Share News

ఆస్తులకు ర(న)క్ష

ABN , Publish Date - May 08 , 2026 | 12:45 AM

నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజల ఆస్తుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నక్ష (నేషనల్‌ జీయో స్పాటియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హేబటేషన్‌) సర్వే చేపడుతుంది.

   ఆస్తులకు ర(న)క్ష

- నక్ష సర్వేతో ఎంతో ప్రయోజనం

- ప్రతి ఇంటికీ ప్రత్యేక ప్రాపర్టీ కార్డు

- త్వరలో జిల్లాలో నిర్వహణ

పాలకొండ, మే 7 (ఆంధ్రజ్యోతి): నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజల ఆస్తుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నక్ష (నేషనల్‌ జీయో స్పాటియల్‌ నాలెడ్జ్‌ బేస్డ్‌ ల్యాండ్‌ సర్వే ఆఫ్‌ అర్బన్‌ హేబటేషన్‌) సర్వే చేపడుతుంది. ఈ సర్వేపై రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. తొలి దశలో మంగళగిరిలో సర్వే నిర్వహిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా నక్ష సర్వేను వేగవంతం చేసి 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్దేశించింది. త్వరలో జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ పట్టణాల్లో సర్వే ప్రారంభంకానుంది.

ఎన్నో ప్రయోజనాలు..

నక్ష సర్వేతో పట్టణ ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు, భూములు, ఆస్తుల సరిహద్దులను ఆధునిక డ్రోన్‌, జియో స్పేస్‌షియల్‌ టెక్నాలజీ ఖచ్చితంగా మ్యాపింగ్‌ చేసి, భూ రికార్డులను డిజిటలైజేషన్‌ చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి ఆస్తికీ క్యూనిక్‌ నెంబర్‌తో కూడిన ప్రాపర్టీ కార్డును సంబంధిత యజమానికి అందిస్తారు. అందులో ఉన్న క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే ఈ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. యజమాని పేరు, వివరాలు ప్లాట్‌, భూమి విస్తీర్ణం, భవన విస్తీర్ణం, సర్వే నెంబర్‌ వంటి వివరాలు ఉంటాయి. ఆస్తి వివాదాలకు ఆస్కారం ఉండదు. అక్రమ లావాదేవీలకు అడ్డుకట్ట పడుతుంది. డిజిటల్‌ భూ రికార్డులతో ఎటువంటి తప్పిదాలు దొర్లకుండా భూ యజమానులకు రక్షణగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ మరింత పారదర్శకంగా వేగవంతంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ రికార్డులను ప్రామాణికంగా చూపి బ్యాంకుల నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పట్టణాల్లో మున్సిపల్‌ అధికారులకు తమ పరిధిలోని ఆస్తులపై స్పష్టమైన సమాచారం ఉంటుంది.

Updated Date - May 08 , 2026 | 12:45 AM