Purchase ok.. any other charges? కొనుగోలు సరే.. ఇతర చార్జీలేవీ?
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:04 AM
Purchase ok.. any other charges? గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆదివారంతో విజయవంతంగా ముగిసింది కానీ రైతులకు రవాణా, గన్నీ, హమాలీ చార్జీలు పెండింగులో ఉండిపోయాయి. వాటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.24 కోట్లు చెల్లించాల్సి ఉంది.
కొనుగోలు సరే.. ఇతర చార్జీలేవీ?
జిల్లా వ్యాప్తంగా 4,16,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
రవాణా, గన్నీ చార్జీల కోసం రైతుల నిరీక్షణ
చెల్లించాల్సింది రూ.24 కోట్లు
విజయనగరం కలెక్టరేట్, మార్చి 29(ఆంధ్రజ్యోతి): గత ఏడాది ఖరీఫ్ సీజన్‌లో చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఆదివారంతో విజయవంతంగా ముగిసింది కానీ రైతులకు రవాణా, గన్నీ, హమాలీ చార్జీలు పెండింగులో ఉండిపోయాయి. వాటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు రూ.24 కోట్లు చెల్లించాల్సి ఉంది.
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు 88,900 మంది రైతుల నుంచి 4,16,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. సుమారు రూ.980 కోట్లు చెల్లించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి ముందుగానే సేకరణ ప్రక్రియ ముగించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు కూడా చెల్లించారు. రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్‌ల ద్వారా ఈ కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. అయితే గన్నీ, రవాణా చార్జీల కోసం వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. ధాన్యం డబ్బులను వెంట వెంటనే రైతులకు చెల్లించినప్పటికీ మిగతా చార్జీల కోసం నిరీక్షిస్తున్నారు. క్వింటాకు హమాలీ చార్జీ సుమారు రూ.22 చొప్పున ఇవ్వాలి. రవాణాపై క్వింటాకు కిలోమీటర్‌కు దాదాపు రూ.28, గన్నీకి రూ.10 చొప్పున ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సి ఉంది. మొత్తం హమాలీ, రవాణా, గన్నీ చార్జీలు దాదాపు రూ.24 కోట్లు రైతుల ఖాతాలకు జమ కావాల్సి ఉంది. కాగా రవాణా చార్జీలను అధికారికంగా ప్రభుత్వం నిర్ధారించలేదని సంబంధిత శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ చార్జీలు మంజూరు చేయాలంటూ రైతు సంఘ నాయకులు ఈనెల 9న కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. చార్జీల విడుదల విషయాన్ని జిల్లా సివిల్ సప్లయ్ సంస్థ మేనేజరు బి.శాంతి వద్ద ప్రస్తావించగా హమాలీ చార్జీలు సుమారు రూ.7 కోట్లు విడుదలయ్యాయని, గన్నీ, రవాణా చార్జీలు మంజూరు కావాల్సి ఉందని అన్నారు.