Prices Are Hitting Hard! బె‘ధర’గొడుతున్నాయ్!
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:32 PM
Prices Are Hitting Hard! పశ్చిమాసియా యుద్ధం సెగ గ్యాస్‌తో పాటు వంట నూనెపై కూడా పడింది. ప్రస్తుతం వాటి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో లీటరు నూనె ధర రూ.140 నుంచి రూ.155 వరకు ఉండగా నేడు రూ.170 నుంచి రూ.190 వరకు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.200 నుంచి రూ.220 వరకు అమ్మకాలు చేస్తున్నారు.
బెంబేలెత్తిపోతున్న ప్రజలు
పాలకొండ, మార్చి22(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధం సెగ గ్యాస్‌తో పాటు వంట నూనెపై కూడా పడింది. ప్రస్తుతం వాటి ధరలు అమాంతం పెరిగాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో లీటరు నూనె ధర రూ.140 నుంచి రూ.155 వరకు ఉండగా నేడు రూ.170 నుంచి రూ.190 వరకు విక్రయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.200 నుంచి రూ.220 వరకు అమ్మకాలు చేస్తున్నారు. లోకల్ బ్రాండ్ ఆయిల్ ధర గతంలో రూ.120 నుంచి రూ.140 వరకు ఉండగా.. ప్రస్తుతం మార్కెట్‌లో అవి రూ.160 నుంచి రూ.180 వరకు పలుకుతున్నాయి. 15 లీటర్ల ఆయిల్ డబ్బా ప్రముఖ కంపెనీలది అయితే గత నెలలో రూ.2,400 ఉండగా, ప్రస్తుతం రూ.2,900కు చేరింది. లోకల్ బ్రాండ్ ఆయిల్ 15 లీటర్ల ధర గత నెలలో రూ.2,200 ఉండగా ప్రస్తుతం రూ.2,700 వరకు చేరింది. నెల రోజుల వ్యవధిలోనే లీటరు ప్యాకెట్‌పై రూ.20 నుంచి రూ.30, 15 లీటర్ల డబ్బా నూనెపై రూ.400 నుంచి రూ.500 వరకు పెరిగింది. అయితే నిత్యావసరాల ధరల పెంపును పర్యవేక్షించే వారే కరువ య్యారు. వాస్తవానికి యుద్ధం ప్రభావం వంట నూనెపై ఉండదని ఆర్థిక నిపుణులు చెబుతున్నా.. స్థానిక వ్యాపారులు మాత్రం ఇష్టానుసారంగా నూనె ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దీనిపై పాలకొండ తహసీల్దార్ రాధాకృష్ణమూర్తిని వివరణ కోరగా.. ‘వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి వంట నూనెలను అధిక ధరలకు విక్రయిస్తే సహించేది లేదు. షాపుల్లో తనిఖీలు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.
అదనపు భారమే..
ప్రస్తుతం మార్కెట్‌లో నూనెధరలు ఒక్కసారిగా పెరిగాయి. మా కుటుంబంపై రూ.250 నుంచి రూ.300 వరకు అదనపు భారం పడుతుంది. ప్రతి నెలా మేము ఎనిమిది లీటర్ల వరకు వంట నూనె వినియోగిస్తున్నాం. ప్రస్తుతం లీటర్‌పై రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగింది. దీంతో ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.
- యందవ స్రవంతి, గృహిణి, పాలకొండ
==================================
నష్టపోతున్నాం..
నేను తోపుడు బండిపై తినుబండారాలు విక్రయించుకుని జీవనం సాగిస్తున్నాను. మాకు ప్రతి నెలా సుమారు 75 కిలోల వరకు వంటనూనెను అవసరం. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో 15 కిలోల ఆయిల్ డబ్బా పై రూ.350 నుంచి రూ.400 వరకు అదనంగా చెల్లిస్తున్నాం. దీంతో రూ.2 వేల నుంచి రూ3 వేలు వరకు నష్టపోతున్నాం.
- పాడి జ్యోతి,, గృహిణి, బుక్కూరు