Prime Minister to the district after 35 years 35 ఏళ్ల తరువాత జిల్లాకు ప్రధాని
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:37 AM
Prime Minister to the district after 35 years జిల్లాకు ప్రధాన మంత్రుల రాక నాటి నుంచే మొదలైంది. వివిధ సందర్భాల్లో ప్రధాన మంత్రులు జిల్లాను సందర్శించారు. అయితే చివరిగా రాజీవ్‌గాంధీ వచ్చారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం(35ఏళ్లు) తర్వాత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వస్తున్నారు.
35 ఏళ్ల తరువాత
జిల్లాకు ప్రధాని
చివరిగా 1991లో రాజీవ్‌గాంధీ విజయనగరం రాక
అంతకు ముందు 1983లో ఇందిరాగాంధీ
1978లో అశోక్‌కు మద్దతుగా మొరార్జీదేశాయ్ ప్రచారం
1973లో ముఖ్యమంత్రి హోదాలో పీవీ నరసింహారావు
జన సంఘ్, జై ఆంధ్రా ఉద్యమ ప్రచారంలో వాజ్‌పేయి
ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి వస్తున్న మోదీ
విజయనగరం, జూలై 31(ఆంధ్రజ్యోతి): జిల్లాకు ప్రధాన మంత్రుల రాక నాటి నుంచే మొదలైంది. వివిధ సందర్భాల్లో ప్రధాన మంత్రులు జిల్లాను సందర్శించారు. అయితే చివరిగా రాజీవ్‌గాంధీ వచ్చారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం(35ఏళ్లు) తర్వాత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వస్తున్నారు. అంతకుముందు ప్రధానమంత్రులుగా ఉన్న మొరార్జీ దేశాయ్, ఇందిరాగాంధీలు జిల్లాకు రావడం విశేషం. అదే సమయంలో ప్రధానులు కాక ముందే అటల్ బిహారీ వాజ్‌పేయ్, పీవీ నరసింహరావులు జిల్లాకు విచ్చేశారు. ముఖ్యమంత్రి హోదాలో పీవీ నరసింహారావు, జనసంఘ్ నాయకుడిగా వాజ్‌పేయ్ రావడం విశేషం. అయితే ఇప్పటివరకూ వచ్చిన ప్రధానులు ఎక్కువగా ఎన్నికల ప్రచారానికి హాజరైనవారే. తొలిసారిగా ఉత్తరాంధ్రకు, నవ్యాంధ్రప్రదేశ్‌కు కీలకమైన ప్రాజెక్టుగా భావిస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండడం విశేషం.
- అటల్ బిహారీ వాజ్‌పేయికి విజయనగరంతో మంచి అనుబంధం ఉంది. తొలిసారిగా 1967 జన్ సంఘ్ నాయకుడి హోదాలో విచ్చేశారు. జైఆంధ్రా ఉద్యమ సమయంలో కూడా వచ్చారు. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసిన సీహెచ్ రామారావు తరుపున ప్రచారం చేసేందుకు కూడా విచ్చేశారు.
- 1971 సెప్టెంబరు 30న ఉమ్మడి ఏపీకి పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. 1973 జనవరి 10 వరకూ ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలోనే విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొన్నారు. రాజీవ్‌గాంధీ మరణం తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఈ దేశానికి ప్రధాని అయ్యారు.
- 1978 ఎన్నికల సమయంలో ప్రధానిగా ఉన్న మొరార్జీదేశాయ్ విజయనగరం వచ్చారు. జనతా పార్టీ తరుపున ఎన్నికల ప్రచారానికి కూడా హాజరయ్యారు. ఆ ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా అశోక్‌గజపతిరాజు తొలిసారిగా బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో అశోక్‌కు మద్దతుగా ప్రచారం చేసేందుకు మొరార్జీ దేశాయ్ విజయనగరం వచ్చారు. ఈ ఎన్నికల్లో గెలిచిన అశోక్‌గజపతిరాజు అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు.
- 1983లో ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ కూడా జిల్లాలో పర్యటించారు. నాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత తొలి ఎన్నికలు జరిగాయి. అప్పటికే దశాబ్దాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతూ వచ్చింది. నాటి ఎన్నికల్లో ఎన్టీ రామారావు ప్రచార ప్రభంజనం వీచింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ విజయనగరంలో పర్యటనకు రావడం విశేషం. మహారాజా స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు.
- రాజీవ్‌గాంధీ ప్రధాని హోదాలో 1991 మే 21న విజయనగరం జిల్లాలో పర్యటించారు. బొబ్బిలి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పూసపాటి ఆనందగజపతిరాజుకు మద్దతుగా ప్రచారం చేశారు. విజయనగరంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌తో పాటు కంటోన్మెంట్ ప్రాంతంలో ఆయన ప్రచారం జరిగింది. ఇక్కడి నుంచి తమిళనాడు వెళ్లిన ఆయన ఆ రాత్రే పెరంబదూర్‌లో దురదృష్టవశాత్తూ మానవ బాంబుకు గురై దుర్మరణం చెందారు. మళ్లీ 35 సంవత్సరాల తరువాత ప్రధాని హోదాలో జిల్లాలో నరేంద్ర మోదీ అడుగుపెడుతున్నారు.