Share News

Prices Soar High! అ‘ధర’హో!

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:31 PM

Prices Soar High! జిల్లాలో పామాయిల్‌ రైతుల పంట పండింది. ఈ ఏడాది టన్ను పామాయిల్‌ ధర అమాంతం పెరిగింది. గతేడాది ఈ సీజన్‌లో టన్ను ధర రూ.17వేల నుంచి రూ.18 వేల వరకూ ఉండగా.. ప్రస్తుతం రూ.23,840 పలుకుతోంది. ఈ ఏడాది దిగుబడి తగ్గినా ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Prices Soar High! అ‘ధర’హో!
పామాయిల్‌ తోట

  • గతేడాదితో పోలిస్తే భారీగా పెరుగుదల

  • ఆనందంలో రైతులు

గుమ్మలక్ష్మీపురం, జూన్‌2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పామాయిల్‌ రైతుల పంట పండింది. ఈ ఏడాది టన్ను పామాయిల్‌ ధర అమాంతం పెరిగింది. గతేడాది ఈ సీజన్‌లో టన్ను ధర రూ.17వేల నుంచి రూ.18 వేల వరకూ ఉండగా.. ప్రస్తుతం రూ.23,840 పలుకుతోంది. ఈ ఏడాది దిగుబడి తగ్గినా ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాలో ఆయిల్‌ పామ్‌ సాగవుతోంది. సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, జియ్యమ్మవలస, కురపాం, గుమ్మలక్ష్మీపురం తదితర మండలాల్లో ఎక్కువగా ఈ తోటలు ఉన్నాయి. ఈ ప్రాంత రైతులు తమ పంటను కురుపాం, గరివిడి, రాజాం తదితర ప్రాంతాల్లో పామాయిల్‌ క్రషింగ్‌ మిల్లులకు తరలిస్తుంటారు. కాగా పామాయిల్‌ సాగులో రాష్ట్రంలో ఉమ్మడి విజయనగరం జిల్లా రెండో స్థానంలో ఉంది. ఐటీడీఏ హార్టికల్చర్‌శాఖ మరింతగా ప్రోత్సహిస్తే మన్యం జిల్లాలో జీడితో పాటుగా పామాయిల్‌ సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ‘ ప్రభుత్వ ప్రోత్సాహంతో మన్యం జిల్లాలో రైతులు పామాయిల్‌ తోటలు వేస్తున్నారు. దిగబడి ఆశాజనకంగా ఉన్న కారణంగా ఎక్కువమంది ఆసక్తి చూపిస్తున్నారు. ’ అని ఆయిల్‌పామ్‌ రైతుల జాయింట్‌ సెక్రటరీ ఎస్‌.శేఖర్‌పాత్రుడు తెలిపారు.

Updated Date - Jun 02 , 2026 | 11:31 PM