Public Health ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:13 PM
Public Health Protection is the Primary Goal ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని, ఈ విషయంలో రాజీ పడరాదని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖాధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, మార్చి23(ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని, ఈ విషయంలో రాజీ పడరాదని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ క్షేత్రస్థాయిలో నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలి. ఒక్క టైఫాయిడ్ కేసు కూడా నమోదు కాకూడదు. దోమల నివారణకు ఆయిల్ బాల్స్ విధానాన్ని అవలంబించాలి. ఫ్రైడే డ్రైడే కార్య క్రమాలకు సంబంధించిన సమగ్ర నివేదికలను సకాలంలో అందించాలి. హోటళ్ల వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చూడాలి.’ అని తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. వడదెబ్బ, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లావాసులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ రూపొందించిన ‘వేసవిలో ప్రజారోగ్య సూచనలు’ కరపత్రాన్ని విడుదల చేశారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో గిరి శిఖర గ్రామాల్లో చేపడుతున్న రోడ్లు, అభివృద్ధి పనులకు సంబంధించి ఈ నెల 25 లోగా బిల్లులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎంబుక్ నమోదు, బిల్లుల చెల్లింపులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. కేవలం వాల్యుయేషన్ సర్టిఫికెట్ ఇచ్చామని, బిల్లులు వస్తాయని భావించడం సరికాదన్నారు. ఎంబుక్ రికార్డులు అందిన పనులకు మాత్రమే ఆన్‌లైన్‌లో బిల్లులు ఉంచుతామన్నారు. జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఉగాది నాటికి పూర్తి కావాల్సిన ఇళ్ల నిర్మాణాలు.. ఇంకా పెండింగ్‌లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ పురోగతిపై నివేదికలు అందించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇంటి వద్దకే వైద్యసేవలు
గిరిజనులు, గ్రామీణ ప్రాంతవాసులకు ఇళ్ల వద్దే వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు చేసిన సంచార వైద్యశాల యూనిట్ వాహనాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. సీఎస్‌ఆర్ నిధులు రూ.8.40 కోట్లతో పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్న ‘మీ ఇంటికి మీ డాక్టర్ ’అనే కార్యక్రమం జిల్లాలో మూడేళ్ల పాటు అమలు కానుందని కలెక్టర్ తెలిపారు. మొబైల్ మెడికల్ యూనిట్‌లో డాక్టర్, నర్సు ఫార్మాసిస్ట్ డ్రైవర్ ఉంటారన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కొమరాడ మండలంలో 98 గ్రామాల్లో ప్రనజలకు వైద్య సేవలు అందనున్నట్టు చెప్పారు. ప్రధానంగా గర్భిణులు, ఆరేళ్ల లోపు పిల్లలు, వృద్ధులు, టీబీ, డెంగ్యూ, మలేరియా వ్యాధిగ్రస్థులకు సేవలందిస్తారన్నారు.
జనగణన-2027 ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ
జనగణన-2027లో భాగంగా ఫీల్డ్ ట్రైనర్లకు జిల్లా కేంద్రంలో సోమవారం శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫీల్డ్ ట్రైనర్లు క్షేత్రస్థాయిలో ఎన్యూమరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. నిర్దేశించిన సమయంలోగా ఎన్యూమరేటర్లు తమ విధులను పూర్తి చేసేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.