Share News

Insurance పాడి రైతులకు రక్షణ పశువుల బీమా

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:51 PM

Protection for Dairy Farmers: Livestock Insurance పశువుల బీమా పథకం పాడిరైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఆకస్మిక ప్రమాదాలు, వ్యాధుల బారిన పడి పశువులు మృతి చెందితే.. పాడి రైతులు, పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోకుండా చూస్తుంది. పశు బీమా వారికి ఒక రక్షణగా నిలుస్తుంది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది.

  Insurance పాడి రైతులకు రక్షణ  పశువుల బీమా

  • 85 శాతం వరకూ సబ్సిడీ

జియ్యమ్మవలస, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పశువుల బీమా పథకం పాడిరైతులకు ఎంతో మేలు చేస్తుంది. ఆకస్మిక ప్రమాదాలు, వ్యాధుల బారిన పడి పశువులు మృతి చెందితే.. పాడి రైతులు, పెంపకం దారులు ఆర్థికంగా నష్టపోకుండా చూస్తుంది. పశు బీమా వారికి ఒక రక్షణగా నిలుస్తుంది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. అధికారులకు కూడా ఉత్వర్వులు అందజేసింది. నిబంధనల ప్రకారం బీమా ప్రీమియం చెల్లించ డానికి అక్టోబరు 5వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. కాగా ప్రీమియంలో 85 శాతం సబ్సిడీ ఉంటుంది. పాడి రైతులు, పశు పెంపకందారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో కోళ్ల సంఖ్య మినహాయిస్తే మొత్తం పశు సంపద 6.56 లక్షలు. ఇటీవల పశు గణన చేసినప్పుడు 62,843 మంది పాడి రైతులు ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా గొర్రెలు, మేకలు పెంపకందారులు 7,364 మంది ఉన్నట్లు తేల్చారు. వీరందరూ పశు బీమా పథకం ద్వారా ప్రీమియం చెల్లించుకునే వెసులుబాటు ఉంది. ఒక్కో కుటుంబం గరిష్టంగా పది పశువుల వరకు బీమా ప్రీమియం చెల్లించొచ్చు. ఆవులు, గేదెలకు సంబంధించి మూడేళ్లకు ఒకసారి ప్రీమియం చెల్లిస్తే చాలు. పశువుకు చెవి పోగు కచ్చితంగా వేయించి బీమా నమోదు చేయించుకోవాలి. ఒకవేళ చెవి పోగు పోతే సంబంధిత పశు సంవదర్థకశాఖ సిబ్బందికి తెలియజేయాలి. వారు మరో చెవి పోగు వేసి బీమాలో నమోదు చేస్తారు. ప్రభుత్వ సబ్సిడీ నాటు పశువులకు రూ. 816, మేలు జాతి పశువులకు రూ. 1,632 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఒకసారి ఈనిన 2 - 10 సంవత్సరాల వయస్సు గల ఆవులు, 3-12 సంవత్సరాల వయసు గల గేదెలు ప్రీమియంకు అర్హతగా నిర్ణయించారు. మేలు జాతి ఆవులు, గేదెలకు రూ. 30 వేలు, నాటు రకం ఆవు / గేదెకు రూ. 15 వేలు వర్తిస్తుంది. బీమా ప్రీమియంలో 85 శాతం ప్రభుత్వం భరిస్తుంది. 15 శాతం మాత్రమే పాడి రైతు చెల్లించాల్సి ఉంది.

గొర్రెలు, మేకలకు ప్రీమియం ఇలా..

ఆరు నెలలు, ఆపైన వయసు గల గొర్రెలకు, మేకలకు బీమా వర్తిస్తుంది. ఒక్కో రేషన్‌ కార్డుకు లేదా కుటుంబానికి ఒక సంవత్సరానికి వంద జీవాల వరకు పశు బీమా వర్తిస్తుంది. బీమాలో ఒక్కో గొర్రెకు గాని, మేకకు గాని, పందికి గాని రూ. 6 వేలు వరకు మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది.

చెల్లింపులు ఇలా

- మేలు జాతి పశువు ధర ప్రభుత్వం రూ. 30 వేలుగా నిర్ణయించింది. దీనికి చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం రూ. 1,920. ఇందులో 85 శాతం అంటే రూ. 1,632 ప్రభుత్వం రాయితీ ఇస్తుండగా, లబ్ధిదారుడు రూ. 288 మాత్రమే చెల్లించాలి.

- సంకర జాతి పశువు ధర రూ. 15 వేలుగా నిర్ణయించారు. వీటికి చెల్లించాల్సిన మొత్తం ప్రీమియం రూ. 960. ఇందులో 85 శాతం ప్రభుత్వ రాయితీ ఇస్తుంది. అంటే పాడిరైతులు కేవలం రూ. 144 ప్రీమియంగా చెల్లించాలి.

- మేకలు, గొర్రెలు, పందుల బీమా మొత్తం రూ.6 వేలు కాగా ఒక ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం రూ. 180. ప్రభుత్వ రాయితీ రూ. 153 (85 శాతం) పోను లబ్ధిదారుని వాటా కింద రూ. 27 చెల్లించాలి.

సచివాలయాల్లో చెల్లించొచ్చు

పశు బీమా ప్రీమియాన్ని స్వర్ణ గ్రామ / వార్డు సచివాలయాల్లో ఉన్న పశు సంవర్థక శాఖ సిబ్బందిని సంప్రదించి చెల్లించవచ్చు. అక్టోబరు 5వ తేదీతో గడువు ముగుస్తుంది. పాడి రైతులు పశు బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆవులు, గేదెలకు ఒక్కసారి బీమా చేయిస్తే మూడేళ్లు, గొర్రెలు, మేకలకు 1 నుంచి 3 ఏళ్ల పాటు బీమా వర్తిస్తుంది. పశువులకు తప్పనిసరిగా చెవిపోగువేయించి బీమా నమోదు చేసుకోవాలి. అవి చనిపోయినప్పుడు క్లైయిమ్‌ పొందడానికి ఈ ట్యాగ్‌నెంబరే కీలకం. దాని ఆధారంగానే పశు వైద్యులు ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.

- దీనకుమార్‌, జేడీ, పశు సంవర్థక శాఖ, పార్వతీపురం మన్యం

Updated Date - Sep 29 , 2026 | 11:51 PM