Share News

Prevent Child Marriages బాల్య వివాహాలను అరికట్టాలి

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:57 PM

Prevent Child Marriages జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం మహిళా సంరక్షణ కార్యదర్శులు బాధ్యతా యుతంగా పనిచేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సచివాలయ మహిళా పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించారు.

Prevent Child Marriages బాల్య వివాహాలను అరికట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

పార్వతీపురం, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. ఇందుకోసం మహిళా సంరక్షణ కార్యదర్శులు బాధ్యతా యుతంగా పనిచేయాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సచివాలయ మహిళా పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గ్రామ, వార్డు పరిధిలోని మహిళలు, చిన్నారుల భద్రతను పర్యవేక్షించాలి. జిల్లాలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకూడదు. గృహహింస వంటి కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. వారికి చట్టాలపై అవగాహన కల్పించాలి. గంజాయి, సారా, మద్యం అక్రమ రవాణా, జూదంపై దృష్టి సారించాలి. స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వాటి సమాచారం అందించాలి. అపరిచిత, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా తప్పనిసరి. సైబర్‌ నేరాలపై ప్రజలను మరింత అప్రమత్తం చేయాల్సి ఉంది. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, పౌష్టికాహారం పంపిణీపై దృష్టి సారించాలి. వ్యక్తిగత మరుగుదొడ్లను వాడుకలోకి తీసుకురావాలి. గ్రామాలను బహిరంగ మలవిసర్జన రహితంగా మార్చాలి. ఎవరూ ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వినియోగించకుండా చూడాలి.’ అని తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ కనకదుర్గ, ఏఎస్పీ మనీషారెడ్డి, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:57 PM