Share News

Profit ‘milk’ లాభాల‘పాలు’

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:39 AM

Profit ‘milk’ పాలు గురించి ప్రస్తావిస్తే పెద్దలైనా, వైద్యులైనా ఆరోగ్యానికి మేలనే చెబుతారు. ఆరోగ్యవంతులు కూడా మరింత పుష్టిగా ఉండటానికి పాలను ఆశ్రయిస్తుంటారు. ఈ పాలు ఉపయోగించని ఇల్లు ఉండదు. నిత్యావసరంగా భావించే వారే ఎక్కువ. ఉదయాన టీ తాగితే గాని ఎంతో మందికి రోజువారీ విధులు మొదలుకావు.

Profit ‘milk’ లాభాల‘పాలు’
బొబ్బిలి పట్టణంలో పాల కేంద్రానికి పాలు పోస్తున్న దృశ్యం

లాభాల‘పాలు’

ఆరోగ్యానికి... అభివృద్ధికి కీలక వనరు

పాడి పశువులతో వ్యాపారం

రాణిస్తున్న స్వయంశక్తి మహిళలు

నేడు ప్రపంచ పాల దినోత్సవం

పాలు గురించి ప్రస్తావిస్తే పెద్దలైనా, వైద్యులైనా ఆరోగ్యానికి మేలనే చెబుతారు. ఆరోగ్యవంతులు కూడా మరింత పుష్టిగా ఉండటానికి పాలను ఆశ్రయిస్తుంటారు. ఈ పాలు ఉపయోగించని ఇల్లు ఉండదు. నిత్యావసరంగా భావించే వారే ఎక్కువ. ఉదయాన టీ తాగితే గాని ఎంతో మందికి రోజువారీ విధులు మొదలుకావు. ఆ టీ కావాలన్నా పాలే కీలకం. ఆలయాలకు వెళ్లే భక్తులకు అభిషేకం కోసం పాలు ఉండాల్సిందే. దీని ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఏటా జూన్‌ 1న ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇటు జిల్లాలోనూ పాల దిగుబడిని సాధించడంలో రైతులు ఇతోధికంగా కృషి చేస్తున్నారు. పాడి పరిశ్రమ నడుపుతూ డ్వాక్రా సంఘాలు వ్యాపారంలో విశేషంగా రాణిస్తున్నాయి.

బొబ్బిలి, మే 31 (ఆంధ్రజ్యోతి):

పాలలో కాల్షియం, ప్రొటీన్లు, విటమిన్‌-డి, బి-12 వంటి పోషకాలు సమృద్ధిగా ఉండడంతో ఎముకల దృఢత్వానికి, శారీరక ఎదుగుదలకు, రోగ నిరోధక శక్తికి దివ్య ఔషధంగా వైద్యులు సూచిస్తుంటారు. ఆవు పాల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ ఈ ఏడాది మహిళా పాల రైతులు, డెయిరీ రంగంలో వారి సేవలను చాటే అంశాన్ని ప్రధానంగా పరిగణించాలని అంతర్జాతీయ సమాజం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రపంచ వ్యాప్తంగా పాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

అనాదిగా గ్రామీణభారతంలో పాడి రంగానికి సంబంధించి పశుపోషణ ముఖ్య భూమిక పోషిస్తోంది. వర్షాధారంతో పంటలు పండించే ప్రాంతాలలో వ్యవసాయానికి అనుబంధరంగంగా పాడిపోషణ రైతులకు ఎంతో బాసటగా నిలుస్తోంది. పశు సంరక్షణ, పాల సేకరణ, మార్కెటింగ్‌ రంగాలలో లక్షలాదిగా మహిళలు రాణిస్తున్నారు. అమూల్‌, విశాఖ డెయిరీ వంటి అనేక ప్రభుత్వ సహకార డెయిరీలు తమ మార్కెట్‌ కార్యకలాపాలను జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో విస్తరింపజేస్తున్నాయి. బొబ్బిలి ప్రాంతంలో పక్కి, అలజంగి, రామభద్రపురం, రాజుపేట, దిబ్బగుడ్డివలస, నారసింహునిపేట తదితర గ్రామాలలో పాలదిగుబడి కోసం రైతులు చాలా శ్రమిస్తున్నారు.

పది ఆవులతో జీవనం సాగిస్తున్నాం

నాగిరెడ్డి విజయగౌరి, రాజుపేట, బొబ్బిలి మండలం

2011 నుంచి మేము పది ఆవులతో చిన్నపాటి డెయిరీని నడుపుకుంటున్నాం. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో గౌరవప్రదంగా జీవిస్తున్నాం. రోజుకు 30 నుంచి 40 లీటర్ల పాలను విక్రయిస్తున్నాం. ఆవుపాల ధర లీటరు రూ.40, గేదె పాల ధర రూ.70 నుంచి 80 పలుకుతోంది.

3.30 గంటలకే లేస్తాం

మోడీ శంకర్‌, పాలవ్యాపారి, బొబ్బిలి

ప్రతిరోజూ వేకువజామున 3.30 గంటలకు లేచి పశువుల కొట్టాంను శుభ్రపరిచి, పాడిపశువులకు మేత వేస్తాను. పాల కొనుగోలు దారులు ఇంకా నిద్రలేవకమునుపే మా దైనందిన జీవితం ప్రారంభమవుతుంది. 5.30 గంటలకు వినియోగదారుల ఇళ్లకు సైకిల్‌పై వెళ్లి పాలుపోస్తాం.

Updated Date - Jun 01 , 2026 | 12:39 AM