Probe Against Former MLA మంత్రి తనయుడు, పీఏ కేసులో... మాజీ ఎమ్మెల్యేపై విచారణ
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:08 AM
Probe Against Former MLA in Minister’s Son, PA Case మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నమోదైన కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కాల్‌లిస్ట్ ఆధారంగా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల తీరు సరికాదని భంజ్‌దేవ్ ఆవేదన
పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్తానని వెల్లడి
సాలూరు, మార్చి 11(ఆంధ్రజ్యోతి): మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కుమారుడు, ఆమె పీఏపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ నమోదైన కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కాల్‌లిస్ట్ ఆధారంగా పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పట్టణ సీఐ అప్పలనాయుడు, రూరల్ సీఐ రామకృష్ణ కొద్ది రోజుల కిందట పాచిపెంట మాజీ ఎంపీపీ, టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు పి.ప్రసాద్‌బాబు, స్ఫూర్తి మహిళా మండలి అధ్యక్షురాలు బి.రాధ, పట్టణ 23వ వార్డు కౌన్సిలర్, టీడీపీ ఫ్లోర్ లీడర్ టి.లక్ష్మోజీరావు, సాలూరు మండల వైసీపీ నాయకుడు రెడ్డి సురేష్‌కుమార్‌ను విచారించారు. తాజాగా బుధవారం పట్టణ పోలీసులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌ను కూడా విచారించారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన ఇంటికి పోలీసులు వెళ్లి చాలాసేపు విచారణ కొనసాగించారు.
- అనంతరం పట్టణ సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ.. మంత్రి కుమారుడు, ఆమె పీఏపై వచ్చిన తప్పుడు ఆరోపణల కేసులో ప్రధాన నిందితురాలు, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ మధ్య పలుమార్లు ఫోన్ సంభాషణలు జరిగినట్లు తేలిందని, కాల్ డేటాలో ఇది రుజువు కావడంతో మాజీ ఎమ్మెల్యేను విచారించామని అన్నారు.
- ఈ విషయంపై భంజ్‌దేవ్ విలేకర్లతో మాట్లాడుతూ.. తన సుదీర్ఘ రాజకీయం జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదన్నారు. నిందితురాలి త్రివేణితండ్రి ఈశ్వరరావు, తాను స్నేహితులమని తెలిపారు. ఇందువల్లే పలుమార్లు తనకు ఫోన్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు దేవీప్రసాద్ సైతం తన ఇంటికి వచ్చారన్నారు. రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు తనకు ప్రతిఒక్కరూ ఫోన్ చేస్తారన్నారు. అలాంటి వారికి ఫోన్ ఎత్తి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. అయితే పోలీసులు ఇలా తనను విచారణ చేయడం సరికాదన్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
- మంత్రి తనయుడు, పీఏ కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురిని విచారించారు. అయితే కాల్‌లిస్ట్ చాలా పెద్దదే ఉన్నట్లు తేలడంతో పోలీసులు నుంచి ఎవరికి ఎప్పుడు ఫోన్ కాల్ వస్తుందోనని టీడీపీ, వైసీపీకి చెందిన కొంతమంది నాయకులు ఆందోళన చెందుతున్నారు.