ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ
ABN , Publish Date - Jan 19 , 2026 | 11:34 PM
బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో రద్దీగా మారుతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ బస్సుల యజమానులు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు.
- అదనపు చార్జీలు వసూలు
- ప్రయాణికులపై తప్పని భారం
- ఆర్టీసీ సర్వీసులు చాలక ఇబ్బందులు
పార్వతీపురం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు జనాలతో రద్దీగా మారుతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ బస్సుల యజమానులు ప్రయాణికులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని అదనపు చార్జీలు వసూలు చేస్తూ వారి జేబులను గుల్లచేస్తున్నారు. ఏకంగా టిక్కెట్‌పై మూడు, నాలుగు రెట్లు వసూలు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ, హైదరాబాద్, బెంగళూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు వేసినప్పటికీ రిజర్వేషన్లు దొరక్క, తత్కాల్ టిక్కెట్లు లభించక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారంతా ప్రైవేటు బస్సులనే ఆశ్రయిస్తున్నారు. లగేజీ ఎక్కించేందుకు సౌలభ్యం ఉండడంతో వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. పార్వతీపురం కేంద్రం నుంచి పెద్దగా ప్రైవేటు ట్రావెల్స్ లేకపోవడంతో విజయనగరం, విశాఖపట్నం వెళ్తున్నారు. ఈ పరిస్థితిని ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. టిక్కెట్ చార్జీలను అమాంతం పెంచేశాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు రూ.5 వేలు వసూలు చేస్తున్నాయి. భార్య, భర్త ఇద్దరు పిల్లలు వెళ్లాలంటే కనీసం రూ.20 వేలు చార్జీల కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితి లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్ల ధరలను అదుపులో పెట్టామని రవాణాశాఖాధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
ఒకే కౌంటర్‌తో ఇబ్బందులు...
జిల్లా కేంద్రంలోని బెలగాం రైల్వేస్టేషన్ వద్ద ఒకే టిక్కెట్ కౌంటర్ ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తత్కాల్ టిక్కెట్ల కోసం బారులు తీరుతున్నారు. తత్కాల్ సైట్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే టిక్కెట్లు అయిపోతుండడంతో ఉసూరుమంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పరిస్థితి ఉన్నప్పటికీ రైల్వేశాఖ స్పందించకుండా ఒకే కౌంటర్‌తో కాలం గడుపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపో నుంచి 262 సర్వీసులను నడుపుతున్నారు. సాధారణ రోజుల్లో 238 సర్వీసులను విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాలకు నడుపుతుంటారు. అయితే, సంక్రాంతి తిరుగ ప్రయాణాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 24 అదనపు సర్వీసులను తిప్పుతున్నారు. అయినా ఈ బస్సులు సరిపోవడం లేదని ప్రయాణికులు అంటున్నారు. సోమవారం జిల్లా కేంద్రం పార్వతీపురంలో విశాఖపట్నం తదితర దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గంటల కొద్దీ బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, పార్వతీపురం, సాలూరు, పాలకొండ డిపోల ద్వారా రోజుకు రూ.52 లక్షల పైబడి ఆదాయం ఆర్టీసీకి లభిస్తుంది.
రెండు రోజులకు రూ.1.07 కోట్ల ఆదాయం
సాలూరు రూరల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): గత రెండు రోజులుగా ప్రయాణికులను తరలించడం ద్వారా జిల్లాలో ఆర్టీసీ ఓఆర్ (ఆక్యుపెన్సీ రేట్) 101 శాతంగా నమోదైంది. ఈ నెల 17,18 తేదీల్లో జిల్లాలో 262 సర్వీసుల ద్వారా 2,35,833 మంది ప్రయాణికులను తరలించారు. తద్వారా సంస్థకు రూ.1,07,44,142 ఆదాయం లభించింది. గత రెండు రోజుల్లో సాలూరు, పాలకొండ, పార్వతీపురం డిపోల ద్వారా 1,05,253 మంది పురుష ప్రయాణికులను తరలించడం ద్వారా రూ.58,07,027 ఆదాయం లభించింది. స్త్రీ శక్తి పథకంలో 1,30,580 మంది మహిళలను తరలించడం ద్వారా రూ.49,37,115 ఆదాయం సమకూరింది. మొత్తంగా రూ.1,07,44,142 ఆదాయం వచ్చింది. ప్రతి డిపోలో ఓఆర్ 101 శాతం దాటడడం విశేషం. స్త్రీ శక్తి పథకానికి ముందు ఆర్టీసీ ఓఆర్ తక్కువగా ఉండేది. స్త్రీ శక్తి అమలు తరువాత ఓఆర్ 85 శాతం దాటింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఓఆర్ 101 శాతం దాటినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 10 నుంచి 16 వరకు 262 సర్వీస్‌ల ద్వారా జిల్లాలో 7.29 లక్షల మంది ప్రయాణికులను తరలించగా ఆర్టీసీకి రూ.3.31 కోట్లు ఆదాయం లభించింది.
సేవలందిస్తున్నాం:
జిల్లాలో మూడు డిపోల ద్వారా రోజుకు రూ.52 లక్షలు ఆదాయం ఆర్టీసీకి లభిస్తుంది. ఆదాయం చాలా బాగుంది. ప్రయాణికులకు కూడా సేవలను సంతృప్తికరంగా అందిస్తున్నాం.
-వెంకటేశ్వర్లు, డీపీటీవో, పార్వతీపురం