Share News

prices are up ధరాభారం

ABN , Publish Date - Sep 09 , 2026 | 12:04 AM

prices are up ఉల్లి ఘాటెక్కింది. పంచదార చేదెక్కుతోంది. నూనెల ధరలు సలసలమండుతున్నాయి. బియ్యం ధర ఉడికి పోతోంది. కూరగాయల ధరలు చెప్పనవసరం లేదు. పప్పులు, ఉప్పుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వంటింట్లో అవసరమైన అన్నిరకాల వస్తువుల ధరలు అందనంత దూరానికి ఎగబాకుతున్నాయి.

prices are up ధరాభారం

ధరాభారం

పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలు

పంచదార కిలోపై రూ.25 పెంపు

ఉల్లి కిలో రూ.60

ఎప్పటికప్పుడు మారిపోతున్న సన్నబియ్యం ధర

రెండు నెలల వ్యవధిలో రూ.320 పెరుగుదల

సామాన్య, మధ్యతరగతి ప్రజల విలవిల

ఉల్లి ఘాటెక్కింది. పంచదార చేదెక్కుతోంది. నూనెల ధరలు సలసలమండుతున్నాయి. బియ్యం ధర ఉడికి పోతోంది. కూరగాయల ధరలు చెప్పనవసరం లేదు. పప్పులు, ఉప్పుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వంటింట్లో అవసరమైన అన్నిరకాల వస్తువుల ధరలు అందనంత దూరానికి ఎగబాకుతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. ఒక్కో కుటుంబ జీవనంపై 20 నుంచి 30 శాతం అదనపు భారం పడుతోంది. శ్రావణమాసం కావడం..వరుసగా పండుగలు సమీపిస్తుండడంతో పెరిగిన ధరలు చూసి సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో మున్ముందు ధరలు మరింత పెరుగుతాయని చెబుతుండడంతో అన్ని వర్గాల్లో ఆందోళన నెలకొంది.

- విజయనగరానికి చెందిన రాజేష్‌ ఓ చిరుద్యోగి. కుటుంబ పోషణకు నిత్యావసరాలు, కూరగాయాలు, ఇతర అవసరాలకు నెలకు రూ.15 వేలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు అన్నిరకాలపై పెరిగిన ధరలతో ఖర్చు రూ.20 వేలు పైమాటే. దీంతో ఇతరత్రా కుటుంబ అవసరాలను తగ్గించుకోవాల్సిన అనివార్య పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు.

- నగరానికి చెందిన పైడిపునాయుడు తన కుటుంబ అవసరాల కోసం నెలకు 30 కిలోల బియ్యం వినియోగిస్తుంటాడు. సన్నబియ్యానికి అలవాటు పడడంతో ప్రతినెలా 25 కిలోల బియ్యం కొనుగోలు చేస్తుంటాడు. జూన్‌ వరకూ 25 కిలోల బస్తా రూ.1280 వరకూ లభించింది. ఆగస్టు నెలాఖరున అదే బస్తా రూ.1600 వరకూ చేరుకుంది. ఈ రెండు నెలల వ్యవధిలోనే రూ.320 పెరగడంతో లబోదిబోమంటున్నాడు.

విజయనగరం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి):

నిత్యావసరాలలో పంచదారది కీలక పాత్ర. చాలా తినుబండారాల తయారీలో పంచదార అవసరం. ధర చూస్తే పరుగులు పెడుతోంది. నెలరోజుల్లోనే కిలో వద్ద రూ.25కు పెరిగింది. ప్రస్తుతం రూ.71కు చేరుకుంది. బ్రాండెడ్‌ పేరుతో రూ.80 వరకూ విక్రయిస్తున్నారు. ఈ కారణంగా పంచదారతో చేసే అన్ని ఉత్పత్తుల ధరలు పెరిగాయి. స్వీట్ల ధరలు పెంచేశారు. టీస్టాళ్లతో పాటు ఇతర దుకాణాలు, బేకరీ ఉత్పత్తుల ధరలు కూడా పెరిగిపోయాయి. వాస్తవానికి గృహ అవసరాల కంటే హోటళ్లు, స్వీట్‌ సెంటర్లలోనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలో రూ.50 నుంచి రూ.71కు పెరగడంతో సామాన్యులు అయోమయంలో పడుతున్నారు.

- ప్రభుత్వం రేషన్‌ ద్వారా బియ్యం అందిస్తున్నా ఎగువ మధ్యతరగతితో పాటు ఉద్యోగులు, వ్యాపారులు ఎక్కువగా సన్నబియ్యం వినియోగిస్తుంటారు. సన్నబియ్యం ధర సైతం అందనంత పైకి ఎగబాకుతోంది. గత రెండు నెలల కాలంలో 25 కిలోల బస్తా వద్ద రూ.370 ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జూన్‌లో బస్తా రూ.1280-రూ.1300 మధ్య ఉండేది. ప్రస్తుతం రూ.1600, రూ.1670 వరకూ చేరుకుంది. ఇద్దరు పిల్లలున్న కుటుంబంలో రోజుకు సగటున కిలో చొప్పున నెలలో 30 కిలోల వరకూ వినియోగిస్తున్నారు. దీంతో ఖర్చు భారీగా పెరుగుతోంది. జీవనంపై ప్రభావం చూపుతోంది. ఇటీవల ప్రభుత్వం రాయితీపై సన్నబియ్యం అందిస్తుండడం కొంతవరకు ఉపశమనం కలుగుతోంది.

