అభివృద్ధికే పట్టం
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:27 PM
నగర ప్రజలు అభివృద్ధికే పట్టంకట్టారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకున్నారు.
- కూటమి అభ్యర్థికి ఏకపక్షంగా మద్దతు తెలిపిన నగర ప్రజలు
- భారీ మెజార్టీతో గెలిచిన భార్గవి
-ఫలించిన ఎమ్మెల్యే అదితి వ్యూహం
- వైసీపీకి తప్పని భంగపాటు
విజయనగరం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): నగర ప్రజలు అభివృద్ధికే పట్టంకట్టారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకపక్షంగా కూటమి అభ్యర్థి అవనాపు భార్గవికి మద్దతు పలికారు. ఆమెను భారీ మెజార్టీతో గెలిపించారు. కూటమి అభ్యర్థిగా భార్గవిని ఎంపిక చేయడం నుంచి ఆమె గెలుపు వరకూ స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజు పక్కా వ్యూహం అనుసరించారు. వాస్తవానికి భార్గవిని ఎంపిక చేయడం టీడీపీలో చాలామంది సీనియర్లకు మింగుడుపడలేదు. కచ్చితంగా ఆమె నెగ్గుకు వస్తారని ఎమ్మెల్యే అదితి నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకం వమ్ముకాలేదు. వైసీపీ అభ్యర్థి శ్రావణిపై ఏకంగా 18,555 ఓట్ల మెజార్టీతో భార్గవి ఘన విజయం సాధించారు. శ్రావణికి 57,519 ఓట్లురాగా.. భార్గవికి 76,074 ఓట్లు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిందే. అదే నగరంలో పాలకపక్షంగా ఉంటే మరింత అభివృద్ధి సాధ్యమని ఎక్కువ మంది భావించారు. అందుకే నగర ప్రజలు ఏకపక్షంగా భార్గవికి విజయాన్ని కట్టబెట్టారు.
వైసీపీకి భారీ ఎదురు దెబ్బ..
కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. వాస్తవానికి విజయనగరం కార్పొరేషన్‌ను ఎలాగైనా కైవసం చేసుకోవాలని వైసీపీ చేయని ప్రయత్నమంటూ లేదు. కోలగట్ల వీరభద్రస్వామి అన్నీతానై చూసుకున్నారు. కుమార్తె రాజకీయ భవిష్యత్‌కు సంబంధించిన అంశం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ విషయంలోనూ వెనక్కి తగ్గలేదు. అయితే నగర ప్రజలు మాత్రం వైసీపీ గత వైఫల్యాలను గుర్తించుకున్నారు. గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి గత రెండేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని, అదే పార్టీ నగరంలో పాలకపక్షంగా ఉంటే మరింత అభివృద్ధి సాధ్యమని ఎక్కువ మంది భావించారు. అందుకే టీడీపీ అభ్యర్థికి పట్టంకట్టారు. దీంతో జిల్లా కేంద్రంలో వైసీపీ కోటకు బీటలు వారాయి.
ఏకపక్ష వైఖరితో..
మొన్నటివరకూ విజయనగరం కౌన్సిల్‌లో వైసీపీకి బలం ఉండేది. 2021లో మేయర్‌గా వెంపడాపు విజయలక్ష్మిని గెలిపించుకున్నారు. అయితే, కార్పొరేటర్లకు పెద్దగా గౌరవం లేకుండా పోయింది. అందుకే చాలా మంది వైసీపీకి దూరమయ్యారు. ఆ జాబితాలో అవానపు విజయ్, విక్రమ్ ఉన్నారు. వీరిద్దరూ మునిసిపల్ మాజీ చైర్మన్ అవనాపు సూరిబాబు కుమారులు. వైసీపీలో ఉన్నప్పుడు కోలగట్లతో విభేదించి సాధారణ ఎన్నికల సమయంలో విజయ్ టీడీపీలో, విక్రమ్ జనసేనలో చేరారు. అదే విధంగా కోలగట్ల అనుచరులు కూడా టీడీపీలో ఎక్కువగా చేరారు. ఆ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత చాలామంది జనసేన, బీజేపీలో చేరిపోయారు. గత కౌన్సిల్‌లో పదవుల్లో ఉన్నవారు పార్టీలో ఆధిపత్యాన్ని సహించలేక వైసీపీని వీడారు. ఆ ప్రభావం ఈ ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. అందుకే జగన్ పార్టీకి భారీ ఓటమి ఎదురైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.