Prosperous Shambaram సిరి శంబరం
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:24 AM
Prosperous Shambaram ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా సిరిమానును తాకి పులకించిపోయారు. చీరెలు, కోళ్లు, పసుపు, కుంకుమలు, అరటిపండ్లు సమర్పించారు. పాహిమాం.. పోలమాంబ అంటూ మొక్కుకున్నారు.
మార్మోగిన పోలమాంబ నామస్మరణ
భారీగా తరలివచ్చిన భక్తులు
అమ్మవారి దర్శనానికి బారులు
మక్కువ రూరల్, జనవరి27(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ సిరిమానోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. భక్తులు అడుగడుగునా సిరిమానును తాకి పులకించిపోయారు. చీరెలు, కోళ్లు, పసుపు, కుంకుమలు, అరటిపండ్లు సమర్పించారు. పాహిమాం.. పోలమాంబ అంటూ మొక్కుకున్నారు. భక్తజన హోరు మధ్య సంప్రదాయబద్ధంగా సాగిన సిరిమాను ఊరేగింపును వందలాది మంది ఇళ్లపై నుంచి వీక్షించారు. ఉత్సవం పురస్కరించుకుని ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో వనం, చదురుగుడుల వద్ద క్యూలైన్లన్నీ కిటకిటలాడాయి. గంటల తరబడి నిరీక్షించిన అనంతరం వారు అమ్మవారిని దర్శించుకున్నారు. మరోవైపు వేలాది మంది రాకతో గ్రామం కళకళలాడింది. బంధువులు, స్నేహితులతో శంబరలో వీఽధులన్నీ కిక్కిరిసిపోయాయి. మొత్తంగా జాతరలో ప్రధాన ఘట్టమైన పోలమాంబ సిరిమానోత్సవం అంబరాన్నంటింది. భక్తజనం పులకించింది. అంతటా పోలమాంబ నామస్మరణ మార్మోగింది.
ఆలస్యంగా..
ఏటా మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించాల్సిన సిరిమాను ఉత్సవం ఈ సారి ఆలస్య మైంది. సాయంత్రం 4:25 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభమైంది. ముందుగా పోలమాంబ ఘటాలను చదురుగుడి నుంచి సిరిమాను వద్దకు తీసుకొచ్చారు. ఆ తర్వాత ఘటాలు గిరడ, కుప్పిలి, గ్రామ మున్సబు వారిళ్లకు వెళ్లి పూజలందుకున్నాయి. మరోవైపు ఉపవాస దీక్షకులు తమ భుజాలపై పూజారి జన్ని పేకాపు భాస్కరరావును మోసుకుంటూ తీసుకొచ్చి సిరిమానుపై కూర్చో బెట్టారు. అనంతరం భక్తుల జయజయ ధ్వానాల మధ్య సిరిమానోత్సవం ప్రారంభమైంది. పనుకు వీధి, గొల్లవీధి, కొత్తవీధి మీదుగా చదురుగుడి నుంచి నడివీధిలోని చావిడి వద్దకు తిరిగి సిరిమాను చేరుకుంది. మొత్తంగా రాత్రి ఏడు గంటలకు ఉత్సవం ముగిసింది. పూజారి జన్నిపేకాపు భాస్కరరావును సిరిమాను నుంచి దింపి చదురుగుడికి తీసుకెళ్లారు. అంతకుముందు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కవిరిపల్లి గ్రామానికి చేరుకుని జాతర నిర్వహణపై ఆరాతీశారు. పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, కురుపాం ఎమ్మెల్యే ప్రభుత్వవిప్ తోయక జగదీశ్వరి తదితరులు పోలమాంబను దర్శించుకున్నారు.
అధికారుల పర్యవేక్షణ..
కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి మంగళవారం ఉదయం 10గంటలకు శంబర చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి చదురుగుడిలో మకాం వేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. పాలకొండ సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ గ్రామంలో పర్యటించి జాతరను పర్యవేక్షించారు. ఎస్పీ మాధవరెడ్డి పర్యవేక్షణలో ఏఎస్సీ మనీషారెడ్డి , బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డితో పాటు పలువురు సీఐలు, ఎస్‌ఐలు, సుమారు 800 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. క్యూలైన్లలో భక్తుల మధ్య తోపులాటలు, జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలు తీసుకొన్నారు. ఇకపోతే పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు ప్రాంతాల నుంచి శంబరకు 222 ఆర్టీసీ బస్సులు నడిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో దారిపొడవునా నీటిట్యాంక్‌లను ఏర్పాటు చేశారు. మొబైల్ వ్యాన్ల ద్వారా భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు దేవాలయ సిబ్బంది ఉచితంగా అమ్మవారి ప్రసాదంతో పాటు తాగునీరు అందించారు.