Priority is given to the welfare of the disabled దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం
ABN , Publish Date - Mar 18 , 2026 | 11:44 PM
Priority is given to the welfare of the disabled దివ్యాంగుల సంక్షేమం, ఆర్థిక ఎదుగుదల కోసమే ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం ఆర్‌టీసీ డిపో ఆవరణలో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఆయన ప్రారంభించారు
దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యం
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో వందశాతం ఉచిత ప్రయాణం
తోడుగా వచ్చేవారికీ రాయితీ
‘దివ్యాంగ శకి’్త పథకాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్
విజయనగరం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):
దివ్యాంగుల సంక్షేమం, ఆర్థిక ఎదుగుదల కోసమే ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందని ఎంఎస్‌ఎంఈ, సెర్ప్, ఎన్‌ఆర్‌ఐ సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం ఆర్‌టీసీ డిపో ఆవరణలో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం దివ్యాంగ విద్యార్థులతో కలిసి ఉచిత బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం గతంలో ఉన్న రాయితీలను పెంచుతూ, ఇప్పుడు ఐదు రకాల బస్సుల్లో (పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్, సిటీ బస్సుల్లో) 100 శాతం ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. అంతే కాకుండా, ఏసీ, ప్రీమియం బస్సుల్లో ప్రయాణించే దివ్యాంగులకు 50 శాతం రాయితీ కొనసాగుతుందని తెలిపారు. దివ్యాంగులకు తోడుగా వచ్చే వారికి కూడా నిబంధనల మేరకు అన్ని రకాల బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే క్రీడల్లో రాణించే దివ్యాంగుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చి వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం ఎంత విజయవంతమైందో అదే స్ఫూర్తితో దివ్యాంగ శక్తి కూడా దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. బస్సులలో దివ్యాంగులకు కేటాయించిన సీట్లు వారికి అందుబాటులో ఉండేలా సిబ్బంది, ప్రజలు సహకారం అందించాలని కోరారు. అర్హులైన దివ్యాంగులందరూ బస్‌పాసులు పొందాలని, బస్సు పాసు మూడు సంవత్సరాల గడువుతో అందజేస్తామన్నారు. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ దివ్యాంగులకు దేశంలోనే అత్యధిక పింఛను అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. అనంతరం దివ్యాంగులకు బస్సు పాసులు అందించారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకురాలు పి.యశస్వి, జిల్లా పరిషత్ సీఈవో బీవీ సత్యనారాయణ, డీపీటీవో వరలక్ష్మి, మెప్మా పీడీ చిట్టిరాజు, డిపో మేనేజర్ శ్రీనివాస్, డిప్యూటీ సీటీఎం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
వరంగా భావిస్తున్నా..
ఎ.జాహ్నవి..(మూగ), 8వ తరగతి విద్యార్థి
నేను ఎదైనా ఊరు వెళ్లాలంటే ప్రయాణానికి డబ్బులు ఖర్చు అయ్యేవి. మా లాంటి వారికి భారంగా ఉండేది. కానీ సీఎం గారు దివ్యాంగ శక్తి పథకం పేరుతో మాకు అడగకుండానే మరో వరం అందించారు. మా అందరి తరుపున థాంక్యూ సీఎం సార్.
ఎంతోమందికి ఉపయోగం
అంజనా..(అందబాలిక), విజయనగరం
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వరకు 50 శాతం రాయితీ ఉండేది. ఇప్పుడు ఉచిత బస్సుప్రయాణానికి అవకాశం ఇవ్వడం వల్ల దివ్యాంగ విద్యార్థులకు ఊతం ఇచ్చినట్లు ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో మాకు సీట్లు కేటాయించేలా చూడాలి.