problem for industries భూములిస్తే రోగాలిచ్చారు!
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:45 PM
problem for industries పారిశ్రామిక ప్రగతికి మేముసైతం అంటూ ముందుకొచ్చారు. పరిశ్రమల స్థాపనకు భూములిచ్చారు. మట్టితో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని త్యాగనిరతి చాటారు. ప్రతిఫలంగా వారికి ఉద్యోగాలిస్తామన్న యాజమాన్యాలు ఉపాధి చూపకపోగా వారిపైకి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి.
భూములిస్తే రోగాలిచ్చారు!
దినదినగండంగా గ్రోత్ సెంటర్ సమీప ప్రజల జీవనం
పరిశ్రమల వ్యర్థాలతో గాలి, నీరు, నేల కాలుష్యం
ప్రాణాంతక వ్యాధులతో విలవిల
పారిశ్రామిక ప్రగతికి మేముసైతం అంటూ ముందుకొచ్చారు. పరిశ్రమల స్థాపనకు భూములిచ్చారు. మట్టితో ఉన్న అనుబంధాన్ని తెంచుకుని త్యాగనిరతి చాటారు. ప్రతిఫలంగా వారికి ఉద్యోగాలిస్తామన్న యాజమాన్యాలు ఉపాధి చూపకపోగా వారిపైకి కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. వ్యాధుల పాలు చేస్తున్నాయి. పేదల ప్రాణాలను తోడేస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులూ చూసీచూడనట్లు పోతున్నారు. వెరసి తాము ఏ పాపం చేశామని బతుకును భారం చేశారని పేదలంతా ఆక్రోశిస్తున్నారు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌కు భూములిచ్చిన రైతుల ఆవేదన ఇది.
బొబ్బిలి రూరల్, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి):
తమ కుటుంబాల్లోని యువకులకు ఉపాధి దొరుకుతుందన్న ఆశతో నాడు గ్రోత్ సెంటర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు భూములిచ్చిన రైతులు నేడు అవే పరిశ్రమలు వెదజల్లే విషవాయువులు, రసాయనాలతో ప్రాణాంతక వ్యాధులు ప్రబలి విలవిల్లాడుతున్నారు. ఉపాధి సంగతి తర్వాత ప్రాణాలు కాపాడండి మహాప్రభో అని వేడుకుంటున్నారు. పరిశుభ్రమైన తాగునీరు, గాలి అందక దినదినగండంగా బతుకుతున్నారు. ఉన్న కాస్త నేలలు కూడా పంటలకు పనికిరాకుండా పోతు న్నాయి. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తాగునీరు, ఆహారోత్పత్తులకోసం బొబ్బిలి పట్టణాన్ని ఆశ్రయిస్తున్నారు. ప్రతిరోజూ తాగునీరు, ఇతర ఆహార వనరులకోసం డబ్బులు వెచ్చిస్తున్నారు. నాడు ఇచ్చిన హామీలను పరిశ్రమల యాజమాన్యాలు కాని ప్రభుత్వం కాని నెరవేర్చకపోవడంతో తీవ్ర ఇబ్బందుల నడుమ జీవితాన్ని భారంగా లాక్కొస్తున్నారు.
బొబ్బిలి మండలంలోని గున్నతోటవలస, ఎం.బూర్జవలస, పణుకువలస, కొత్తపెంట, మెట్టవలస తదితర గ్రామాల ప్రజలు బొబ్బిలి గ్రోత్‌సెంటర్‌లోని పరిశ్రమలు వెదజల్లే వాయుకాలుష్యంతో పాటు జలకాలుష్యానికి అవస్థలు పడుతున్నారు. పరిశ్రమల్లోని రసాయనాలను శుద్ధిచేయకుండా నేరుగా గ్రామాల్లోని చెరువుల్లోకి విడిచి పెడుతున్నారు. ఫలితంగా భూగర్భజలాలు కాలుష్యానికి గురౌతుండగా పంటలు పండడం లేదు. పరిశుభ్రమైన తాగునీరు అందడంలేదు. పరిశ్రమలనుంచి వచ్చే విషవాయువులతో ప్రజలు వివిధ రోగాలతో మంచాన పడుతున్నారు. శ్వాసకోస, కీళ్ల వ్యాధులతో అవస్థలు పడుతున్నారు. దీనిపై పలుమార్లు అధికారులకు, పాలకులకు, ఫిర్యాదులు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదని, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతూ మృత్యువాత పడుతున్నా తమ వైపు చూడడం లేదని బాధితులు వాపోతున్నారు. బొబ్బిలి పట్టణానికి కూతవేటు దూరంలో ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్ తరాలు ప్రమాదకర వ్యాధులతో బాధ పడతారని కన్నీరుపెడుతున్నారు.
