Preparing for the Hybrid Mahanadu హైబ్రిడ్ మహానాడుకు సన్నద్ధం
ABN , Publish Date - May 23 , 2026 | 11:42 PM
Preparing for the Hybrid Mahanadu హైబ్రిడ్ మహానాడుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. పార్టీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. కస్టర్లుగా విభజించుకుని అనుకూలమైన ప్రాంతాల్లో వేదిక నిర్ణయించనున్నారు.
హైబ్రిడ్ మహానాడుకు సన్నద్ధం
విజయనగరంలో ఐదు ప్రాంతాల్లో వేదికలు
క్లస్టర్ ఇన్‌చార్జిలతో టీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ నారా లోకేష్
జూమ్ కాన్ఫరెన్స్‌లో సూచనలు
విజయనగరం రూరల్, మే 23 (ఆంధ్రజ్యోతి): హైబ్రిడ్ మహానాడుకు టీడీపీ శ్రేణులు సన్నద్ధం అవుతున్నాయి. పార్టీ రాష్ట్రశాఖ ఆదేశాల మేరకు నియోజకవర్గాల వారీగా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. కస్టర్లుగా విభజించుకుని అనుకూలమైన ప్రాంతాల్లో వేదిక నిర్ణయించనున్నారు. ఆయా చోట్ల భారీ స్ర్కీన్లు ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం నియోజకవర్గానికి సంబంధించి పది క్లస్టర్స్ ఉన్నాయి. వీటి పరిధిలో వున్న డివిజన్లు, గ్రామాలు, నగరం, మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వేదికల వద్దకు పార్టీ శ్రేణులు హాజరుకావాల్సి ఉంటుంది.
27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇక్కడే ఉండి మహానాడును తిలకించాలి. హాజరయ్యే పార్టీ శ్రేణులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం టీ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. నగర పరిధిలోని ప్రతి డివిజన్‌లో టీడీపీ ప్రధాన కమిటీ, అనుబంధ కమిటీలు దాదాపు 50 మంది వరకూ ఉంటారు. అదే విధంగా గ్రామస్థాయిలో కూడా గ్రామం, డివిజన్ స్థాయిలో 100కి తగ్గకుండా పార్టీ కమిటీలతో పాటు అభిమానులను సమీకరించి తీసుకురావాలని అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయనగరంలోని కామాక్షినగర్‌లో ఉన్న వెలమ సంక్షేమసంఘ భవనం, తూర్పుకాపు సామాజిక భవనం, పడాలపేటలోని శ్రీనివాసా కల్యాణ మండపం, మెసానిక్ టెంపుల్, అయ్యన్నపేట రోడ్డులో వున్న లక్ష్మీనారాయణ కల్యాణ మండపంలో మహానాడు జరగనుంది. ఐదు వేదికల్లో ఏర్పాట్లపై ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆయా క్లస్టర్ ఇన్‌చార్జిలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇప్పటికే క్లస్టర్ ఇన్‌చార్జిలు తమ పరిధిలోని డివిజన్లు, గ్రామాల నాయకులు, కార్యకర్తలకు ఫోన్ చేసి మహానాడుకు తప్పనిసరిగా హాజరుకావాలని, నిర్దేశించిన సమయానికే ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు.
విజయవంతం చేయాలి
ఈ నెల 27, 28 తేదీల్లో హైబ్రిడ్ విధానంలో జరుగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసెడెంట్ నారా లోకేష్ పిలుపునిచ్చారు. శనివారం రాష్ట్రంలోని క్లస్టర్ ఇన్‌చార్జిలతో ఆయన జూమ్‌లో సమావేశం నిర్వహించారు. విజయనగరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో పాటు, పది మంది క్లస్టర్ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.