Pressure isn't right, 'Guru'. ఒత్తిడి సరికాదు ‘గురూ’
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:16 AM
Pressure isn't right, 'Guru'. విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హోంవర్క్ చేయలేదని టీచర్ కాస్తా కఠినంగా అడిగేసరికి ఆరేళ్ల చిన్నారి కుప్పకూలిపోయాడు. గుండెపగిలి చనిపోయాడు. అయితే ఇక్కడ టీచర్ వేధింపులు అని చెప్పలేం కానీ.. తీవ్ర ఒత్తిడికి గురై ఆ చిన్నారి ఆరేళ్ల ప్రాయంలోనే గుండెపోటుకు గురికావడం అనేది గుర్తించాల్సిన విషయం.
ఒత్తిడి సరికాదు ‘గురూ’
చిన్నారులపై చదువుల భారం
పసిప్రాయం నుంచే మితిమీరుతున్న ఒత్తిడి
పరీక్షలు, ర్యాంకులు అంటూ ప్రయోగాలు
తరగతి గదిలో భయంమాటున పిల్లలు
మానసిక రుగ్మతలతో ఆరోగ్యంపై ప్రభావం
తల్లిదండ్రులు బాధ్యతగా ఉండకపోతే ముప్పే
విశాఖ ఘటన ప్రతిఒక్కరికీ ఒక గుణపాఠం
- విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హోంవర్క్ చేయలేదని టీచర్ కాస్తా కఠినంగా అడిగేసరికి ఆరేళ్ల చిన్నారి కుప్పకూలిపోయాడు. గుండెపగిలి చనిపోయాడు. అయితే ఇక్కడ టీచర్ వేధింపులు అని చెప్పలేం కానీ.. తీవ్ర ఒత్తిడికి గురై ఆ చిన్నారి ఆరేళ్ల ప్రాయంలోనే గుండెపోటుకు గురికావడం అనేది గుర్తించాల్సిన విషయం.
విజయనగరం కలెక్టరేట్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని చాలామంది తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు. పూర్వ ప్రాథమిక స్థాయిలోనే భాష, గుణింతం, గణితాలను నేర్చుకోవాలనే ఆత్రం విపరీతంగా కనిపిస్తోంది. అందుకోసం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల వైపు క్యూకడుతున్నారు. మరికొందరైతే వేలాది రూపాయలు ఫీజులు చెల్లించి ప్లేస్కూళ్లలో సైతం చేర్పిస్తున్నారు. ఈ విధంగా ప్రాథమిక స్థాయిలోనే తప్పటడుగులు పడుతున్నాయి. పిల్లలకు గొప్ప భవిష్యత్ ఇస్తున్నామని భావిస్తున్నారే కానీ.. వారిపై విపరీతంగా ఒత్తిడి పెంచుతున్నామన్న విషయాన్ని గ్రహించడం లేదు. గత కొంతకాలంగా విద్యారంగంలో పోటీ తత్వం పెరుగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను మూడో ఏట అడుగుపెట్టగానే బడికి పంపుతున్నారు. ఇది పాఠశాల వాతావరణానికి అలవాటుపడే వయసు మాత్రమే. కానీ ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు అలా ఆలోచించడం లేదు. ర్యాంకులు, పోటీతత్వాన్ని అలవాటు చేసుకొని వారిపై హోంవర్కులు, పరీక్షలు, ప్రయోగాలు అంటూ లేత మనసుపై ఒత్తిడి పెంచుతున్నారు. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.
మనో వికాసం కీలకం..
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం అనేది కుటుంబం, పరిసరాలు, పాఠశాల వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిస్థితుల ప్రభావంతోనే చిన్నారులు చదవడం, రాయడం, వినడం, చెప్పడం, లెక్కపెట్టడం వంటి నైపుణ్యాలను నేర్చుకుంటారు. పిల్లల అభ్యాసనం ప్రధానంగా వారి శారీరక, మానసిక వికాసంపై ఆధారపడి ఉంటుంది. అది వయసుతో ముడిపడి ఉంటుంది. ఈ వికాసాన్ని బట్టి పిల్లలు క్రమంగా సరళమైన అంశాల నుంచి సంక్లిష్టమైన విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. అందుకే ఉపాధ్యాయ శిక్షణలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా బోధిస్తారు. కానీ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉన్నారా? నిబంధనల ప్రకారం బోధన సాగిస్తున్నారా? విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారా? అంటే మాత్రం సమాధానం దొరకని పరిస్థితి.
