చేబ్రోలు శివారులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:06 AM
కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు శివారు జాతీయ రహదారి చెంతనే ఓ ప్రైవేటు ట్రావె ల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులకు గాయాలు
గొల్లప్రోలు రూరల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు శివారు జాతీయ రహదారి చెంతనే ఓ ప్రైవేటు ట్రావె ల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. శ్రీకాకుళం నుంచి భీమవరానికి విజయకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు ఆదివారం రాత్రి బయలుదేరింది. సోమవారం తెల్లవారుజామున 2గంటల సమయంలో కాకినాడ జిల్లా కత్తిపూడి దాటి చేబ్రోలు శివారు సత్తెమ్మతల్లి ఆలయం వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి 216వ జాతీయ రహదారి చెంతనే ఉన్న పోల్స్‌ను ఢీకొని బోనస్ రాజులుకు చెందిన పంటపొలాల్లోకి బోల్తా పడింది. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉండడంతో ఒక్కరికిగా భయాందోళనకు గురై కేకలు వేశారు. ఈ బస్సు వెనుకే వస్తున్న ఆర్టీసీ బస్సు ఆ శబ్దం విని ఆపి వేశారు. ప్రయాణికులతో కలిసి వెళ్లి ట్రావెల్స్ బస్సు అద్దాలు పగులకొట్టి అందులో ఉన్న ప్రయాణికులను బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 24 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన బెహరా రవికుమార్, సీహెచ్.రవిళి, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఓ.ప్రియాంకలతోపాటు వివిద జిల్లాల చెందిన 11మందికి గాయాలయ్యాయి. వారిని హైవే అంబులెన్స్‌లో హైవే పోలీసులు పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వేర్వేరు బస్సుల్లో వారి స్వస్థలాలకు పంపారు. వారంతా సంక్రాంతి పండుగకు వెళ్లి తిరిగి వస్తున్నట్టు సమాచారం. సంఘటనా స్థలా న్ని పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్‌ఐ ఎన్.రామకృష్ణ, మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ గౌరీశంకర్ పరిశీలించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండిషన్‌ను తనిఖీ చేశారు.