Share News

Prepared for a Rare Record అరుదైన రికార్డు కోసం సన్నద్ధం

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:46 AM

Prepared for a Rare Record Attempt మన్యం జిల్లా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈనెల 22న జిల్లాకేంద్రంలో సుమారు ఆరువేల మంది విద్యార్థినులతో కోలాటం నృత్య ప్రదర్శనకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.

Prepared for a Rare Record  అరుదైన రికార్డు కోసం  సన్నద్ధం
సీతంపేట మండలం ఇప్పగూడలో సవర సాంస్కృతిక విభాగ భవనం

  • లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో స్థానం కోసం ప్రయత్నాలు

  • వినూత్న కార్యక్రమాలతో ఇప్పటికే రాష్ట్రస్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు

పార్వతీపురం, ఏప్రిల్‌19(ఆంధ్రజ్యోతి): మన్యం జిల్లా మరో అరుదైన రికార్డు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈనెల 22న జిల్లాకేంద్రంలో సుమారు ఆరువేల మంది విద్యార్థినులతో కోలాటం నృత్య ప్రదర్శనకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రం పార్వతీపురంలో ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. నిరంతరాయంగా 18 నిమిషాల పాటు కోలాటం నృత్య ప్రదర్శన చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. రాష్ట్రం లోనే జిల్లాకు ఒక ప్రత్యేక గుర్తింపు తేవాలన్న ఆకాంక్షతో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించడం కోసం తనవంతుగా కృషి చేస్తున్నారు.

అమలవుతున్న కార్యక్రమాలివీ..

జిల్లా విద్యార్థులను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కలెక్టర్‌ ప్రారంభించిన పాఠశాల ముస్తాబు కార్యక్రమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోంది. కాగా ఇదే స్ఫూర్తితో గ్రామ ముస్తాబుతో పాటు ప్రతి ఇంటి ముస్తాబు కార్యక్రమాలను సైతం జిల్లాలో అమలు చేస్తున్నారు. కొండ శిఖర గిరిజన గ్రామాల్లో ప్రజల ఆరోగ్యం, పారిశుధ్యం మెరుగు, ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యంతో చేపడుతున్న ‘ముస్తాబు’కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రుల్లోనూ అమలు చేస్తుండడంతో రోగులకు పరిశుభ్ర , ఆహ్లాదకర వాతావరణంలో వైద్య సేవలు అందుతున్నాయి. కలెక్టర్‌ చొరవతో ప్రారంభమైన ‘ హెల్పింగ్‌ హ్యాండ్స్‌’ కార్యక్రమంలో భాగంగా వలంటీర్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి.. ఆసుపత్రుల్లో రోగులకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో గిరిజనులు, నిరక్షరాస్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కళాకారులు, విద్యార్థులను ప్రోత్సహించేందుకు ‘మన్యం డ్యాన్స్‌’ పేరిట అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ క్లినిక్‌తో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందిన జిల్లాలో లీగల్‌ ఎయిడ్‌, వినియోగదారుల క్లినిక్‌లను కూడా కలెక్టర్‌ ప్రారంభించారు. మొత్తంగా నిధులు అవసరం లేకుండా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి.. పరిపాలనలో తన మార్క్‌ను చూపించారు. ‘రాష్ట్రంలో మన్యం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటాం. ముస్తాబు అమలులో గిరిజనులు అందిస్తున్న సహకారం మరువలేనిది. ’ అని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Apr 20 , 2026 | 12:46 AM