మూడేళ్లకే బడిబాట..
విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ప్రవేశానికి నిర్దిష్టంగా ఐదేళ్లు నిండి ఉండాలి. తమ పిల్లలు చిరు ప్రాయంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించాలని చాలామంది తల్లిదండ్రులు కలలు కంటున్నారు. అందుకే మూడేళ్లు నిండగానే వారిని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. అప్పటి నుంచే వారికి కంటి నిండా నిద్ర ఉండదు. మనసారా ఆటలు ఆడుకోలేరు. ఆపై బలవంతపు చదువులు, బెదిరింపులతో చిరుప్రాయంలోనే అనేక రుగ్మతల బారిన పడుతున్నారు. 30 మంది విద్యార్థులుండే తరగతి గదిలో సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేవారు ఒక్కరు కూడా ఉండడం లేదు. ఒకరికి కంటి సమస్య, మరొకరికి పంటి సమస్య, మరొకరికి అలర్జీ, ఇంకొకరికి అజీర్తి, సరైన ఎదుగుదల ఉండదు. ఆపై కొందరికి స్థూలకాయం. ఇలా చెప్పకుంటూ పోతే సమస్యలే. ఎప్పుడో ఆరుపదుల వయసులో రావాల్సిన గుండెపోటు చిరుప్రాయంలో వస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం ముమ్మాటికీ ఒత్తిడే. చిన్నారులకు అది ఇస్తున్నాం..ఇది ఇస్తున్నామనే తప్ప..వారు ఏమైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు? అని తెలుసుకునేందుకు అరగంట కూడా వారితో గడపని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. చిన్నారుల విషయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలది ఎంత బాధ్యతో..తల్లిదండ్రులది అంతకు మించి ఉండాలన్న విషయాన్ని మరిచిపోకూడదు.
స్నేహపూర్వకంగా ఉండాలి
తరగతి గదిలో ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థితో స్నేహపూర్వకంగా ఉండాలి. తరగతి గదిలో తోటి పిల్లల సమక్షంలో విద్యార్థులను గద్దించడం లేదా అవమానించడం కూడదు. అలా చేస్తే పిల్లల్లో తీవ్రమైన ఆత్మనూతన భావం, భయం పెరిగిపోతాయి. ఆ ప్రభావంతో మానసిక, శారీరక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదముంది. నువ్వు దేనికి పనికి రావు అంటూ కించపరిచేలా మాట్లాడకూడదు. విడిగా కౌన్సిలింగ్ ఇచ్చి చదువులో ఎదురవుతున్న సమస్యలను లేదా కుటుం పరిస్థితులను సావధానంగా అడిగి తెలుసుకోవాలి. మార్కుల కంటే వారి శ్రేయస్సే ముఖ్యం. విద్యార్థులకు నిరంతరం భరోసా కల్పించాలి
- డాక్టరు హేమంత్ మాధవ్, సైకియాట్రిస్ట్, విజయనగరం
సైకాలజీ బోధించాలి
విద్యా బోధనలో భాగంగా పిల్లలకు సైకాలజీ తరగతులు నిర్వహించాలి. ఈదిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రధానంగా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ ప్రైవేటు స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థుల్లో భయం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ బలహీనమైంది. పిల్లలు తాత, అమ్మమ్మ, నాన్నమ్మల వద్ద కాకుండా అమ్మనాన్నల వద్ద మాత్రమే ఉండడం వల్ల బయట పరిస్థితులు తెలియడం లేదు. పిల్లల కోసం గంట కూడా తల్లిదండ్రులు కేటాయించడం లేదు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడుతున్నారు. క్లాస్ రూంలో భయం కాకుండా భరోసా అనేది కావాలి. విద్యార్థులతో ఉపాధ్యాయులు ప్రేమగా మాట్లాడాలి. అలా ఉంటే పిల్లల్లో ఆత్మన్యూనతాభావం పోతుంది.
- రాజేష్ వారణసి, ఉపాధ్యాయుడు, జడ్పీ పాఠశాల, రెల్లివలస
------------------------