బీటీ రహదారి నిర్మాణంలో నాణ్యతా లోపం
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:20 PM
జిల్లాలో పార్వతీపురం- పాలకొండ మార్గంలో చేపడుతున్న బీటీ రహదారి నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి.
- కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం.. పట్టని అధికారుల ఆదేశాలు
- పార్వతీపురం- పాలకొండ మార్గంలో పనుల తీరుపై ప్రజల పెదవి విరుపు
- ఉన్నతాధికారులు స్పందించాలని విన్నపం
గరుగుబిల్లి, ఏప్రిల్16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పార్వతీపురం- పాలకొండ మార్గంలో చేపడుతున్న బీటీ రహదారి నిర్మాణంలో నాణ్యతా లోపాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్డుపై పెచ్చులు ఊడిపోవడంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం.. కళింగ పట్నం, శ్రీకాకుళం, పార్వతీపురం ప్రధాన బీటీ రహదారి పనులకు రూ. 2.82 కోట్లు మంజూరు చేసింది. ఈ మొత్తంతో ఏడు మీటర్ల మేర డబుల్ రహదారి పనులు, 3.75 కిలో మీటర్ల మేర సింగిల్ రహదారి పనులు నిర్వహిస్తున్నారు. అయితే సింగిల్, డబుల్ రహదారి పనుల్లో కొంత మేర వ్యత్యాసం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఆర్‌అండ్‌బీ శాఖ అధికారుల సూచనలకు భిన్నంగా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారనే వ్యాఖ్యలు విని పిస్తున్నాయి. ప్రధానంగా సంతోషపురం పంచాయతీ ఖడ్గవలసతో పాటు పలు ప్రాంతాల్లో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణలు పాటించడం లేదు. మరమ్మతులకు గురైన రహదా రుల పరిధిలో అంతంతమాత్రంగానే తారు వేసి రోలింగ్ చేస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా బీటీ రహదారికి ఆనుకుని ఇరువైపులా బెర్మ్‌లు వేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించా లని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.
చర్యలు తప్పవు
బీటీ రహదారి పనుల్లో నాణ్యతా లోపాలుంటే సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తప్పవు. చెల్లింపుల సమయంలో కోత విధిస్తాం. ఖడ్గవలస పరిధిలోని రోడ్డు పనులపై ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని పరిశీలించాం. అక్కడ పైపులు తవ్విన కారణంగా కొంతమేర పనుల్లో లోపాలున్నట్లు గుర్తించాం. డబుల్ రోడ్ల పనులను పరిశీలించి... ఎత్తు పల్లాలు ఉన్న చోట్ల సరిచేస్తాం. రహదారులకు ఇరువైపులా బెర్మ్‌లు వేస్తాం.
- వి.రామ్‌మోహన్‌రావు, జేఈ, ఆర్‌అండ్‌బీ, పార్వతీపురం