ఉపాధి పేరు మార్పుపై నిరసన
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:50 PM
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పఽథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించి నిధులు తగ్గించిందని ఆరోపిస్తూ బుధవారం సంబంధిత ఉత్తర్వుల ప్రతులను సీపీఎం నాయకులు భోగి మంటల్లో దహనం చేశారు.
విజయనగరం దాసన్నపేట, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పఽథకంలో మహాత్మాగాంధీ పేరు తొలగించి నిధులు తగ్గించిందని ఆరోపిస్తూ బుధవారం సంబంధిత ఉత్తర్వుల ప్రతులను సీపీఎం నాయకులు భోగి మంటల్లో దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకూ కేంద్రం 90 శాతం నిధులిచ్చిందని... నేడు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు ఇవ్వాలన్న నిబంధన పెట్టి రాష్ట్రాలపై భారం మోపిందన్నారు. దీంతో రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా రోజుకు రూ.600 కూలీ ఇవ్వాలని, 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. నగరాల్లో కూడా ఉపాధి హామీ పఽ థకాన్ని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేతలు శాంతమూర్తి, జగదాంబ, రమణమ్మ, రమణ, పుణ్యవతి, శ్రీను, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
పీపీపీని రద్దు చేయాలని...
రాజాం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పీపీపీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంబంధిత జీవోలను సీపీఐ నాయకులు భోగి మంటల్లో వేసి దహనం చేశారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్ మాట్లాడుతూ జీవో నెంబరు 8047, 590లను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఉపయోగపడే వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపాలని కోరారు, ఈ కార్యక్రమంలో నాయుకులు కనకరాజు తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధి’ కాపీలు దహనం
శృంగవరపుకోట, జనవరి 14(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకంలో మార్పులు చేపట్టడంపై సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన చేపట్టారు. ఈ చట్టం ప్రతులను భోగి మంటల్లో వేసి దహనం చేశారు.
వైద్య కళాశాలల జీవో...
రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ఇచ్చిన జీవో కాపీలను సీపీఐ, కాంగ్రెస్ నేతలు బుధవారం భోగి మంటల్లో వేసి దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కామేశ్వరరావు, సీపీఐ, కాంగ్రెస్ నేతలు కండేపల్లి భీముడు, హనుమాల శెట్టి నానాజీ పాల్గొన్నారు.