ప్రాణాలు తీస్తున్న క్వారీలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:29 PM
మండలంలోని జగన్నాథవలస, మడ్డువలస, నీలయ్యవలసలో నిరుపయోగంగా ఉన్న గ్రానైట్ క్వారీలు ప్రమాదకరంగా మారాయి.
- ఎక్కడికక్కడే తవ్వేసి వదిలేస్తున్న వైనం
- గోతుల్లో నీరు చేరి నిత్యం ప్రమాదాలు
- పట్టించుకోని అఽధికారులు
వంగర, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి):మండలంలోని జగన్నాథవలస, మడ్డువలస, నీలయ్యవలసలో నిరుపయోగంగా ఉన్న గ్రానైట్ క్వారీలు ప్రమాదకరంగా మారాయి. ఇబ్బడిముబ్బడిగా క్వారీలు ఏర్పాటు చేయడం, గ్రానైట్‌ను తవ్వేసి వదిలేయడం పరిపాటిగా మారింది. కనీస నిబంధనలు పాటించడం లేదు. ఎక్కడ చూసినా క్వారీ గుంతలే దర్శనమిస్తున్నాయి. ఈ గోతుల్లో నీరు చేసి ప్రమాదకరంగా మారుతున్నాయి. చాలామంది ఈ గోతుల్లో పడి జలసమాధి అవుతున్నారు. తాజాగా, నీలయ్యవలసలోని ఒక క్వారీలోని గోతిలో కాలుజారి ఓ యువతి మృత్యుఒడికి చేరింది.
నిబంధనలకు తూట్లు..
కొందరు క్వారీల నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. జగన్నాథవలస, మడ్డువలస, నీలయ్యవలస పరిధిలో 14 వరకు క్వారీలు ఉండగా, రెండింటిలో మాత్రమే పనులు జరుగుతున్నాయి. మిగిలిన 12 చోట్ల క్వారీ గుంతలు భయానకంగా ఉన్నాయి. వాస్తవానికి క్వారీ ఏర్పాటుకు మైనింగ్ విభాగం నుంచి అనుమతులు పొందాలి. రెవెన్యూ విభాగం నుంచి క్లీయరెన్స్ తప్పనిసరి. లీజు గడువు పూర్తయిన తరువాత పూర్వస్థితికి వచ్చేలా గోతులు కప్పాలి. లీజు సమయంలో లీజుదారుడు ముందస్తుగా డిపాజిట్ రూపంలో నగదు చెల్లించాలి. ఆ నిధులతో క్వారీ గుంతలు పూడ్చాలి. లీజుదారుడు గుంతలు పూడ్చడానికి రాకుంటే, డిపాజిట్ సొమ్ముతో ప్రభుత్వమే కప్పాలి. ప్రమాదాలు జరిగే క్వారీల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలి. కానీ, ఈ నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే విధంగా క్వారీ గుంతల్లో నీరు నిల్వ ఉండడంతో దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. ఆ నీరు ఉపయోగించే క్వారీ కార్మికులు, పొలాలకు వచ్చే రైతులు తరచూ విష జ్వరాలకు గురవుతున్నారు. క్వారీ గుంతలను పూర్వస్థితికి తీసుకురావడంలో అధికారులు, లీజుదారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.