Share News

Price Shock” ధరాఘాతం

ABN , Publish Date - May 19 , 2026 | 12:17 AM

Price Shock” పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రభావం పరోక్షంగా జిల్లాలో నిర్మాణరంగంపై పడుతోంది. నిర్మాణ సామగ్రి ధరలన్నీ అమాంతం పెరిగి పోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Price Shock” ధరాఘాతం
మక్కువలో ముందుకు సాగని గృహ నిర్మాణాలు

  • ఇతర నిర్మాణ సామగ్రి పరిస్థితీ అంతే..

  • జోరందుకోని నిర్మాణాలు

  • ఉపాధికి దూరమవుతున్న కార్మికులు

మక్కువ రూరల్‌, మే 18(ఆంద్రజ్యోతి): పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం ప్రభావం పరోక్షంగా జిల్లాలో నిర్మాణరంగంపై పడుతోంది. నిర్మాణ సామగ్రి ధరలన్నీ అమాంతం పెరిగి పోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొన్నిచోట్ల నిర్మాణాలకు బ్రేక్‌ పడింది. దీంతో భవన నిర్మాణరంగ కార్మికులకు ఉపాఽధి కరువవుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో టన్ను ఐరెన్‌ ధర రూ.54 వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.73వేలకు చేరింది. నాణ్యమైన ఐరన్‌ అయితే టన్ను రూ.76వేల వరకు పలుకుతోంది. సిమెంటు బస్తా ఽధర ఫిబ్రవరిలో రూ. 280 నుంచి రూ.300 మధ్యలో ఉండేది. అయితే నేడు దాని ధర రూ.450కు చేరింది. రోడ్లు, భవనాల శ్లాబ్‌లకు వాడే మెటల్‌ యూనిట్‌ ధర రూ.3500 నుంచి రూ.4500కు పెరిగింది. దీని అదనంగా ట్రాన్స్‌పోర్టు చార్జీలు దూరాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2000 వరకు చెల్లించాల్సి వస్తోంది. మక్కువ తదితర ప్రాంతాల్లో ఏటా వేసవి సీజన్‌లో రోజుకు 30 టన్నుల ఐరెన్‌, 2 వేల వరకు సిమెంటు బస్తాలు అమ్ముడయ్యేవి. తాజా పరిస్థితుల నేపథ్యంలో రోజుకు టన్ను ఐరెన్‌, వంద సిమెంట్‌ బస్తాలు కూడా అమ్ముడుపోవడం వ్యాపారులు వాపోతున్నారు.

ఇక గ్రామాల్లో నిర్మించే బీటీ రోడ్లకు ఉపయోగించే జీఎస్పీ, వెట్‌మిక్స్‌ ధరలను సైతం క్వారీ యజమానులు భారీగానే పెంచేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో పాటు రా మెటీరియల్‌ పైన మైనింగ్‌ శాఖ యూనిట్‌కు రూ.వెయ్యి పెంచినట్లు వారు చెబుతున్నారు. మొత్తంగా రా మెటీరియల్‌ ధర యూనిట్‌కు రూ.1200వరకు పెరగ్గా, ట్రాన్స్‌పోర్టు చార్జీల భారం రూ.1500 వరకు పడుతోంది. దీంతో చాలామంది నిర్మాణాలు చేపట్టడం లేదు. ముఖ్యంగా పట్టణ, గ్రామీణ ప్రాం తాల్లో లబ్ధిదారులు గృహ నిర్మాణాలకు ముందుకు రావడం లేదు. కొన్నిచోట్ల మాత్రం పనులు నత్తనడకన సాగుతున్నాయి. సిమెంటు, ఐరెన్‌ ధరలతోపాటుగా లేబర్‌ రేట్లు, ట్రాన్స్‌పోర్టు చార్జీలన్నీ అమాంతంగా పెరిగిపోవడంతో నిర్మాణదారులు పనులకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో కూలీలు ఉపాధికి దూరమవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. కాగా నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల ప్రభావం గృహ నిర్మాణంపై పడుతోందని హౌసింగ్‌ ఏఈ సింహాచలం తెలిపారు. ఐరెన్‌, సిమెంట్‌ తమ శాఖ తరఫున లబ్ధిదారులకు ఇస్తున్నా.. పనులు ఊపందుకోవడం లేదని వెల్లడించారు.

Updated Date - May 19 , 2026 | 12:17 AM