మూడు నెలల నుంచే నూనెలు..

వంట నూనెల ధరలు గురించి చెప్పనక్కర్లేదు. పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం తక్షణం వంటనూనెపై పడింది. అప్పటి నుంచి ధర పెరుగుతూ వస్తోంది. వేరుశనగ నూనె కిలో రూ.185 నుంచి రూ.190 మధ్య పలుకుతోంది. సన్‌ఫ్లవర్‌ నూనె రూ.180 నుంచి రూ.185లు అయ్యింది. పామోలిన్‌ ఆయిల్‌ అయితే రూ.160కు చేరుకుంది.

- వంటింట్లో పప్పులది ప్రధాన పాత్ర. కానీ ఏ పప్పును టచ్‌చేసినా ధర భగ్గుమంటోంది. కందిపప్పు ధర రూ.164కు చేరుకుంది. వేరుశనగ ధర రూ.185 పైమాటే. నాణ్యత బాగుండి బ్రాండెడ్‌ పేరుతో కిలో రూ.200 వరకూ విక్రయిస్తున్నారు. ఇలా అన్నిరకాల ధరలు పెరుగుదలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం తప్పడం లేదు.

ఇల్లు గడవడం కష్టం

ఒక్కసారిగా ధరలు పెరిగిపోయాయి. ఇంట్లో అవసరాలకు సంబంధించి ప్రతి వస్తువు ధర పెరిగింది. ఇదేమని ప్రశ్నిస్తుంటే కరువు పరిస్థితులు అని చెబుతున్నారు. వర్షాలు పడకపోవడం వల్లేనని అంటున్నారు. ఇలా అయితే ఇల్లు ఎలా గడిచేది.

- శాంతమ్మ, గృహిణి, విజయనగరం

చాలా ఇబ్బందికరం..

ఇటు నిత్యావసరాలు, అటు కూరగాయలు ఒకేసారి పెరిగాయి. మూడు నెలల కిందట యుద్ధం పేరు చెప్పారు. ఇప్పుడు ఎల్‌నినో కారణమని చెబుతున్నారు. ఎలా చూసినా సామాన్యుడుపైనే అదనపు భారం పడుతోంది. కుటుంబ జీవనానికి ఇబ్బందికరంగా మారుతోంది.

- వరలక్ష్మి, గృహిణి, విజయనగరం

---------------------

కిలో రూ.80 పైనే

ఆకాశంలో కూరగాయల ధరలు

బొబ్బిలి రూరల్‌, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): మధ్యతరగతి, పేద ప్రజలను కూరగాయల ధరలు నిరాశ పరుస్తున్నాయి. టమాటా నెల ముందు కిలో 20 రూపాయలకు దొరికేది. ఇప్పుడు రూ.50కి చేరుకుంది. ఇతర కాయగూరలదీ అదే పరిస్థితి. బొబ్బిలి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరింత అధిక ధర పలుకుతున్నాయి. వంకాయలు రూ.90 దాటి అమ్మడం ఇదే తొలిసారి అని స్థానికులు అంటున్నారు. బీరకాయలు కిలో రూ.80, దొండకాయలు కిలో రూ.70, క్యారెట్‌ కిలో రూ.100, బెండకాయలు కిలో రూ.80, చిక్కుడుకాయలు కిలో రూ.80, కొత్తిమీర కట్ట రూ.20, పచ్చిమిరపకాయలు కిలో రూ.120, కీరా దోసకాయలు కిలో రూ.80, అల్లం కిలో రూ. 120, తెల్లఉల్లి కిలో రూ.160 ఇలా కూరగాయలు ధరలు పైపైకి పెరుగుతూ మధ్యతరగతి కుటుంబాలను దగ్గరకు రానీయకుండా చేస్తున్నాయి. వందల్లో ఖర్చు చేసినా సంచి నిండడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాకు పెద్ద మార్కెట్‌ అయిన రామభద్రపురం నుంచి రోజూ 20 నుంచి 30 టన్నుల వరకు బొబ్బిలి, విజయనగరం, ఒడిశా రాయగడ తదితర ప్రాంతాలకు కూరగాయలు ఎగుమతి అవుతుంటాయి. బొబ్బిలి మార్కెట్‌కు అలజంగి, కొత్తపెంట, రంగరాయపురం, పాతబొబ్బిలి, రామభద్రపురం తదితర ప్రాంతాల నుంచి నిత్యం సుమారు 60 టన్నుల వరకు కూరగాయలు చేరుతుంటాయి. కొన్ని రోజులుగా 10 టన్నులకు మించి రావడం లేదు. మరోవైపు పనులు చేసుకుంటూ జీవనం సాగించే వందలాది మంది కూలీలకు సైతం ఉపాధి తగ్గింది.

- బొబ్బిలిలో రైతు బజారు లేకపోవడంతో పేదలు ఇక్కట్లు పడుతున్నారు. గిట్టుబాటు ధరకు కూరగాయలు విక్రయించుకొనేందుకు ఇటు రైతులకూ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో దళారులదే ఇష్టారాజ్యంగా మారింది.

- రైతు బజారు లేకపోవడం, దళారుల ప్రమేయం, మార్కెటింగ్‌ శాఖ పర్యవేక్షణ లేకపోవడం, చిల్లర వ్యాపారులంతా సిండికేట్‌ కావడం, తీవ్ర వర్షాభావం తదితర కారణాల వల్లే ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు.

----------------------

Updated Date - Sep 09 , 2026 | 12:04 AM