మెరుగైన సేవలు అందించండి
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:16 AM
రోగులకు మెరుగైన సేవలు అందించి మంచిపేరు తీసుకురావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
కురుపాం, ఆగస్టు8 (ఆంధ్రజ్యోతి): రోగులకు మెరుగైన సేవలు అందించి మంచిపేరు తీసుకురావాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రూ.3 కోట్లతో నిర్మించిన కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని శనివారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే జమకృష్ణ, కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆసుపత్రి సూపరిండెంట్ సందీప్‌తో మాట్లాడుతూ ఈ ప్రాంత వ్యక్తి అయిన మీరు ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నాగభూషణరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్, నియోజకవర్గ పరిశీలకుడు మాదారపు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాలువల ఆక్రమణలపై కలెక్టర్ ఆగ్రహం
కురుపాం మెయిన్ రోడ్డులో మురుగు కాలువల ఆక్రమణలపై కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి 7.45 సమయంలో ఆయన తనిఖీలు చేపట్టారు. మెయిన్ రోడ్డులో రావాడ రోడ్డు సమీపంలో షాపులు, ఇళ్లకు కాలువలపై పలకల వేయడం వల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతున్నట్టు గుర్తించారు. కాలువలను ఆక్రమించిన షాపులు, ఇళ్ల యజమానులకు ముందుగా కౌన్సిలింగ్ ఇవ్వాలని పంచాయితీ ఈవో వెంకటనాయుడును ఆదేశించారు. అనంతరం కాలువలపై ఉన్న పలకలను వెంటనే తొలగించి మురుగునీరు సజావుగా ప్రవహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే, కాలువ పరిశీలిస్తున్న సమయంలో అక్కడే ఉన్న మద్యం దూకాణం వద్ద మద్యం సేవించి మైకంలో షాపు వద్ద పడివున్న ఒక వ్యక్తిని కలెక్టర్ గమనించారు. ఎస్‌ఐ పి.నారాయణరావుతో ఫోన్‌లో మాట్లాడి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.