Share News

Protect Crops.. పంటలను కాపాడుకోండిలా...

ABN , Publish Date - Oct 29 , 2026 | 12:19 AM

Protect Your Crops Like This… ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పలు పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని నీట మునిగాయి. అయితే ఈ సమయంలో జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు పంట నష్టం తగ్గించుకోవచ్చునని జిల్లా వ్యవసాయాధికారి భవానీ శంకర్‌ బుధవారం తెలిపారు.

Protect  Crops..  పంటలను కాపాడుకోండిలా...

  • సూచనలు జారీ చేసిన వ్యవసాయశాఖ యంత్రాంగం

పాలకొండ, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆర్నబ్‌ తుఫాన్‌ కారణంగా కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పలు పంటలు దెబ్బతిన్నాయి. మరికొన్ని నీట మునిగాయి. అయితే ఈ సమయంలో జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు పంట నష్టం తగ్గించుకోవచ్చునని జిల్లా వ్యవసాయాధికారి భవానీ శంకర్‌ బుధవారం తెలిపారు. జిల్లాలో 85 వేల హెక్టార్లలో వరి , 9 వేల హెక్టార్లలో పత్తి, ఆరు వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగులో ఉన్నట్లు చెప్పారు. పంటల రక్షణకు ఆయన పలు సూచనలు జారీ చేశారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

వరిని ఇలా రక్షించుకోండి...

వరిలో ఎంటీయూ 1061, 1318, స్వర్ణ, సంపద స్వర్ణ, బీపీటీ 5204 మొదలైన రకాలు పూతదశలో ఉన్నాయి. ఈ దశలో వర్షాలు కురవడం వల్ల తాలు గింజలు ఏర్పడతాయి. అదే విధంగా ఎంటీయూ 1318, 1262, 1124 వంటి రకాల్లో గొలుసుకట్టు దగ్గరగా ఉండడం వల్ల గింజ రంగు మారడం , మానిపండు తెగులు వచ్చే అవకాశం ఉంది. మొలక వచ్చే అవకాశం ఉంది. బ్యాక్టీరియా ఎండాకు తెగులు, మాగుడు తెగుల వ్యాపించే ప్రమాదం ఉంది. బీటీపీ 5204 పీఎల్‌ఏ 100 వంటి రకాల్లో గింజలు వెంటనే మొలకెత్తే అవకాశం ఉంది. వర్షాలు, ఈదురుగాలులకు.. పాలు పోసుకొనే దశలో ఉన్న స్వర్ణ, సంపద స్వర్ణ, బీపీటీ 5204, ఆర్‌ఎన్‌ఆర్‌, కేఎన్‌ఎం 1638 రకాలు దెబ్బతింటే.. పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. ఎక్కువగా నీరు నిలిచిన చోట పెద్ద కాలువులు ఏర్పాటు చేసి మోటార్లు ద్వారా తొలగించాలి. గింజలు రంగు మారడం, మాగుడు తెగులు, మానిపండు తెగులు వ్యాప్తి నివారించడానికి ఎకరాకు 200 మిలీమీటర్లు ప్రొపికోనాజోల్‌ పిచికారీ చేయాలి.

- గింజ గట్టిపడే దశలో ఉన్న పంట అధిక వర్షాలకు దెబ్బతింటే.. పొలంలో నీరు అంతర్గత కాలువలు ద్వారా తొలగించాలి. నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనపబడితే ఐదు శాతం ఉప్పు ద్రావణం కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకలు రంగుమార్పును తగ్గిస్తుంది.

- కోత సమయంలో చేను పడిపోతే గింజ తోడుకొని లేదా గట్టిపడే దశలో లేదా కోతదశలో ఉన్న మొక్కపడి పోయి నేలకు ఒరిగే అవకాశం ఉంది. పడిపోయిన చేనుల రక్షణకు నీటిని తొలగించాలి. గింజలు మొలకెత్తకుండా ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పనాలపై పడే విధంగా పిచికారీ చేయాలి. వారం రోజుల పాటు చేను పడిపోయి నీటిలో ఉంటే.. మొలక వచ్చి నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనిని నివారించడానికి.. చేనుకు సమతుల్యంగా ఉండేందుకు గాను వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఎరువులను వేయాల్సి ఉంది.

మొక్కజొన్నలో...

వర్షాలు తగ్గిన వెంటనే కోత చేపట్టాలి. తడిసిన కండెలను గచ్చులపై పలుచగా పేర్చి ఎండలో బాగా ఆరబెట్టి సాధ్యమైనంత త్వరగా నూర్పిడి చేయాలి. కోత దశలో ఉన్న పంట నేలకు ఒరిగితే పొలంలోనే నీటిని బయటకు తీసివేసి చేనుపై ప్రొపికోనాజోల్‌ ఒక మిల్లీమీటరు లేదా హెక్కాకొనజోల్‌ రెండు మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కోత తర్వాత కల్లంపైన ఆరబెట్టిన మొక్కజొన్న కండెలు తడిస్తే నీడలో ఆరబెట్టాలి. అవసరాన్ని బట్టి తడిసిన కండలపై పలుచగా ఐదు శాతం మెత్తటి ఉప్పు జల్లాలి. దీనివల్ల మొలక రాకుండా నివారించొచ్చు.

పత్తిలో..

గుమ్మలక్ష్మీపురం: తొమ్మిది నుంచి 10 రోజుల పాటు పత్తి పంటలో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని రాస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం సూచించింది. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నీరు నిలిచిన లేదా పడిపోయిన వరి పంటలో కంకులపై మెలకులు వస్తే ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, సీనియర్‌ సైంటిస్ట్‌ హెడ్‌ ఎస్‌.శ్రీనివాసరాజు, ఉద్యాన శా స్త్రవేత్త ఆధ్వర్యంలో ఎస్‌.కె.పాడు గ్రామలో వరి, పత్తి పంటలను వారు పరిశీలించారు.

Updated Date - Oct 29 , 2026 | 12:19 AM