న్యాయ సేవలతోనే హక్కుల పరిరక్షణ
ABN , Publish Date - Sep 19 , 2026 | 11:15 PM
ప్రజలకు న్యాయ సేవలపై విస్తృత అవగాహన కల్పించినప్పుడే వారి హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత స్పష్టం చేశారు.
- న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలి
- జిల్లా ప్రధాన న్యాయాధికారి బబిత
బొబ్బిలిరూరల్, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రజలకు న్యాయ సేవలపై విస్తృత అవగాహన కల్పించినప్పుడే వారి హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎం.బబిత స్పష్టం చేశారు. బొబ్బిలి మండల పరిషత్ సమావేశ భవనంలో శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసం గించారు. ముందుగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ప్రభుత్వ సేవలు, సహాయ సహకారాలపై స్టాళ్ల ద్వారా ప్రజలకు స్పష్టమైన అవగాహన కలుగుతుందన్నారు. మండలంలో పి-4 కార్యక్ర మం అమలు తీరును ఎంపీడీవో రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. పి-4 కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఎంతవరకు ఫలప్రదంగా అమలు జరుగుతుందో లీగల్ సర్వీసెస్ బృందంతో కలిసి పర్యటించి పరిశీలిస్తామని వెల్లడించారు. పేద కుటుంబాలను దత్తత తీసుకుని వారికి అవసరమైన సాయం అందిస్తున్నారో లేదో ప్రత్యేకంగా పరిశీలించాలన్నారు. బాల్య వివాహాల అడ్డుకట్టతో పాటు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బడి మానేసిన (డ్రాప్‌అవుట్) పిల్లలను గుర్తించి, వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించి క్రమం తప్పకుండా విద్యనభ్యసించేలా చర్యలు తీసుకోవాలని ఎంఈవోను ఆదేశించారు. నేటి డిజిటల్ యుగంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని, పిల్లలు సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ప్లాట్‌ఫారమ్‌లను ఏ విధంగా వినియోగిస్తున్నారో తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచించారు. చట్టాలపై అవగాహనతో పాటు ప్రభుత్వ శాఖల ద్వారా అందుతున్న సేవలు, ఉచిత న్యాయ సహాయంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, యువతకు నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు, న్యాయవా దులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. కేవలం సొంత కుటుంబం బాగుంటే సరిపోదని, చుట్టుపక్కల సమాజ సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు. సామాజిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తే చివరకు దాని ప్రభావం అందరిపైనా పడుతుందని హెచ్చారించారు. అంగన్వాడీ కేంద్రానికి చెందిన చిన్నారులు ఇంగ్లీష్‌లో మాట్లాడం చూసి ఆమె హర్షం వ్యక్తం చేశారు. గర్భిణులకు పసుపు, కుంకుమలతో పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ఎంఎల్‌ఎస్‌సీ చైర్మన్, సివిల్ న్యాయాధికారి ఎ.రాధాకృష్ణమూ ర్తి, ప్రిన్సిపల్ సివిల్ న్యాయాధికారి హేమశ్రవంతి జానకీ రామ్, అడిషనల్ సివిల్ న్యాయాధికారి ఎం.రోహిణిరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.రవి, ఎంపీడీవో పి.రవికుమార్, ఐసీడీఎస్ పీవో జె.విజయలక్ష్మి, ఏవో ఎం.శ్యామ్‌సుందర్, ఎంఈవో జి.వాసు, సీఐ కె.నారాయణరావు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.