Share News

Prices Are Hitting Hard! బె‘ధర’కొడుతున్నాయ్‌!

ABN , Publish Date - May 19 , 2026 | 11:23 PM

Prices Are Hitting Hard! పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఎరువుల ధరలు భగ్గుమంటున్నాయి. యూరియా, డీఏపీ మినహాయిస్తే.. అధిక శాతం కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి.

Prices Are Hitting Hard! బె‘ధర’కొడుతున్నాయ్‌!
ఎరువుల బస్తాలు

  • భారీగా పెరగనున్న సాగు వ్యయం

  • ఆందోళనలో ఖరీఫ్‌ రైతులు

పాలకొండ, మే18(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఎరువుల ధరలు భగ్గుమంటున్నాయి. యూరియా, డీఏపీ మినహాయిస్తే.. అధిక శాతం కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నెలతో పోల్చి చూసుకుంటే కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు బస్తాకు రూ.350 నుంచి రూ.750 వరకు పెరిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే ఖరీఫ్‌లో సాగు ఎలా? చేపట్టగలమని మథనపడుతున్నారు. ‘పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా మన దేశానికి ముడిసరుకు సరఫరా కావడం లేదని, అందుకే ఎరువుల ధరలకు రెక్కలొచ్చాయి.’ అని వ్యాపార వర్గాలు చెబు తున్నాయి. జిల్లాలో 70 శాతం మంది ప్రజలకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఏటా ఖరీఫ్‌లో నాలుగు లక్షల ఎకరాల్లో వరి, మరో రెండు లక్షల ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, అరటి, ఇతర వ్యవసాయ పంటలను సాగు చేస్తుంటారు. కాగా తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుపై ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో అన్నదాతలు అధికంగా వినియోగించే 20.20.0.13. రకం ఎరువు భస్తా ధర భారీగా పెరిగింది. ఇందులో 13 శాతం గంధకం ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే దీని ధర సుమారు 133 శాతం వరకు పెరిగినంది. ఇప్పటికే పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు ఇలా..

20.20.0.13 రకం ఎరువు బస్తా ధర (50 కిలోలు) ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.1500 ఉండగా, ప్రస్తుతం రూ.2,250కు పెరిగింది. 14.35.14 రకం ధర రూ.2.150 నుంచి రూ.2,350కు ఎగబాకింది. 10.26.26 రకం ధర రెండు నెలల కిందట రూ.1950 ఉండగా, ప్రస్తుతం రూ.2,250కు చేరింది. పొటాష్‌ ధర రూ.1850 నుంచి రూ.1975కు పెరిగింది.

యూరియా, డీఏపీకు తప్పని డిమాండ్‌...

కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు భగ్గుమంటుండడంతో కేంద్రం రాయితీపై పంపిణీ చేసే యూరియా, డీఏపీను రైతులు అధికంగా వినియోగించే అవకాశం ఉంది. దీంతో వాటికి డిమాండ్‌ పెరగ్గా.. భవిష్యత్తులో కొరత ఏర్పడే పరిస్థితి లేకపోలేదు. ఏదేమైనా రాయితీలు ఇచ్చి పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను తగ్గించకపోతే వచ్చే ఖరీఫ్‌లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవనున్నాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా ఎరువుల కోసం రైతులకు గుర్తింపు కార్డులను ఇవ్వనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు సరఫరా చేస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.

ఇండెంట్‌ ఇలా..

జిల్లాలో ఈ ఖరీఫ్‌కు 22 వేల మెట్రిక్‌ టన్నులు యూరియా, 11 వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ, నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల పొటాష్‌తో పాటు 5 వేల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం. వాటికి సంబంధించి వ్యవసాయాధికారులు ఇండెంట్‌ పెట్టారు. ఇప్పటికే రైతు సేవా కేంద్రం, మార్క్‌ఫెడ్‌లో కొన్ని ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన నిల్వలు త్వరలోనే జిల్లాకు వస్తాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

సిద్ధం చేస్తున్నాం..

ఈ ఏడాది ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే ఏయే రకాల ఎరువులు ఎంత ఉండాలో ప్రతిపాదించాం. కొన్ని రకాల ఎరువుల నిల్వలు ఉన్నాయి. వాటి ధరలు పెరిగినప్పటికీ రైతులకు అవసరమైన అన్ని రకాలను అందుబాటులో ఉంచుతున్నాం.

- అన్నపూర్ణ, డీడీవో, వ్యవసాయ శాఖ, పార్వతీపురం మన్యం

Updated Date - May 19 , 2026 | 11:23 PM