Share News

Strong Infrastructure ఉత్తమ ఫలితాలు... మౌలిక సౌకర్యాలు

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:15 AM

Quality Results… Strong Infrastructure ఉన్నత పాఠశాలల్లో పదో తరగతిలో శతశాతం ఫలితాల సాధన...మౌలిక సౌకర్యాల కల్పనపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిశీలన కార్యక్రమాన్ని ఎంఈవోల బృందాలు పూర్తి చేశాయి. వాటిపై నివేదికలు రూపొందించేందుకు మంగళవారం కసరత్తు ప్రారంభించాయి.

  Strong Infrastructure ఉత్తమ ఫలితాలు... మౌలిక సౌకర్యాలు
ఉన్నత పాఠశాలలను తనిఖీ చేసిన ఎంఈవోల బృందం ( ఫైల్‌ )

  • ముగిసిన ఉన్నత పాఠశాలల పరిశీలన

  • కలెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్న బృందాలు

సాలూరు రూరల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఉన్నత పాఠశాలల్లో పదో తరగతిలో శతశాతం ఫలితాల సాధన...మౌలిక సౌకర్యాల కల్పనపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల పరిశీలన కార్యక్రమాన్ని ఎంఈవోల బృందాలు పూర్తి చేశాయి. వాటిపై నివేదికలు రూపొందించేందుకు మంగళవారం కసరత్తు ప్రారంభించాయి. పదో తరగతి ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లాను మరోసారి ప్రథమ స్థానంలో నిలిపేందుకు... ఉన్నత పాఠశాలల్లో విద్యాప్రమాణాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి దృష్టి పెట్టారు. ఈ మేరకు జిల్లాలో ఉన్న 183 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పరిశీలనకు ఏడు తనిఖీ బృందాలను నియమించారు. పదో తరగతి విద్యార్థుల స్థాయిని తెలుసుకునేందుకు 15 మండలాలకు చెందిన ఎంఈవోలు, ఎస్‌ఎస్‌ఏ అధికారులతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందానికి మూడు మండలాలు, మిగిలిన ఆరు బృందాలకు రెండేసి మండలాల చొప్పున ఉన్నత పాఠశాలలను ట్యాగ్‌ చేశారు. ఈ బృందాలు గత నెల 28 నుంచి ఈ నెల 9 వరకు జిల్లాలో తమకు కేటాయించిన ఉన్నత పాఠశాలలను పరిశీలించాయి. ప్రధానంగా పాఠశాల, విద్యార్థుల ముస్తాబు, ప్రాంగణ పరిశుభ్రత, ఆరు నుంచి పదో తరగతి వరకు బోధన పరిస్థితి, 100 రోజుల యాక్షన్‌ ప్లాన్‌, మధ్యాహ్న భోజనం నిర్వహణ, వంటగది, ఆటస్థలం, క్రీడలు, రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించాయి. వాటిపై సమగ్ర నివేదికలను రూపొందిస్తున్నాయి. బుధ, గురువారాల్లో జరుగనున్న సదస్సుకు కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి విజయవాడ వెళ్లారు. ఆయన వచ్చిన తరువాత తమ నివేదికలను ఎంఈవోల బృందాలు అందించనున్నాయి.

Updated Date - Mar 11 , 2026 | 12:15 AM