Share News

Complexes అసౌకర్యాల కాంప్లెక్స్‌లు

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:50 PM

Public Toilet Complexes Plagued by Poor Facilities జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు అధ్వానంగా మారాయి. సమస్యలకు నిలయాలుగా మారాయి. అసౌకర్యా లతో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి.

 Complexes అసౌకర్యాల కాంప్లెక్స్‌లు
పార్వతీపురం కాంప్లెక్స్‌లో పూర్తిస్థాయిలో కుర్చీలు లేక బస్సుల కోసం ఇలా వేచి చూస్తున్న ప్రయాణికులు

  • అధ్వానంగా మరుగుదొడ్లు.. కొన్నిచోట్ల తాళాలు

  • అందని సురక్షిత నీరు

  • వసతుల కల్పనపై దృష్టిసారించని అధికారులు

  • ప్రయాణికులకు తప్పని అవస్థలు

పార్వతీపురం టౌన్‌/పాలకొండ/సాలూరు, జూలై8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు అధ్వానంగా మారాయి. సమస్యలకు నిలయాలుగా మారాయి. అసౌకర్యా లతో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. రన్నింగ్‌ వాటర్‌ లేక పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు వినియోగానికి నోచడం లేదు. ప్రజలకు సురక్షిత నీరు కూడా అందడం లేదు. మరోవైపు కాంప్లెక్స్‌ పరిసరాల్లో పారిశుధ్యం క్షీణించినా పట్టించుకునే వారే కరువయ్యారు. మొత్తంగా ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించకపోవడం.. ప్రయాణికులకు శాపంగా మారింది.

జిల్లాకేంద్రంలో ఇలా..

పార్వతీపురం నుంచి రోజూ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంతోపాటు ఇతర జిల్లాలకు సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ప్రయణిస్తుంటారు. అయితే కాంప్లెక్స్‌లో అసౌకర్యాలు ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాగా 40 ఏళ్ల కిందట నిర్మించిన ఆర్టీసీ కాంప్లెక్స్‌ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ప్రయాణికులకు తగ్గట్టుగా కుర్చీలు ఏర్పాటు చేయలేదు. దీంతో గంటలకొద్దీ ప్రజలు నిల్చొనే బస్సులు కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ఆర్టీసీ కాంప్లెక్స్‌ పరిసరాల్లో పారిశుధ్యం లోపించింది. చెత్తా చెదారం, మురుగునీరు దర్శనమిస్తున్నా.. సంబంఽధిత అధికారులు స్పందించడం లేదు. మరోవైపు కాంప్లెక్స్‌లో మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. శుద్ధ తాగునీరు పేరుకే తప్పా, సం బంధిత ట్యాంకులను నెలకొకసారైన శుభ్రం చేయడ లేదు. మొత్తంగా కాంప్లెక్స్‌లో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

పాలకొండలో ...

డివిజన్‌ కేంద్రం పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో తాగునీటి కుళాయిలు ఉన్నప్పటికీ సురక్షితమైన నీరు రావడం లేదు. దీంతో ప్రయాణికులు వాటిని వినియోగించడం లేదు. రన్నింగ్‌ వాటర్‌ లేకపోవడంతో ఇక్కడున్న మూడు సామూహిక మరుగుదొడ్లలో రెండు మూతపడ్డాయి. మరొక మరుగుదొడ్డి అందుబాటులో ఉన్నప్పటికీ ప్రయాణికులు కొంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. రాత్రివేళల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే ఇంక అంతే సంగతి. ఇన్వర్టర్‌ సదుపాయం లేకపోవడంతో కాంప్లెక్స్‌లో ప్రయాణికులు చీకట్లోనే బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. కాంప్లెక్స్‌ పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోగా.. మురుగునీరు నిల్వ ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం దుర్వాసన వెలువడుతుండడంతో ముక్కుమూసుకుని బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది.

సాలూరులో..

సాలూరు ఆర్టీసీ డిపోలో 59 ప్రభుత్వ , 21 అద్దె బస్సులు ఉన్నాయి. కాంప్లెక్స్‌ నుంచి నిత్యం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, విశాఖతో పాటు పలు పల్లెలకు బస్సులు నడుపుతున్నారు. ఆదాయంలో జిల్లాలోనే సాలూరు డిపో ప్రథమ స్థానంలో ఉంది. అయితే కాంప్లెక్స్‌లో ప్రయాణికులకు సురక్షిత నీరు అందడం లేదు. ట్యాంకును సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో ఇక్కడున్న కుళాయి నీటిని ఎవరూ వినియోగిం చలేని పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లో మరుగుదొడ్లను పాడు చేస్తున్నారనే కారణంతో ఇన్‌గేట్‌ సమీపంలో ఉన్న వాటికి తాళాలు వేశారు. ఇకపోతే రహదారి సౌకర్యం ఉన్నా మారుమూల గిరిజన గ్రామాలకు సాలూరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బస్సులు వెళ్లకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. దీనిపై ఆర్టీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

గంటల కొద్దీ నిల్చోవాల్సిందేనా..

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో చాలా తక్కువగా కుర్చీలు ఉన్నాయి. దీంతో నిల్చోనే పిల్లలతో గంటల కొద్దీ బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. ప్రజాప్రతి నిధులు, ఆర్టీసీ అధికారులు మా బాధలు అర్థం చేసుకోవాలి. మరుగుదొడ్లకు తాళాలు వేయడం వల్ల ప్రయాణికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

- జి. సావిత్రి, ప్రయాణికురాలు, వీరఘట్టం

============================

కనీస సౌకర్యాలు లేవు

జిల్లా కేంద్రం పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో కనీస సౌకర్యాలు లేవు. ఇక్కడ నీరు తాగుదామంటే అదోరకం వాసన వస్తోంది. ప్రజారోగ్యంపై అధికారులు దృష్టి సారించాలి.

జి. వీర్రాజు, ప్రయాణికుడు బొబ్బిలి

======================

చర్యలు తీసుకుంటాం..

పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తాం. తాళాలు వేసి ఉన్న మరుగుదొడ్లును అందుబాటులోకి తేస్తాం. సురక్షిత నీటిని అందిస్తాం.

- లక్ష్మణరావు, ఆర్టీసీ డిపో మేనేజర్‌, పార్వతీపురం

Updated Date - Jul 08 , 2026 | 11:50 PM