problem at school మళ్లీ మళ్లీ పొర‘బడి’
ABN , Publish Date - Oct 05 , 2026 | 12:16 AM
problem at school మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకప్పుడు ఉన్నత విలువలకు, ఉత్తమ బోధనకు కేంద్రంగా ఉండేది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతోమంది ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. గత ఏడాదిగా పరిస్థితి తారుమారైంది.
మళ్లీ మళ్లీ పొర‘బడి’
వివాదాలకు వేదికగా డోలపేట ఉన్నత పాఠశాల
గతంతో బాలికపై ఉపాధ్యాయుడి వికృత చేష్ఠలు
ఉపాధ్యాయుడ్ని కొట్టిన మరో ఉపాధ్యాయిని కొడుకు
తాజాగా విద్యార్థుల్ని చితకబాదిన ఉపాధ్యాయుడు
రాజాం రూరల్, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒకప్పుడు ఉన్నత విలువలకు, ఉత్తమ బోధనకు కేంద్రంగా ఉండేది. ఇక్కడ విద్యనభ్యసించిన ఎంతోమంది ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారు. గత ఏడాదిగా పరిస్థితి తారుమారైంది. ఈపాఠశాల వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తరచూ వార్తల్లోకెక్కుతోంది. పాఠశాలను చూసి ఔరా అనేవాళ్లంతా.. ఇప్పుడు విచారపడుతున్నారు. ఉపాధ్యాయుల వ్యవహారశైలి కూడా ఇలాంటి సంఘటనలు జరిగేందుకు ఓ కారణంగా మేధావివర్గం బహిరంగంగానే విమర్శిస్తోంది.
డోలపేట పాఠశాలలో పనిచేసే ఓ ఉపాధ్యాయుడు ఇక్కడే చదువుతున్న మైనర్ విద్యార్థిని పట్ల ఈ ఏడాది ప్రారంభంలో అనుచితంగా ప్రవర్తించాడు. ఆ చిన్నారి కొన్నాళ్లపాటు ఇంట్లో చెప్పకుండా మౌనంగా భరించింది. ఆ ఉపాధ్యాయుడి చేష్టలు ఎక్కువ కావడంతో గత్యంతరం లేక తల్లిదండ్రులకు చెప్పి బోరున ఏడ్చింది. దీనిపై తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడ్ని నిలదీశారు. సంతకవిటి పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు నిర్వహించిన విద్యాశాఖ అధికారులు ఆ ఉపాధ్యాయుడిని ఆర్నెళ్లపాటు సస్పెండ్ చేశారు. ఇదే పాఠశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు వేణుపై అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయిని కొడుకు ఈ ఏడాది జూలై 10న దాడికి పాల్పడ్డాడు. ప్రార్థన సమయంలో పాఠశాల మెయిన్‌గేటుకు అడ్డంగా కారు నిలిపివేయడాన్ని ప్రశ్నించిన వ్యాయామ ఉపాధ్యాయినిపై ఆ యువకుడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఆ ఘటనపై స్పందించిన మరో ఉపాధ్యాయుడు ఆ యువకుడి తీరును ప్రశ్నిస్తే.. అతనిని తీవ్రంగా కొట్టి గాయ పరిచాడు. ఈ విషయంపై రాజాం పోలీసులకు ఫిర్యాదు అందింది. అయితే ఉపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన యువకుడు గాయపడిన ఉపాధ్యాయుడికి సారీ చెప్పడంతో ఆ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది.
తాజాగా...
పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ ఉపాధ్యాయుడు రామకృష్ణ ఈనెల 1న ముగ్గురు తొమ్మిదో తరగతి విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. తరగతిగదిలో చివరిబెంచ్‌లో ఉన్న ముగ్గురు విద్యార్థులు పాఠం వినకపోవడాన్ని గుర్తించి వారిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టారు. వీరిలో ఓ విద్యార్థికి కంటి సమీపంలో తీవ్ర గాయమైంది. చికిత్స కోసం రాజాం ఏరియా ఆసుపత్రిలో చేరాడు. కొడుకును కొట్టిన ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు రాజాం పోలీసులకు ఈనెల 2న ఫిర్యాదు చేశారు. అంతకుముందు జల్లా విద్యాశాఖాధికారికి సైతం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. విద్యార్థులను తీవ్రంగా కొట్టిన సోషల్ ఉపాధ్యాయుడిపై దర్యాప్తు నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఈవో మాణిక్యంనాయుడు స్పష్టం చేశారు. విద్యాశాఖాధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఉపాధ్యాయుడిపై చర్య తీసుకుంటానని రాజాం టౌన్ సీఐ నవీన్‌కుమార్ తెలిపారు.
------------