Share News

Preparing for the special TET ప్రత్యేక టెట్‌కు సన్నద్ధం

ABN , Publish Date - Aug 25 , 2026 | 12:36 AM

Preparing for the special TET ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు కూటమి ప్రభుత్వం ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించనుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

Preparing for the special TET ప్రత్యేక టెట్‌కు సన్నద్ధం

ప్రత్యేక టెట్‌కు సన్నద్ధం

నోటిఫికేషన్‌ జారీ చేసిన విద్యాశాఖ

నేటి నుండి సెప్టెంబరు 24 వరకు దరఖాస్తుకు అవకాశం

అక్టోబరు 11 నుంచి పరీక్షలు

విజయనగరం కలెక్టరేట్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి)

ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు కూటమి ప్రభుత్వం ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించనుంది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంగళవారం నుంచి సెప్టెంబరు 24 వరకు దరఖాస్తు స్వీకరణకు అవకాశం ఇచ్చారు. అక్టోబరు 11 నుంచి 21 వరకు టెట్‌ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఉపాధ్యాయ ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా టెట్‌ నిర్వహణ విధానం 2011 నుంచి అమల్లోకి వచ్చింది. అంతకంటే ముందు ఉద్యోగాలు పాందిన టీచర్లు కచ్చితంగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. దీనిపై ఉపాధ్యాయులు రాష్ట్రప్రభుత్వానికి విన్నపం ఇచ్చారు. తమకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని కోరారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేక టెట్‌ నిర్వహణకు తాజాగా షెడ్యూల్‌ జారీ చేసింది.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. టెట్‌ రాసేందుకు ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులు 2011కు ముందు ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన వారై ఉండాలి. బీఈడీ, డీఈడీలో అయితే టెట్‌ రాసేందుకు ఎటువంటి అర్హత మార్కులు లేవని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు సెప్టెంబరు 24 వరకు అవకాశం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో వివిధ మేనేజ్‌మెంట్‌ పాఠశాలల్లో 9,042 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సుమారు 5,560 మంది ఉపాధ్యాయులు 2011కు ముందు నియమాకం పొందారు. వీరిలో గతేడాది డిసెంబరులో నిర్వహించిన టెట్‌ పరీక్షల్లో కేవలం 10 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 4 నుంచి 5శాతం మాత్రమే అర్హత సాధించారు. ఇటీవల సుప్రీంకోర్టు రివ్వూ పిటీషన్‌ తీర్పులో ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈనేపథ్యంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో వారందరికీ ఊరట కలిగింది. గతంలో మాదిరిగానే 150 మార్కులకు రెండున్నర గంటల వ్యవధితో ఉండే ఈ పరీక్షలో అర్హత సాధించడానికి ఓసీ కేటగిరీ వారు 90మార్కులు (60శాతం) బీసీలు 75మార్కులు (50శాతం) ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 60మార్కులు (40శాతం) సాధించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులు ప్రత్యేక టెట్‌ నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

========

Updated Date - Aug 25 , 2026 | 12:36 AM