Parvathipuram పార్వతీ‘పురం’లో పల్లెల విలీనానికి కసరత్తు
ABN , Publish Date - Feb 15 , 2026 | 12:27 AM
Preparations Underway for Village Merger in Parvathipuram
పార్వతీపురం, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం పురపాలక సంఘం పరిధిలో కొన్ని గ్రామాలను విలీనం చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. దీంతో స్థానికుల్లో గుబులు రేగుతోంది. దశాబ్దాల కిందటే ఈ ప్రక్రియకు మునిసిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. అయితే గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యతిరేకించడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. తాజాగా తిరిగి ఆ ప్రక్రియను పునఃప్రారంభించారు. పార్వతీపురం మునిసిపాలిటీలో గ్రామీణ ప్రాంతాల విలీనానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పట్టణానికి అతి సమీపంలో ఉన్న పార్వతీపురం మండలంలో లక్ష్మీనారాయణపురం, నర్సిపురం, వెంకంపేట, అడ్డాపుశీల, గోపాలపురం, సివిని, కృష్ణపల్లి, బాల గొడబతో పాటు కొమరాడ మండలంలో శివుని, విక్రంపురం, గరుగుబిల్లి మండలంలో ఉల్లిభద్ర, సీతారాంపురం గ్రామాలకు సంబంధించిన వివరాలు అందించాలని ఈ నెల పదో తేదీన పార్వ తీపురం మునిసిపల్ కమిషనర్ డి.పావని, గ్రామ పంచాయతీల కార్యదర్శులకు లేఖ రాశారు. దీంతో ఆయా ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. మునిసిపాలిటీ పరిధిలో తమ గ్రామా లు చేరితే పన్నుల భారం పడుతుందని ఆవేదన చెందుతున్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.