Promotion for them.. Tension for them వారికి ప్రమోషన్.. వీరికి టెన్షన్
ABN , Publish Date - Apr 19 , 2026 | 12:10 AM
Promotion for them.. Tension for them c పదోన్నతల అనందంలో ఉప తహసీల్దార్‌లు, బదిలీల భయంతో తహసీల్దార్‌లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఉప తహసీల్దార్‌లు పదోన్నతులు పొందుతున్నారు.
వారికి ప్రమోషన్.. వీరికి టెన్షన్
పదోన్నతల అనందంతో ఉప తహసీల్దార్‌లు
తహసీల్దార్‌లకు పట్టుకున్న బదిలీ భయాలు
నేతల చూట్టూ ప్రదక్షిణలు
కోరుకున్న స్థానం దక్కించుకోనేందుకు ప్రయత్నం
శృంగవరపుకోట, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి):
- నిత్యం భూ వివాదాలతో నలుగుతున్న మండలంలో పనిచేస్తున్న ఓ ఉప తహసీల్దార్ పదోన్నతి వస్తుందన్న ఆశతో ఉన్నాడు. జిల్లాలో పెద్దగా భూ వివాదాలు లేని ఓ మండలానికి తహసీల్దార్‌గా పని చేయాలనుకుంటున్నాడు. తనకున్న పరిచయాలతో కూటమి ప్రజాప్రతినిధులను సంప్రదిస్తున్నాడు.
- ఓ తహసీల్దార్ కూటమి నేతలను ప్రసన్నం చేసుకొని గత ఏడాది జూన్‌లో తాను కోరుకున్న మండలానికి బదిలీ అయ్యాడు. ఆ తర్వాత టీడీపీలోని గ్రూపుల నేతలతో పొసగడం లేదు. ఉప తహసీల్దార్ల పదోన్నతుల్లో భాగంగా జరుగుతున్న బదిలీల్లో తనను తప్పిస్తారేమోనన్న గబులు పట్టుకుంది.
ఇలా పదోన్నతల అనందంలో ఉప తహసీల్దార్‌లు, బదిలీల భయంతో తహసీల్దార్‌లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలువురు ఉప తహసీల్దార్‌లు పదోన్నతులు పొందుతున్నారు. వీరంతా తహసీల్దార్‌లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. పదోన్నతుల జాబితాలో ఉన్న ఉపతహసీల్దార్‌లను జిల్లాలో ఖాళీగా వున్న తహసీల్దార్ పోస్టుల్లో నియమించాల్సి ఉంటుంది. అయితే ఉప తహసీల్దార్ నుంచి తహసీల్దార్‌లుగా పదోన్నతులు పొందిన వారిని ముందుగా సీసీఎల్‌ఏ (భూపరిపాలన శాఖ) జిల్లాలకు కేటాయించాల్సి ఉంది. ప్రస్తుతం జనాభా గణన -2027 జరుగుతోంది. ఈ నెల 30 వరకు స్వీయ గణన సాగుతుంది. ఎన్యూమరేటర్‌ల ద్వారా మే 1 నుంచి జనగణన చేయాల్సి ఉంటుంది. దీంట్లో తహసీల్దార్‌లదే కీలక బాధ్యత. ఆ సమయంలోపే ఉపతహసీల్దార్‌ల నుంచి తహసీల్దార్‌లుగా పదోన్నతులు పొందిన వారందరికీ ఖాళీలను బట్టి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో పదోన్నతుల జాబితాలో వున్న ఉప తహసీల్దార్‌లు తహసీల్దార్ హోదాలో జిల్లాకు వచ్చేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు వున్నారు.
- జిల్లా కేటాయింపుతో పాటు ఎలాగైనా కోరుకున్న మండలానికి తహసీల్దార్‌గా రావాలని ఆశపడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం పని చేస్తున్న తహసీల్దార్‌లకు స్థాన చలనం వుంటుందన్న అనుమానాలు ఉన్నాయి. పలు మండలాల్లో తహసీల్దార్‌ల పనితీరు కూటమి ప్రజా ప్రతినిధులు, నాయకులకు నచ్చడం లేదు. వీరు చెప్పే పనులు జరగకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు. మరికొన్ని మండలాల్లో అధికార పార్టీ నేతల మధ్య వున్న వర్గపోరులో అక్కడి తహసీల్దార్‌లు ఓ వర్గంనకు పూర్తిగా సహకరిస్తున్నారు. మరో వర్గాన్ని విస్మరిస్తున్నారు. పరిస్థితులను బట్టి ప్రజా ప్రతినిధుల మాట వినడం లేదు. అప్పటికప్పుడు ఏదో ఒక సమాదానం చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో కింది స్థాయి పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిపై ప్రజా ప్రతినిధులు, పార్టీలో బాగా పేరున్న నేతలు గుర్రుగా వున్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. తహసీల్దార్‌ల మార్పును కోరుకుంటున్నారు.
నేతల చుట్టూ చక్కెర్లు
ఉపతహసీల్దార్‌ల నుంచి పదోన్నతులు పొందిన తహసీల్దార్‌లు ఇప్పటికే ప్రజా ప్రతినిధులు, పేరున్న నేతల టచ్‌లోకి వచ్చారు. తహసీల్దార్‌గా తమను నియమించుకుంటే అనుకూలంగా పని చేస్తామని భరోసా ఇచ్చేశారు. దీంతో వీరెక్కడ తమ స్థానాలకు ఎసరు పెడతారోనన్న ఆందోళన ప్రస్తుత తహసీల్దార్‌లకు పట్టుకుంది. ఎందుకైనా మంచిదని తననేమైనా మార్చే ఆలోచన చేస్తున్నారా? అంటూ తమ వద్దకు వస్తున్న దిగువ స్థాయి నేతలు, కార్యకర్తలను అడుగుతున్నారు. ప్రజా ప్రతినిధులకు, పేరున్న నాయకులకు అత్యంత సన్నిహితంగా వున్న నేతలు, కార్యకర్తలను కూర్చోబెట్టుకోని మరీ సరదా కబుర్లు చెబుతున్నారు. ‘మీరడిగిన పనులనన్నీ చేస్తున్నాను కదా? నా ఉద్యోగానికి ఇబ్బంది కలిగే పనులు చేయలేను కదా?’ అంటూ చిలక పలుకులు పలుకుతున్నారు. వీరిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా కూర్చీని కాపాడుకోనే ప్రయత్నం చేసుకుంటున్నారు. వీరి ద్వారా తెలుసుకున్న సమాచారం బట్టి కుర్చీ కదిలిపోతుందన్న నిర్ణయానికి వచ్చిన వారంతా అనుకూలమైన మండలం కోసం వెతుకుతున్నారు. అక్కడి ప్రజాప్రతినిధులు, పేరున్న నేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు. ‘మీ మండలంలో చోటు కల్పించేలా చూడాలని’ ప్రాధేయపడుతున్నారు. ఇప్పుడు జిల్లాలో ఏ మండలంలో చూసినా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
-----------