్లారు.

- డి.ఉమామహేశ్వరి, హెచ్‌ఎం

Updated Date - Apr 07 , 2026 | 12:11 AM