ఫ ఎంబూర్జవలసలోని స్వామివారి చెరువు, పణుకువలసలోని బడ్డివాని చెరువుల్లోకి పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలను నేరుగా కాలువలద్వారా విడిచిపెడుతున్నారు. భూగర్భ జలవనరులు కాలుష్యానికి గురవుతూ పంటలు పండడంలేదని, పరిశుభ్రమైన తాగునీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. రాత్రిళ్లు వదిలే విషవాయువులతో శ్వాసకోసవ్యాధులతో ఆసుపత్రుల పాలవుతున్నామని గోడు వెళ్లగక్కుతున్నారు.
భవిష్యత్ తరాలకు ముప్పే
వ్యవసాయం చేస్తుంటాను. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసముంటున్నాను. ప్రైవేటు ఎల్లాయిస్ కంపెనీ వారు మా గ్రామాల్లోని చెరువుల్లోకి నేరుగా రసాయనాలను విడిచి పెట్టడంతో భూగర్భజలాలు కాలుష్యం అవుతున్నాయి. వీటిపై ప్రశ్నిస్తే వాటర్ ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు తప్ప ఇంతవరకూ ఒక్క ప్లాంటు కూడా ఏర్పాటు చేయలేదు. వాయుకాలుష్యంపై మొక్కలు నాటతామన్నారు. ఇంతవరకూ ఏం చేయలేదు. రానున్న తరాల ప్రజలకు రసాయనాల ముప్పు తప్పేలా లేదు.
నల్ల అప్పలనాయుడు, రైతు, ఎం.పణుకువలస
భూములిస్తే వ్యాధుల పాలు చేశారు
ఓ ఎల్లాయిస్ కంపెనీతో పాటు గ్రోత్ సెంటర్‌లోని చాలా పరిశ్రమల వ్యర్థాలను మా గ్రామంలోని చెరువుల్లోకి విడిచిపెడుతున్నారు. తాగునీరు కలుషితమవుతోంది. ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. కలుషితమైన తాగునీరు, ఆహారం, గాలే నా రోగానికి కారణమై ఉండొచ్చునని వైద్యులు చెప్పారు. మా పరిస్థితిని పాలకులు, అధికారులు పట్టించుకోవడంలేదు. పరిశ్రమలకు పొలాలిచ్చినందుకు ప్రభుత్వం మాకిచ్చిన బహుమానం ఇది.
- చల్ల రాములమ్మ, క్యాన్సర్ బాధితురాలు, ఎం.బూర్జవలస
రోగాలు అంటగట్టారు
గ్రోత్ సెంటర్‌లోని పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలను మా గ్రామంలోని చెరువుల్లోకి విదిలేస్తున్నారు. కనీసం శుద్ధి చేయడం లేదు. దీనివల్ల తాగునీరు కలుషితమవుతోంది. ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. కలుషిత తాగునీరు, ఆహారం వల్లే క్యాన్సర్ ప్రబలి ఉండొచ్చునని వైద్యులు తెలిపారు. ఉపాధి చూపుతారని భూములు ఇచ్చాం. ప్రతిఫలంగా రోగాలు అంటగడుతున్నారు.
- యాసల అప్పలనాయుడు, క్యాన్సర్ బాధితుడు. ఎం.పణుకువలస